గౌరవప్రదంగా తప్పుకోవడం మంచిదా?

రాజకీయాల నుంచి గౌరవప్రదంగా తప్పుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అనుకుంటున్నట్లుగా ఉంది. ప్రస్తుత రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత తాను రాజకీయాల్లో కొనసాగనని, సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పడం వెనక 'గౌరవప్రద నిష్క్రమణ' ఆలోచన ఉండొచ్చు. ఆయన ఇక పరోక్షంగా (రాజ్యసభ ద్వారా) పార్లమెంటుకు వెళ్లే అవకాశం  లేదు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఏ నాయకుడికైనా రాజ్యసభకు వెళ్లే అవకాశం మూడుసార్లే ఉంటుంది. ఆయన ప్రస్తుతం నాలుగోసారి రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వెంకయ్యపై ప్రధాని మోదీ 'ప్రత్యేక ప్రేమ' కారణంగా ఈ అవకాశం వచ్చింది. 

ఎంత కావల్సిన వ్యక్తి అయినా మినహాయింపు ఒక్కసారే ఉంటుందిగాని ప్రతిసారీ ఇవ్వరు కదా. 2019లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకపోయినా వెంకయ్య రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతారు. సభ్యత్వం ముగిశాక మళ్లీ చట్టసభలో ఉండాలంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదు. రాజ్యసభకు వెళ్లడం అలుపు సొలుపు లేని పని. ఈ ఎన్నికల్లోనూ వెంకయ్యకు పోటీ ఏమీ లేదు. ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే అన్నివిధాల రిస్కు తీసుకోవాలి.

అంతో ఇంతో విలువలు పాటించే. ప్రజాస్వామ్య పద్ధతులను గౌరవించే తరానికి చెందిన వెంకయ్య ఈ కుళ్లు రాజకీయాల ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే. ఒకవేళ ఆయనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక ఉన్నా అందుకోసం ప్రస్తుత రాజ్యసభ సభ్యత్వం ముగిశాక కూడా కొన్నేళ్లు వేచివుండాలి. రాజకీయాలు మరీ ఇంత భ్రష్టుపట్టని కాలంలో ఎప్పుడో 70,80 దశకాల్లో ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు సొంత జిల్లా నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజ్యసభకు వెళ్లిపోయి అప్పటినుంచి ఇప్పటివరకు కేంద్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. 

కేంద్రంలో అనేకవిధాలుగా కీలక పాత్ర పోషించిన వెంకయ్య ఈ తరం నాయకులతో కలిసి రాష్ట్ర (ఏపీ) రాజకీయూల్లో పనిచేసే అవకాశంలేదు. ప్రత్యక్ష ఎన్నికలకు దశాబ్దాల క్రితమే దూరమయ్యారు కాబట్టి లోక్‌సభకు పోటీ చేసి నెగ్గడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే గౌరవప్రదమైన రిటైర్మెంటే బెస్ట్‌ అని అనుకుంటున్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక, ఆయన కుడిభుజం అమిత్‌ షా అధ్యక్షుడయ్యాక బీజేపీలో సీనియర్లకు ఎలాంటి గౌరవం దక్కుతున్నదో వెంకయ్య నాయుడు చూస్తూనే ఉన్నారు. 

ఆయన గురువు ఎల్‌కే అద్వానీకే దిక్కులేకుండా పోయింది. ఒకప్పటి దిగ్గజాలైన మురళీమనోహర్‌ జోషీ, యశ్వంత్‌ సిన్హా, జశ్వంత్‌ సింగ్‌ వగైరా నాయకులంతా తెర చాటుకు వెళ్లిపోయారు. కాబట్టి తన పరిస్థితి అలా కాకూడదని వెంకయ్య కోరుకుంటున్నారేమో. అసలే కుళ్లు రాజకీయాలు. దానికి తోడు వచ్చే కొత్త తరం నాయకులు వెంకయ్యవంటి సీనియర్లను ఎంతవరకు గౌరవిస్తారో తెలియదు. తరాల అంతరాన్ని జీర్ణించుకోవడం కష్టం. 

వాస్తవానికి వెంకయ్య కురువృద్ధుడైన అద్వానీ శిష్యుడు. మోదీ కూడా అదే అయినప్పటికీ అధికారంలోకి వచ్చాక ఒకప్పటి దిగ్గజాలను పక్కకు పెట్టేశారు. మోదీ వైఖరిని మొదట్లోనే పసిగట్టిన వెంకయ్య ఆయనకు అనుకూలంగా మారిపోయారు. 'వెంకయ్య పక్కన లేకపోతే కష్టం' అని మోదీ అనుకునేలా చేశారు. ఆ భావనే నిబంధనలను సడలించి నాలుగోసారి రాజ్యసభ సభ్యత్వం వచ్చేలా చేసింది. ఒకప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన వెంకయ్య ప్రధాని మోదీకి పూర్తిగా లొంగిపోయారు. 'మోదీ స్వర్గం నుంచి దిగివచ్చిన దేవుడు' అని అనేకసార్లు పొగిడారు.

మోదీతో విభేదించి బీజేపీలో మనుగడ సాగించడం కష్టమని వెంకయ్య అర్థం చేసుకున్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌దీ ఇదే పరిస్థితి. ఆమె పేరుకు మాత్రమే విదేశాంగ మంత్రిగా ఉన్నారు. వాస్తవానికి విదేశాలన్నీ చుట్టివచ్చేది మోదీ మాత్రమే. అయినా చేసేదేమీలేదు. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వెంకయ్య ఏమీ చేయలేకపోయారు. విభజన సమయంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన ఈయన దాన్ని సాధించలేక చతికిలపడిపోయారు. 

ఆ బాధ ఆయనకు లోపల ఉందేమోగాని పైకి ఏమీ మాట్లాడలేని స్థితి. అందుకే ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం ఇష్టం లేక ఎడారి రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారు. ప్రస్తుతమైతే వెంకయ్య రిటైర్మెంటు నిర్ణయం ప్రకటించారు. కాని పార్టీ ఆయన్ని వదిలిపెడుతుందా? అనేది అనుమానమే. ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీకి సేవ చేసేందుకు అడ్డేముంది? కాని సరైన ప్రాధాన్యం దక్కితేనే అదైనా సాధ్యమవుతుంది. లేదంటే  కొందరు దిగ్గజాల మాదిరిగా తెరమరుగైన నాయకుడిగా మిగిలిపోవల్సి వస్తుంది. 

Show comments