పరీక్షలకెందుకు పైశాచిక నిబంధనలు?

మన దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని నాయకులు చంకలు గుద్దుకుంటారుగాని కొన్ని విషయాల్లో ఇంత పనికిమాలిన దేశం ఎక్కడా లేదనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు షెడ్యూలు ప్రకారం జరగడమొక్కటే (పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు జరగవనుకోండి) ప్రజాస్వామ్యం అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదనిపిస్తోంది. ఎన్నికల విషయం ఎలా ఉన్నప్పటికీ దేశంలో వ్యవస్థలన్నీ దెబ్బ తిన్నాయనేది వాస్తవం. చివరకు న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు. బాగా చెడిపోయిన వ్యవస్థల్లో విద్యా వ్యవస్థను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు ఈ వ్యవస్థతో ఆడుకుంటున్నాయి. ప్రస్తుతం విద్య విజ్ఞానాన్ని అందించే సాధనంగా కాకుండా కార్పొరేట్‌ వ్యాపారమైపోయింది. దీన్ని గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఇక విద్యా వ్యవస్థలో వివిధ అంశాలకు సంబంధించి పనికిమాలిన నిబంధనలు అనేకమున్నాయి. పదో తరగతి పరీక్షలు  మొదలుకొని జాతీయస్థాయి పరీక్షల వరకు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏ ఒక్క పరీక్ష సక్రమంగా నిర్వహిస్తారనే నమ్మకం లేదు. ఏ సౌకర్యాలు లేని కాలంలో పరీక్షలు పకడ్బందీగా జరగ్గా అన్ని రకాల ఆధునిక సౌకార్యలున్న ఈ కాలంలో పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడమే కాకుండా అక్రమాలు పెరిగిపోయాయి.

ప్రశ్న పత్రాల లీకేజీలు, సిలబస్‌లో లేని ప్రశ్నలు ఇవ్వడం, ఒక ప్రశ్న పత్రానికి బదులు మరోటి ఇవ్వడం, ఒక మీడియం వారికి ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం మరో మీడియం వారికి ఇవ్వడం, తప్పుల తడకల ప్రశ్నలు ఇవ్వడం...ఇలా చెప్పుకుంటేపోతే ఎన్నో రసవత్తరమైన 'లీలలు' కనబడతాయి. జరిగే తప్పుల నుంచి పాలకులు పాఠాలు నేర్చుకోవడంలేదు. చేసిన తప్పులే చేస్తున్నారు. ఎంసెట్‌ పరీక్ష మూడుసార్లు నిర్వహించడం చూశాం కదా. ఎంట్రెన్స్‌ పరీక్షల వ్యవస్థ కూడా హేతబద్ధత లేకుండా పనికిమాలిందిగా తయారైంది. కొన్నేళ్లుగా పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. సర్కారు విధిస్తున్న నిబంధనలు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఈ నిబంధనల్లో హేతబద్ధత ఏమిటో తెలియదు. సాధారణ పరీక్షలైనా, ప్రవేశ పరీక్షలైనా సరే ఫలాన తేదీ నుంచి జరుగుతాయని ప్రకటించిన వెంటనే ఓ పనికిమాలిన నిబంధనను కూడా అధికారులు ప్రకటిస్తారు. ఏమిటది? 'ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ' అనే నిబంధన. ఈ నిబంధన ఎందుకు? ఏ ప్రయోజనం కోసం పెట్టారు? 

పరీక్షలు రాసే వారు ఆ పరీక్షల కేంద్రాల పక్కనే నివసించరు కదా. ఎక్కడెక్కడినుంచో రావల్సివుంటుంది. ఆ క్రమంలో కొంతమంది పది నిమిషాలు లేదా పావుగంట ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. మన రవాణా వ్యవస్థ, రోడ్లు, సర్కారు వాహనాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలిసిందే. ముఖ్యంగా ట్రాఫిక్‌ సమస్య ఆలస్యానికి అడ్డంకి. ఇదంతా దృష్టిలో పెట్టుకొని పావుగంట ఆలస్యంగా అనుమతించవచ్చు. ఒకప్పుడు ఇలాగే చేసేవారు. ఆలస్యంగా వచ్చినందువల్ల విద్యార్థికి రిస్కుగాని నిర్వహకులకు కాదు కదా. పరీక్ష రాసే సమయం తగ్గితే విద్యార్థికే సమస్య. 'నిమిషం' నిబంధన కారణంగా చక్కగా ప్రిపేరై వచ్చినవారు కూడా విద్యా సంవత్సరం కోల్పోయి రోదిస్తున్నారు. తాజాగా విద్యార్థినులను (అమ్మాయిలు) అవమానించిన ఘటన కేరళలో జరిగింది. ఆదివారం 'నీట్‌' ఎగ్జామ్‌ నిర్వహించారు.

కేరళలోని ఓ పరీక్షా కేంద్రంలో అమ్మాయిలను లోదస్తులు (బ్రాసరీ) తీసేసి లోపలికి వెళ్లానే నిబంధన పెట్టారు. లోపలికి వెళ్లేవారు మెటల్‌ డిటెక్టర్‌ నుంచి వెళ్లాల్సి వుంటుంది. బ్రాలకు మెటల్‌ బకిల్స్‌ ఉన్నందువల్ల మెటల్‌ డిటెక్టర్‌ నుంచి బీప్‌ శబ్దం వస్తోంది. దీంతో బ్రా తీయలని నిర్వహకులు ఒత్తిడి తెచ్చారు. ఓ పక్క పరీక్షకు టైమ్‌ అవుతుండగా మరో పక్క నిర్వహకుల (పురుషులూ ఉన్నారు) ఒత్తిడి. ఎంత అవమానకరంగా ఉంటుంది? నిజానికి లోదుస్తులు తీయాలని పరీక్షల నిబంధనల్లో లేదని విద్యార్థినులు బోరుమన్నారు. చివరకు మహిళా నిర్వాహకుల సమక్షంలో నిబంధన పూర్తి చేశారు. ఈ కేంద్రం నిర్వాహకులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది వేరే విషయం. అర్థంపర్థం లేని నిబంధనలతో ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతుంటే పరీక్షా కేంద్రాల నిర్వాహకలూ ఓవర్‌ యాక్షన్‌ చేస్తుంటారు. అంతిమంగా నష్టపోయేది విద్యార్థులు.

Show comments