జనసేనలో గంటా బంధువు

తెలుగుదేశం పార్టీతో లోపాయికారీ ఒప్పందం జనసేనకు వుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే వుంది. ఆ మాటను జనసేన ఖండిస్తూనే వుంది. కానీ చేతలు చూస్తుంటే మాత్రం గుసగుసలే నమ్మాల్సి వస్తోంది. లేటెస్ట్ గా అనకాపల్లి సీటు విషయంలో జనసేన భలే చిత్రంగా వ్యవహరించింది. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు మంత్రి గంటా శ్రీనివాసరావు అంటే కిట్టదు. ఈ విషయాన్ని ఆయన అనేకసార్లు బాహాటంగానే ప్రకటించారు. కానీ గంటా మాత్రం మెగాస్టార్ చిరంజీవికి, అల్లు అరవింద్ తదితరులకు అత్యంత ఆప్తుడు.

ఇదిలావుంటే అనకాపల్లి నియోజకవర్గం అంటే గంటాకు చాలా ఇష్టం. గతంలో ఆయన అక్కడ నుంచి ప్రజాప్రతినిధిగా పనిచేసారు. ఆయనకు అంటూ ఓ వర్గం అక్కడ వుంది. ఆ మధ్య కాంగ్రెస్-తెలుగుదేశం పొత్తు వుంటుందన్న వార్తలు వినవచ్చాయి. దాంతో గంటా ముందు జాగ్రత్తపడ్డారు. తన అత్యంత సమీప బంధువు పరుచూరి భాస్కరరావును కాంగ్రెస్ లోకి పంపించారు. అనకాపల్లి నియోజక వర్గంలో కాస్త డబ్బులు వెదజల్లి హడావుడి చేసారు. అయితే కాంగ్రెస్ ఆంధ్రలో లేచే స్థాయిలో లేదు. అందుకే మళ్లీ ప్లాన్ మార్చారు.

లాస్ట్ మినిట్ లో ఈరోజు అదే భాస్కరరావును జనసేనలోకి పంపించారు. అక్కడ టికెట్ ఇప్పించారు. దాంతో అనకాపల్లిలో చతుర్మఖ పోటీ ఏర్పడింది. తెలుగదేశం, వైకాపా, భాజపా అభ్యర్థులు ఇప్పటికే వున్నారు. ఇప్పుడు జనసేన అభ్యర్థి రంగంలోకి దిగారు. భాజపా సంగతి ఎలావున్నా, తెలుగుదేశం అభ్యర్థి పీలా గోవింద్ ఫుల్ సౌండ్.

జనసేన అభ్యర్థి పరుచూరి భాస్కర రావు కూడా ఆర్థికంగా సౌండ్ నే. ఇప్పుడు ఈ ఇద్దరితో వైకాపా అభ్యర్థి అమర్ నాధ్ పోటీపడాలి. ముఖాముఖిని త్రిముఖంగా మార్చి, దేశానికి సాయపడడమే జనసేన వ్యూహం అని జనం గుసగుసలాడుకుంటున్నారు. గంటాకు జనసేనలో నోఎంట్రీ అన్న పవన్, ఆయన అత్యంత సమీప బంధువుకు ఎలా చోటిచ్చారో ఆయనకే తెలియాలి.

కర్నూలు ఎంపీ సీటు YCPకి ఇబ్బందులు తప్పవు

సావిత్రి, క్రీడాకారుల సినిమా చూశారే! మరి ఎన్టీఆర్ దే ఎందుకిలా?

Show comments