జగన్ తీరుపై క్లారిటీ వచ్చేసింది

ఇన్నాళ్లూ ఎక్కడో చిన్న ఆశ. లోపల తెలుగుదేశం పార్టీ మీద అభిమానం వున్నా కూడా, ఎక్కడో జగన్ మీద కొద్ది మందికి అయినా చిన్న ఆశ. తెలుగుదేశం వీక్ అయిపోతోంది. జగన్ తోనే ముందుకు సాగక తప్పదేమో అన్న చిన్న అనుమానం. ఆ నేపథ్యంలో జగన్ మీద కొంచెం ఆసక్తి.  

ఇదంతా కొద్ది రోజుల క్రితం వరకు తెలుగుదేశం పునాదుల్లోంచి ఆ పార్టీ వెన్నెంటి వున్న ఓ సామాజిక వర్గానికి చెందిన కొంత మందికి వున్న ఆలోచన. హార్డ్ కోర్ తెలుగుదేశం వీరాభిమానం అన్నది బ్లడ్ లోనే వున్నా, కాలంతో మారకతప్పదు, జగన్ తో సంబంధాలు ఏదో విధంగా ఏర్పరచుకుని, ముందుకు సాగక తప్పదు అన్న ఆలోచన. 

సినిమా రంగంపై కీలక పట్టు వున్న ఆ సామాజిక వర్గ జనాల ఆలోచన కూడా అలాగే వుంది నిన్న మొన్నటి వరకు. జగన్ కు జేజేలు పలుకలేరు. పలకరు. కానీ ఏదో విధంగా పనులు సానుకూలం చేసుకుని, ఆ ప్రభుత్వంతోనే ముందుకు సాగిపోదాం అనే అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా జరిగిన మూడు పరిణామాలు ఆ ఆశల్ని చిదిమేసాయి. ఇక ఈ ప్రభుత్వం వున్నంత వరకు తమ సామాజిక వర్గ వ్యవహారాలు ఇలాగే వుంటాయన్న నిర్ణయం, నిస్పహ వచ్చేసాయి. 

ఆంధ్ర లో వైఎస్ జగన్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చాక వివిధ రంగాల్లో వున్న తెలుగుదేశం అభిమాన సామాజిక వర్గం లో కొంత వరక నిరాశ నిస్పృహలు వచ్చాయి. సినిమా రంగంలో వున్న ఆ వర్గం కూడా కొంత వరకు డీలా పడింది. కానీ కొంత మంది తమకు వున్న పరిచయాలతో జగన్ ప్రభుత్వంతో సహజీవనం చేయడానికి సిద్ద పడిపోయారు. ఏ ప్రభుత్వం వుంటే మనకేంటీ. మన పనులు జరిగితే చాలు కదా అనే భావనకు వచ్చారు. సర్దుబాటుకు అలవాటు పడుతున్నారు.

అయితే ఇటీవల జరిగిన మూడు వ్యవహారాలు పూర్తిగా క్లారిటీ ఇచ్చేసాయి. మొదటిది సినిమా రంగం మీద ఎఫెక్ట్ చూపించే టికెట్ ల ధరల వ్యవహారం. ఇది కేవలం సినిమా రంగంపై పట్టు వున్న వర్గాన్ని దెబ్బ తీయడానికి తీసుకున్న నిర్ణయం అని ఓ అనుమానం ప్రారంభమైంది. కానీ నిజానికి సినిమా థియేటర్లు అన్ని వర్గాలకు వున్నాయి. కానీ సినిమా నిర్మాణంలో మాత్రం ఓ వర్గానిది కాస్త పై చేయిగా వుంది. టికెట్ రేట్ల వ్యవహారం వల్ల ఈ వర్గం ఇప్పుడు కూడా డీలా పడింది. 

ఇదిలా వుంటే గల్లా కుటుంబానికి చెందిన అమర్ రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీ పై కాలుష్య మండలి నోటీసులు, మూసివేత, కరెంట్ కట్ వ్యవహారాలు ఈ వర్గానికి మరింత క్లారిటీ, షాక్ రెండూ ఇచ్చాయి. ఈ షాక్ కు గుంటూరు సంగం డైరీ వ్యవహారం తోడయింది. చైర్మన్ ధూళిపాల నరేంద్ర ను అరెస్ట్ చేయడం ఈ వర్గం ఆశలను పూర్తిగా నీరు కార్చేసింది. 

ఆంధ్రలో ప్రభుత్వం కేవలం ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, దానిని అణిచివేయడానికే కృషి చేస్తోందని క్లారిటీ వచ్చేసింది.  దాంతో ఇంతో అంతో వైకాపా తో పనులు ఏదో విధంగా చక్క బెట్టుకుని, అలాగే ముందుకు వెళ్దామనుకున్న జనాలు పూర్తిగా డీలా పడిపోయారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తప్ప తమకు పనులు జరగవు, తమ వ్యాపారాలు సాగవు అని నిట్టూరుస్తున్నారు. 

Show comments