ఉత్తరాంధ్రా అశలు పెంచిన జగన్.. ?

ఉత్తరాంధ్రా జిల్లాలు మూడు వెనకబడినవే. అందులోనూ శ్రీకాకుళం జిల్లా అయితే ఈ రోజుకీ అన్ని విధాలుగానూ అట్టడుగున ఉంది. అటువంటి జిల్లాలో వలసలు కూడా ఎక్కువ. సాగు నీరు సరిగ్గా లేక ఉన్న పొలాలను వదిలేసి రైతులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. మరి శ్రీకాకుళం జిల్లాలో వంశధార వంటి అద్భుతమైన జీవనది ఉంది. అయితే ఇది ఒడిషా రాష్ట్రంతో వాటా కలిగి ఉంది.

దాంతోనే చిక్కులూ చికాకులు వస్తున్నాయి. అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు ఒడిషాతో దశాబ్దాల తరబడి అనేక ఇతర సరిహద్దు సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని కూర్చుని మాట్లాడి పరిష్కరించుకోవాలని అంతా కోరుతూ వస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఈ నెల 9న ఒడిషా టూర్ చేస్తున్నారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో ఆయన ముఖా ముఖీ చర్చలు జరపనున్నారు.

ఈ సందర్భంగా అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళంలో వంశధార మీద నిర్మించ తలపెట్టిన నేరేడు బ్యారేజ్ విషయంలో ఒడిషా అభ్యంతరాలకు జగన్ తగిన జవాబు చెప్పి పరిష్కరిస్తారు అంటున్నారు. అదే కనుక జరిగితే వంద టీఎంసీల దాకా వంశధార నీరు శ్రీకాకుళానికి దక్కుతుంది. 

సాగు, తాగు నీరు లభిస్తుంది. ఇక విజయనగరం జిల్లా కొటియా గ్రామాలు ఇరవై దాకా ఉన్నాయి. వీటి మీద కూడా స్వాతంత్రానికి పూర్వం నుంచి వివాదాలు ఉన్నాయి. తాజాగా ఈ గ్రామాల ప్రజలు తాము ఏపీలోనే ఉంటామని స్పష్టం చేశారు. వారి బాగోగులు కూడా ఏపీ సర్కార్ చూసుకుంటోంది.

దాంతో ఈ వివాదాన్ని కూడా నవీన్ తో కూర్చుని జగన్ పరిష్కరిస్తారు అంటున్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఈ జిల్లాలలో చెప్పిన మాట మేరకు ఒడిషా సర్కార్ తో చర్చలు జరపడం శుభ పరిణామమని అంతా అంటున్నారు. మొత్తానికి అప్పట్లో ఎన్టీయార్ తరువాత మరే ముఖ్యమంత్రి ఒడిషా వెళ్లలేదు, చర్చలు జరపలేదు. 

జగన్ ఈ విషయంలో అడుగు ముందుకేస్తున్నారు. ఆయన విజయం సాధిస్తారని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అదే జరిగితే ఉత్తరాంధ్రా ఆశలు నెరవేరినట్లే.

Show comments