జగన్ కు మినహాయింపు ఉంటుందా? ఉండదా?

ఏపీ సీఎం జగన్ తన అక్రమాస్తుల కేసుల సీబీఐ కోర్టుకు హాజరు కావాలా ? వద్దా ? అనే విషయాన్ని తెలంగాణా హైకోర్టు త్వరలోనే తేలుస్తుంది. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు మీద హై కోర్టులో వాదనలు ముగిశాయి. జగన్ కు వ్యక్తిగత మినహాయింపు కొనసాగుతుండటం పట్ల సీబీఐ తీవ్ర అసహనం వ్యక్తం  చేస్తోంది. 

జగన్ కు మినహాయింపు రద్దు చేయాలని హై కోర్టులో గట్టిగా వాదించింది. వాదనలు ముగిశాక న్యాయస్థానం తీర్పు రిజర్వు చేసింది. ఆ తీర్పు ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ మొదలై పదేళ్లు దాటిపోయిందని, అయినా ఇప్పటికీ విచారణ ముగింపుకు రాలేదని సీబీఐ అసహనం వ్యక్తం చేసింది.

జగన్ సీఎం కాకముందు ఈ కేసు విచారణ మొదలైంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ హోదాలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని సీబీఐ వాదించింది. అందుకే ఎట్టి పరిస్థితిలోనూ జగన్ కు మినహాయింపు ఇవ్వడానికి వీల్లేదని కోర్టుకు సీబీఐ చెప్పింది. 

ఈ విషయం గతంలోనే కోర్టు దృష్టికి తెచ్చామని గుర్తు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకు జగన్ హాజరు కాలేదు. దీనిపై విమర్శలు వచ్చాయి. జగన్ తండ్రి రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడైన రోశయ్య అంత్యక్రియలకు జగన్ హాజరు కాకపోవడమేమిటని కొందరు ప్రశ్నించారు. 

ఇలాంటి వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు కావడం మానేసి చాలా కాలమైందని, ఒకవేళ హాజరైతే ఆ కార్యక్రమాలకు హాజరు కావడానికి సమయం ఉందిగానీ, విచారణకు హాజరు కావడానికి సమయం లేదా అని కోర్టు ప్రశ్నించే అవకాశం ఉందని జగన్ అన్నట్లు వార్తలు వచ్చాయి. విచారణకు జగన్ హాజరు తప్పనిసరని తెలంగాణా హై కోర్టు తీర్పు ఇస్తే హాజరు కాక తప్పదేమో. 

Show comments