జగన్ ఓకే అంటే, కష్టం తుస్సుమన్నట్టే!

ఇసుక కొనుగోళ్లకు ఏపీఎండీసీ తయారుచేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి గనుక యథాతథంగా ఆమోదం తెలిపితే గనుక... మూడునెలలుగా పడినకష్టం తుస్సుమన్నట్లే అవుతుంది. ఇసుక విషయంలో అవినీతిని కట్టడి చేస్తున్నామని, అక్రమాలు అరికడతామని, ఇకపై దోపిడీ ఉండదని.. రకరకాల వాగ్దానాలతో.. రెండునెలలకు పైగా ఇసుక లభ్యతను కట్టడిచేసి, కొత్త విధానం తీసుకువచ్చారు. ఆ కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి రానుంది.

ఇవాళ ధరలను ప్రభుత్వం ఖరారుచేసి ప్రకటించాలి. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఏపీఎండీసీ తయారుచేసిన ధరల ప్రతిపాదనలు మాత్రం గతానికంటె ఎక్కువగా, ప్రభుత్వానికి పరువునష్టం చేసేవిగా ఉన్నాయి. కొత్త ఇసుక విధానం గురువారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించిన నేపథ్యంలో.. ఇవాళ (బుధవారం) సాయంత్రానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఖరారు అవుతాయని ముందే ప్రకటించారు. దీనికి తగ్గట్టుగా ఏపీఎండీసీ తమ ప్రతిపాదనలను మంగళవారమే ప్రభుత్వానికి సంబంధించింది. వారి ప్రతిపాదనల్లో ట్రాక్టరు ఇసుక ధర 1687.50 రూపాయలు అయ్యేలా ఉన్నదని వార్తలు వస్తున్నాయి.

ఏపీఎండీసీ అన్ని నిర్వహణ ఖర్చులు కలిపి టన్నుకు 375రూపాయలు ధరగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకటిన్నర టన్ను ఇసుక ఒక క్యూబిక్ మీటరుతో సమానం. ఒక ట్రాక్టరులో మూడు క్యూబిక్ మీటర్లు (నాలుగున్నర టన్నులు) పడతాయి అనుకుంటే ఒక ట్రాక్టరు ధర అంచనాగా 1687.50 రూపాయలు అవుతుంది. ట్రాక్టరులో నింపే తీరును బట్టి పట్టే ఇసుక పరిమాణంలో తేడాలు ఉండవచ్చు. అదే తెలంగాణలో టన్ను ఇసుక ధర 400 రూపాయలుగా ఉంది. దానితో పోలిస్తే జగన్ సర్కారు చవగ్గా ఇస్తున్నట్టే.

కానీ ట్రాక్టరులో మూడు టన్నులు నింపుతారా, నాలుగున్నర టన్నులు నింపుతారా? అనేది ప్రశ్న. నాలుగున్నర టన్నులే గనుక నింపితే.. 1687 ధర.. గతంలో ఉన్న ధర కంటె ఎక్కువ. చంద్రబాబు ట్రాక్టరు 1200 వంతున ఇచ్చాం అంటున్నప్పటికీ.. అవి 1400-1500 ధర పలికేవి. మరి జగన్ సర్కారు కొత్త విధానంలో.. ధర పెరిగితే ప్రజలకు ఆ తేడా తెలుస్తుంది. జగన్ ప్రభుత్వం ఏపీఎండీసీ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలను సమీక్షించుకోవాల్సి ఉంది.

ట్రాక్టరులో నింపే ఇసుక పరిమాణం కూడా గతంలో పోల్చి చూసుకోవాల్సి ఉంది. లేకపోతే.. కొత్త ఇసుక విధానం ద్వారా ప్రజలకు ఎంతోకొంత అదనపు మేలు చేయాలని సంకల్పించిన జగన్ ప్రభుత్వం కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!

Show comments