మొన్న బిర్యానీ, ఈరోజు కేక్.. పురుగు కామన్

అదో పెద్ద అంతర్జాతీయ ఫర్నిచర్ షాప్. అక్కడ ఫర్నిచర్ ఎంత ఫేమస్సో అందులో రెస్టారెంట్ కూడా అంతే ఫేమస్. అయితే ఇదంతా విదేశాలకు మాత్రమే. హైదరాబాద్ కు వచ్చేసరికి మాత్రం అంతా లో-గ్రేట్. ఐకియా ఫర్నిచర్ మాల్ కథ ఇది.

మొన్నటికి మొన్న ఐకియా రెస్టారెంట్ బిర్యానీలో గొంగళిపురుగు ప్రత్యక్షమైంది. దీనిపై అప్పట్లో పెను దుమారమే చెలరేగింది. విషయం మున్సిపల్ అధికారుల వరకు వెళ్లింది. అయినప్పటికీ ఐకియా పనితీరు మారలేదు.  ఈసారి బిర్యానీ స్థానంలో కేక్ వచ్చింది. అంతే తేడా.

అవును.. ఐకియా రెస్టారెంట్ లో చాక్ లెట్ కేక్ తింటున్న ఓ కస్టమర్ కు అందులో ఈగ దర్శనమిచ్చింది. ఈ విషయాన్ని ఐకియా స్టోర్ కూడా నిర్థారించింది. "అవును.. మా కస్టమర్ తింటున్న చాకొలెట్ కేక్ లో ఈగ ఉంది. దీనికి మేం ఎంతో చింతిస్తున్నాం. సదరు వినియోగదారుడికి క్షమాపణలు చెబుతున్నాం. ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం."

ఇది ఐకియా రెస్టారెంట్ నిర్వహకుడి నుంచి వచ్చిన సమాధానం. వెజ్-బిర్యానీలో పురుగు కనిపించినప్పుడే అన్ని ఆహార ఉత్పత్తులపై ఓ కన్నేసి ఉంచితే ఇలాంటివి మళ్లీ పునరావృతం అయ్యేవి కావు. కానీ ఐకియా మాత్రం కస్టమర్లకు అందించే ఫుడ్ విషయంలో అజాగ్రత్తగా ఉంటోందంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న వరుస పోస్టులకు తాజాగా చాకొలెట్ కేక్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ఐకియా స్టోర్ లో ఏ దేశంలో ఇలాంటి ఫిర్యాదులు లేవు. ఇండియాకు వచ్చేసరికి మాత్రం ఈ సంస్థ తన నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది.

Show comments