డైరక్టర్ అసోసియేషన్ సాయం

కరోనా కల్లోలం రెండో దశలో టాలీవుడ్ డైరక్టర్ అసోసియేషన్ తన వంతు సాయం చేయడం ప్రారంభించింది. తొలి దశలో టాలీవుడ్ డైరక్టర్ల అసోసియేషన్ సభ్యులందరికీ ఆర్థిక సాయం ఇంకా సిసిసి నంచి మూడు సార్లు సరుకుల సాయం అందించారు. 

ఇప్పుడు రెండో విడత సందర్భంగా  కొన్ని చర్యలు చేపట్టినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ శంకర్ తెలిపారు. ఎవరికైతే కరోనా సోకింది అని తెలిస్తే వారి ఖాతాల్లో పదివేలు తక్షణం జమ చేస్తున్నట్లు తెలిపారు. 

అలాగే ఆసుపత్రుల్లో చేరిన వారు అక్కడ ఖర్చుల వివరాలు తెలియచేస్తే అవకాశం వున్న మేరకు, నిబంధనలకు అనుగుణంగా కొంత సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కొందరికి పాతిక వేలు, యాభై వేలు, లక్ష కూడా వారి వారి అవసరాలను బట్టి అందిస్తున్నామన్నారు. 

అలాగే కరోనా బారిన పడిన వారికి బెడ్ లు దొరికేలా చూడడం, ఆక్సిజన్ సదుపాయం అందేలా చూడడం వంటి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 

సభ్యులంతా ఇళ్లలోనే వుండి, బయటకు వెళ్లకుండా, కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శంకర్ కోరారు. ముఖ్యంగా కరోనా సోకినా భయపడకుండా మందులు వాడుకుంటే సరిపోతుందని, భయమే అసలు శతృవు అని ఆయన అన్నారు.

Show comments