అదంతా ఎవ‌డ‌బ్బ‌ని సొమ్ము నిమ్మ‌గ‌డ్డా?

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ రమేశ్‌కుమార్ "ఇగో" ... కోట్లాది రూపాయ‌ల ప్ర‌జాధ‌నం న్యాయ‌వాదులపాలు చేసింద‌ని చెప్పొచ్చు.  చేయ‌కూడ‌ని త‌ప్పుల‌న్నీ చేసి, ఇప్పుడు తీరిగ్గా రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశం అంటూ ఎస్ఈసీ కొత్త రాగం అందుకున్నారు. క‌రోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మార్చిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ రమేశ్‌కుమార్ అర్ధాంత‌రంగా నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.

లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను దాదాపు ఎత్తి వేసిన నేప‌థ్యంలో వాయిదా ప‌డిన ఎన్నిక‌ల‌ను తిరిగి నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆలోచిస్తోంది. ఈ ప‌రిస్థితిలో ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశాన్ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఏర్పాటుకు నిర్ణ‌యించింది.

ఈ మేర‌కు స‌మావేశానికి ఆహ్వానిస్తూ ఎన్నిక‌ల సంఘం స‌మాచారం అందించింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై అన్ని రాజ‌కీయ పార్టీల అభిప్రాయాల‌ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం స్వీక‌రించ‌నుంది.

ఇది మంచి ప‌రిణామ‌మే. కానీ ఇదే విధ‌మైన ప్ర‌జాస్వామిక ప‌ద్ధ‌తిని ఎన్నిక‌లు వాయిదా వేసే ముందు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ అవ‌లంబించి ఉంటే ప్ర‌శంస‌లు అందుకునే వారు.

అప్పుడు క‌నీసం ఏ ఒక్క‌రితో చ‌ర్చించ‌కుండా, ఏక‌ప క్షంగా, అప్ర‌జాస్వామికంగా ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డం వ‌ల్లే నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ విమ‌ర్శ‌ల‌పాల‌య్యారు. అందువ‌ల్లే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ తీవ్ర అభ్యంత‌రం, నిర‌స‌న తెలిపారు.

నిమ్మ‌గడ్డ రమేశ్‌కుమార్ ఏక‌ప‌క్ష విధానాల‌ను వ్య‌తిరేకంగానే అనంత‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌నే వాస్త‌వాన్ని విస్మ‌రించ‌కూడ‌దు. ఎన్నిక‌ల‌ను వాయిదా వేసే ముందు క‌నీసం మాట‌మాత్ర‌మైనా రాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చించి ఉంటే ...ఆ త‌ర్వాత అవాంఛ‌నీయ ప‌రిణామాలు ఎంత మాత్రం చోటు చేసుకునేవి కావు.

నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ తానొక రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్నాన‌నే అహంకారంతో, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌నే నియంతృత్వ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించార‌నే అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్నాయి.

ఆ త‌ర్వాత నిమ్మ‌గ‌డ్డ తొల‌గింపు, కేసు కోర్టు మెట్లు ఎక్క‌డం, అక్క‌డ చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి అంద‌రికీ తెలిసిందే. న్యాయ‌స్థానాల ఆదేశాల పుణ్య‌మా అని తిరిగి ఎస్ఈసీగా నియ‌మితులైన నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ , తిరిగి ఎన్నిక‌ల సంఘానికి నిధులతో పాటు ప్ర‌భుత్వం త‌మ‌కు స‌హ‌క‌రించ‌లేద‌నే నిరాధార ఆరోప‌ణ‌ల‌తో కోర్టుకెక్కారు.

నిధుల విష‌యంలో మాత్రం ప్ర‌భుత్వం అలా చేయ‌కుండా ఉండాల్సింది. ఇక మిగిలిన ఆరోప‌ణ‌ల‌పై హైకోర్టే అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.నిమ్మ‌గ‌డ్డ పిటిష‌న్‌పై విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దేవానంద్ చేసిన వ్యాఖ్య‌లను ప‌రిశీలిస్తే నిమ్మ‌గ‌డ్డ వ‌ల్ల ప్ర‌జాధ‌నానికి ఎంత నష్టం జ‌రిగిందో అర్థం చేసుకోవ‌చ్చు.

న్యాయవాదులకు ఎన్నికల కమిషన్‌ చెల్లించాల్సిన ఫీజు రూ.5.61 కోట్లు ఉందని, ఇదంతా పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్న డబ్బని, ఆ డబ్బును ఇలా ఖర్చు చేయడం దురదృష్టకరమని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు.  

ఒక‌టి కాదు, రెండు కాదు ...ఏకంగా రూ.5.61 కోట్లు ... కేవ‌లం నిమ్మ‌గ‌డ్డ ఏక‌ప‌క్షంగా, అప్ర‌జాస్వామికంగా ఎన్నిక‌లను వాయిదా వేయ‌డం వ‌ల్ల న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌నేది అంద‌రి అభిప్రాయం. ఈ నెల 28న  రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తు న్న‌ట్టుగానే, అప్ప‌ట్లో కూడా చేసి ఉంటే రెండు వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ఈ ఘ‌ర్ష‌ణ త‌లెత్తేదే కాదు క‌దా!

ఈ మొత్తం ఎపిసోడ్‌లో మొద‌టి ముద్దాయి ఎస్ఈసీనే అంటే అతిశ‌యోక్తి కాదు. రూ.2 వేలు పింఛ‌న్ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ఎన్నెన్నో అర్హ‌త‌ల‌ను పెడుతోంది. అలాంటిది ఉత్త పుణ్యానికి రూ.5.61 కోట్లు ఎవ‌డ‌బ్బ‌ని సొమ్మ‌ని వృథా చేశారు? ఇన్ని కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం దుర్వినియోగానికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారో నిమ్మ‌గ‌డ్డే చెప్పాలి. ఎందుకంటే ఆయ‌న చ‌ర్య‌ల వ‌ల్లే ఇదంతా చోటు చేసుకుంది కాబ‌ట్టి.

అవి.. ఎవ‌రి ఆశ‌ల పునాదులో చెప్ప‌వేం ఈనాడూ! 

Show comments