పోల‌వ‌రంపై కూలంక‌ష‌మైన చ‌ర్చ జ‌ర‌గాలి

పోలవరం ప్రాజెక్టు పై అసెంబ్లీలో చర్చ జరిగింది. కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా రెండు పార్టీలు వ్యవహరించాయి. పోలవరం చుట్టూ రాయలసీమ భవితవ్యం ఉంటుంది కాబట్టి అసలు విషయాలు చర్చకు పెట్టాలి.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే కృష్ణా , గోదావరి డెల్టా అవసరాలు తీరుతాయి. విశాఖ నగర త్రాగునీరు , పారిశ్రామిక అవసరాలుకూడా తీరుతాయి. అపుడు రాయలసీమ ప్రాంతానికి కృష్ణ నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ముందు చూపు లేకుండా కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును తాను బాధ్యతను తీసుకుంది. పోలవరం డ్యామ్ , నీటి నిల్వ ఉండే ప్రాంతం వరకు నిర్వాసితులకు పునరావాసం కల్పన జరగాలి.

జరుగుతున్న చర్చ చూస్తుంటే కేంద్రం డ్యామ్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పునరావాస ఖర్చు విషయంలో పేచీ పెట్టె ఆలోచన చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. పునరావాస అవసరాలకు ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 30 వేల కోట్ల రూపాయలు అవసరం ఉంది.

ఈ నిధులు కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చు. అదే కేంద్రం పునరావాస బాధ్యతల నుంచి తప్పుకుంటే ఆ భారం రాష్ట్రం మీద పడుతుంది. 

పోలవరం పై రాష్ట్ర ప్రజలలో భావోద్వేగాలతో కూడిన అనుబంధం ఉంది. ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పోలవరం పై ఫోకస్ పెడతారు. పరిమిత వనరులు కలిగి ఉన్న రాష్ట్రం నిర్వాసితుల అవసరాలకు తన నిధులను ఖర్చు చేస్తే రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు లేమి ఉంటుంది.

పోనీ రాయలసీమకు పాలకులు చెపుతున్నట్లు పోలవరం పూర్తి అయితే యధాలాపంగా నీరు వస్తాయా అంటే రావు. పట్టిసీమ నీళ్లు రాయలసీమకు ఎలా వచ్చినాయో రేపు పోలవరం నీళ్లు కూడా అంతే.

రాయలసీమలో పోతిరెడ్డిపాడు వెడల్పు , కాల్వల సామర్ధ్యం పెంపు , రిజర్వాయర్ల నిర్మాణం ముక్యంగా సిద్దేశ్వరం , గుండ్రేవుల , గాలేరు నగరి , హంద్రీనీవా , తుంగభద్ర నీటిని ఉపయోగించే ఏర్పాట్లు పూర్తి చేయకుండా ఎన్ని పొలవరాలు నిర్మాణం చేసినా ఉపయోగం ఉండదు. నిజానికి పోలవరం పూర్తి చేయకపోయిన పై ఏర్పాట్లు రాయలసీమలో జరిగితే పోలవరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా నీటి సమస్య పరిష్కారం అవుతుంది. 

పై పనులకు కనీసం 40 - 50 వేల కోట్ల రూపాయల అవసరం ఉంది. పరిమిత వనరులు కలిగి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం ఖర్చు చేయడం మొదలెడితే రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యం. అదే జరిగితే రాయలసీమకు మరోమారు అన్యాయం జరుగుతుంది.

ముఖ్యమంత్రి , విపక్షనేత ఇద్దరు రాయలసీమ వారే ఉన్నా సీమ పరిస్థితిపై కనీస ఆందోళన లేక పోవడం ఆందోళన కలుగుతుంది. రాయలసీమ ప్రజలుకు వాస్తవాలు తెలియనంత వరకు పరిస్థితులు ఇలానే ఉంటుంది.

-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం
9490493436

Show comments