3 ఏళ్లు..135 దేశాలు.. ప్రపంచయాత్రకు బుకింగ్స్ ఓపెన్

విహార యాత్రలు చేయాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. కానీ అది కొందరికే వీలవుతుంది. అలాంటిది ప్రపంచ యాత్ర చేయాలంటే అది ఇంకా కష్టం. అన్ని దేశాలు చుట్టేసి రావాలంటే సమయం ఉండాలి, సరైన తోడు ఉండాలి, అనుమతులుండాలి. అన్నీ ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించాలి. అయితే కేవలం ఆర్థిక విషయాలు మీరు చూసుకోండి, మిగతావన్నీ మేం చూసుకుంటామంటున్నారు లైఫ్ ఎట్ సీ క్రూయిజ్ కంపెనీ నిర్వాహకులు. ఆ సంస్థ త్వరలోనే ప్రపంచ యాత్ర కోసం ఓ భారీ షిప్ ని సిద్ధం చేస్దోంది. దాని పేరు ఎంవీ జెమిని.

1095 రోజులపాటు ప్రపంచంలోని 135 దేశాలను ఎమ్వీ జెమిని చుట్టేస్తుంది. మొత్తం ప్రయాణం 1.30 లక్షల మైళ్లు. వివిధ దేశాల్లో 375 పోర్టుల్లో ఈ భారీ నౌక ఆగుతుంది. అందులో 208 పోర్టుల్లో కేవలం ఒక్కరోజు మాత్రమే విడిది ఉంటుందట. మిగతా చోట్ల లంగరు వేసి దగ్గర్లోని అన్ని దేశాలు ఒకేసారి చుట్టేసి వస్తారు. ఈ క్రమంలో 103 దీవుల్ని కూడా ఈ నౌక కవర్ చేస్తుంది.

టికెట్ ధర 25 లక్షలు మాత్రమే..

ఎమ్వీ జెమిని క్రూయిజ్ షిప్ లో ప్రపంచ యాత్ర చేపట్టాలంటే అన్ని పన్నులతో కలిపి 25 లక్షల రూపాయలు మన దగ్గర ఉంటే చాలు. సింగిల్ గా ప్రయాణించేవారికి 15శాతం రాయితీ కూడా ఉందట. నవంబర్-1న ఇస్తాంబుల్ నుంచి ప్రయాణం మొదలవుతుంది. బుకింగ్స్ మొదలయ్యాయి.

ఎమ్వీ జెమిని ప్రత్యేకతలు ఏంటంటే..?

ఈ క్రూయిజ్ షిప్ లో 400 క్యాబిన్లు ఉంటాయి. మొత్తం 1074 మంది ప్రయాణికులకు వసతి సౌకర్యం ఉంది. 24 గంటల వైద్య సదుపాయం, డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వైఫై సదుపాయం, ఇతర టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంది. రెస్టారెంట్లు, జిమ్, లైబ్రరీ, ఎంటర్టైన్మెంట్ జోన్, ఆఫీస్ ఇలా అన్నీ ఉంటాయి. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న 14 వింతల్లో 13 చోట్లకు మిమ్మల్ని ఈ నౌక తీసుకెళ్తుంది.

మధ్యలో దిగేస్తామంటే కుదురుతుందా..?

ఈ క్రూయిజ్ షిప్ లో ప్రయాణించాలంటే 25 లక్షలు ఉంటే సరిపోదు. దీర్ఘకాలిక వ్యాధులేవీ ఉండకూడదు. ఆరోగ్య పరిస్థితులను అంచనావేసిన తర్వాతే ఇందులో ప్రయాణానికి అనుమతి ఉంటుంది. మూడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉండాలి కాబట్టి, మానసికంగా దృఢంగా ఉన్నవారినే తీసుకెళ్తామంటున్నారు నిర్వాహకులు. దానికితోడు షిప్ ఎక్కేముందే బాండ్ పేపర్ పై సంతకం పెట్టాల్సి ఉంటుంది. మూడేళ్లలో తాము వెనక్కి తిరిగి వెళ్లమంటూ బాండ్ రాసివ్వాలట.

మరి మూడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా, కేవలం సముద్రంపైనే ఉండేంత తీరిక, ఓపిక, స్టామినాతో పాటు.. డబ్బులు కూడా దండిగా ఉన్నవారే ఈ ప్రయాణానికి సాహసించాలన్నమాట. అంటే ఒక రకంగా ఇది విహార యాత్రే కాదు, సాహస యాత్ర కూడా. 

Show comments