కాంగ్రెస్‌ ఆరాటం: టీఆర్‌ఎస్‌కి ఏంటి సంబంధం?

పాతమాట.. ఆ మాటకొస్తే, 'పనికిమాలిన మాట'గా గులాబీ శ్రేణులు లైట్‌ తీసుకుంటున్నమాట. కానీ, కాంగ్రెస్‌ నేతల నోట మళ్ళీ మళ్ళీ వస్తోంది అదేమాట. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర సమితి పాత్ర ఏమీలేదంటూ మరోమారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ సెలవిచ్చారు. 'కట్‌ చేసెయ్యడానికి ఇదేమన్నా బర్త్‌ డే కేక్‌ అనుకుంటున్నారా.?' అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనపై సెటైర్లు వేసిన గులాంనబీ ఆజాద్‌, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంకాక తప్పలేదనుకోండి.. అది వేరే విషయం.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలంగాణ రాష్ట్ర సాధనలో తెరాస పాత్ర సుస్పష్టం. కేసీఆర్‌, తెలంగాణ ఉద్యమ సారధి. అందుకే, 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం ఆయన్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్‌ హయాంలోని యూపీఏ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి 'సై' అనాల్సి వచ్చిందంటే, అదంతా తెలంగాణలో భగ్గుమన్న ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం కారణంగానే.. ఆ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రసమితి నాయకత్వం వహించలేదని ఎలా చెప్పగలం?

కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి ఖమ్మం ఆసుపత్రిలో ఏం జరిగిందన్న సంగతి పక్కన పెడితే, నిమ్స్‌ ఆసుపత్రిలో ఆయన చేసిన నిరాహార దీక్షకు.. అప్పటి కేంద్రం దిగి వచ్చింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అన్నీ తన కనుసన్నల్లోనే జరిగాయని కేసీఆర్‌ చెబితే, కాంగ్రెస్‌ నేతలు అప్పట్లో ఖండించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

ఓ దశలో కాంగ్రెస్‌ పార్టీలో టీఆర్‌ఎస్‌ని కేసీఆర్‌ విలీనం చేసేందుకు సిద్ధమవడం, ఆ తర్వాత కాంగ్రెస్‌కి కేసీఆర్‌ ఝలక్‌ ఇవ్వడం తెల్సిన విషయాలే. ఆ అసహనం కాంగ్రెస్‌ నాయకుల్లో ఇంకా తగ్గినట్లు కన్పించడంలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో ప్రతిపక్షం హోదా అయినా దక్కిందంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్న కారణంగానే. ఈసారి ఆ పరిస్థితి వుంటుందా.? ప్రస్తుతానికైతే అనుమానమే.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ తర్వాత రెండో స్థానంలో కాంగ్రెస్‌ బలంగా కన్పిస్తున్నా, టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్‌, వున్న బలాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో 'టీఆర్‌ఎస్‌కి ఏం సంబంధం.?' అంటూ ప్రశ్నించడమంటే కాంగ్రెస్‌ తన బలాన్ని తానే మరింత తగ్గించుకున్నట్లే అవుతుంది.

Show comments