తిరుప‌తి బ‌లిజ‌ల్లో పోటాపోటీ!

నూకలు పోసి పావురాల‌ను ప‌ట్టుకున్న వేట‌గాడి గురించి చిన్న‌ప్పుడు క‌థ విన్నాం. తిరుప‌తి ఎమ్మెల్యే టికెట్ కోసం బ‌లిజ సామాజిక వ‌ర్గంలో కొంద‌రు నూక‌లు చ‌ల్లుతున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు "వూక‌"లు ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రంప‌ర‌లో టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ మ‌రుగున ప‌డుతోంది. 

టీడీపీతో జ‌న‌సేన పొత్తు కుదుర్చుకుంటుంద‌నే సంకేతాలు వెలువ‌డిన నేప‌థ్యంలో తిరుప‌తి రాజ‌కీయం మారుతోంది. ఇక్క‌డ బ‌లిజ‌లు చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఉన్నారు. టీడీపీ, జ‌న‌సేన పొత్తు కుదుర్చుకుంటే ఆ పార్టీల త‌ర‌పున ఎవ‌రు నిలిచినా సునాయాసంగా గెల‌వ‌చ్చ‌ని వారి అంచ‌నా. అయితే రాజ‌కీయాల్లో ఒన్ ప్ల‌స్ ఒన్ ఎప్పుడూ టూ కాదు. త‌మ్ముడు త‌మ్ముడే... పేకాట పేకాటే అనే నానుడి ప్ర‌కారం, ఒకే సామాజిక వ‌ర్గం, ర‌క్త సంబంధం ఉన్నా అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకునే విష‌యంలో మాత్రం ఎవ‌రి దారి వారిదే.

ఇత‌రుల ఆధిప‌త్యాన్ని అంగీక‌రించే ప‌రిస్థితి వుండ‌దు. త‌మ‌కు టికెట్ రాక‌పోయినా ఫ‌ర్వాలేదు, కానీ త‌న‌ను వ్య‌తిరేకించే వారిని అంద‌లం ఎక్కించ‌డానికి సిద్ధంగా ఉండ‌రు. ఈ కోణంలోనే టీడీపీ నాయకుడు వూకా విజ‌య్‌కుమార్ తాజా వ్యూహాన్ని చూడాల్సి వుంటుంది. ఇటీవ‌ల అత‌ను పూర్వ‌పు పీఆర్పీ నేత‌ల స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌డం వెనుక భ‌విష్య‌త్ రాజ‌కీయ వ్యూహం ఉంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.

జ‌న‌సేన అంటే బ‌లిజ‌ల పార్టీగా గుర్తింపు పొందడాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మ‌ది కేవ‌లం ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన పార్టీ కాద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెబుతున్నా, ఆ పార్టీలో ఉన్న బ‌లిజ‌లు మాత్రం "మ‌న" పార్టీగా భావిస్తారు. అందుకే మిగిలిన సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఆ పార్టీకి చేరువ కాలేక‌పోతున్నారు.

తిరుప‌తిలో వూకా స‌రికొత్త డ్రామాకు తెర‌లేపారు. ఇటు టీడీపీ, అటు జ‌న‌సేన‌లోని మెజార్టీ బ‌లిజ‌లంతా త‌న వెంటే ఉన్నార‌నే సంకేతాల్ని పంప‌డానికి ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. దీంతో టికెట్ త‌న‌కు త‌ప్ప‌, మ‌రో బ‌లిజ నాయ‌కుల‌కు ఇచ్చినా ప్ర‌యోజ‌నం వుండ‌ద‌నే బ్లాక్ మెయిల్‌, హెచ్చ‌రిక పంపేందుకు వూకా విజ‌య్‌కుమార్ పావులు క‌దుపుతున్నారు. 

ఈ స‌మావేశానికి మ‌రో టీడీపీ ప్ర‌ముఖుడు జేబీ శ్రీ‌నివాస్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. స‌మావేశం జ‌రిగిన తీరు, ఆ త‌ర్వాత వూకా చేస్తున్న రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు చూసిన త‌ర్వాత జేబీకి త‌త్వం బోధ‌ప‌డింది. తిరుప‌తికి అభ్య‌ర్థుల ప‌రిశీల‌న‌లో జేబీ పేరు కూడా వుంది. త‌న వేలితో త‌న కంటినే పొడిచేందుకు వూకా చాప‌కింద నీరులా కుట్ర‌కు పాల్ప‌డ్డార‌ని తెలుసుకున్న జేబీ... ఇక మీద‌ట జాగ్ర‌త్త‌గా వుండాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. వంద మంది యువ‌కులు త‌మ నాయ‌కుడిగా జేబీని గుర్తిస్తారు. అలాంటిది వూకా విజ‌య్‌కుమార్ అనుచ‌రుడిగా తాను ఫాలో కావ‌డం అస‌హ్యంగా ఉంద‌ని మిత్రుల వ‌ద్ద జేబీ శ్రీ‌నివాస్ అన్న‌ట్టు తెలిసింది. 

టికెట్ కోసం వూకా విజ‌య్‌కుమార్ ఆడుతున్న డ్రామాగా మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ చెబుతున్నార‌ని తెలిసింది. పిల్లి పాలు తాగుతూ త‌న‌నెవ‌రూ చూడ‌లేద‌ని అనుకున్న చందంగా, బ‌లిజ‌ల్లో త‌నే తోపు అని వూకా మిగిలిన వారిని అణ‌గ‌దొక్కే కుట్ర‌ల‌కు తెర‌లేపార‌ని సుగుణ‌మ్మ ఆగ్ర‌హంగా ఉన్నార‌నే చ‌ర్చ నడుస్తోంది. మ‌రీ ముఖ్యంగా వూకా విజ‌య్‌కుమార్ వెనుక నిర్మాత‌, మాజీ పీఆర్పీ నాయ‌కుడు ఎన్వీ ప్ర‌సాద్ ఉన్న‌ట్టు సుగుణ‌మ్మ అనుమానిస్తున్నారు.

అందుకే ఇటీవ‌ల కాలంలో వూకా విజ‌య్‌కుమార్ త‌ర‌చూ ఎన్వీ ప్ర‌సాద్ జ‌పం చేస్తున్నార‌ని, ఇటీవ‌ల పూర్వ‌పు పీఆర్పీ నేత‌ల‌తో స‌మావేశ ఆలోచ‌న కూడా ఎన్వీ ప్ర‌సాద్‌దే అని తిరుప‌తి బ‌లిజ సామాజిక వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతోంది. పీఆర్పీలో తిరుప‌తి సిటీ అధ్య‌క్షుడిగా వూకా విజ‌య్‌కుమార్ వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లో తిరుప‌తి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ చిరంజీవి పోటీ చేయ‌డంతో ఆశ చంపుకున్నారు.  

ఈ ద‌ఫా ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాల‌ని వూకా త‌హ‌త‌హ‌లాడుతున్నారు. జ‌న‌సేన నుంచి పూర్తిస్థాయిలో త‌న‌కే మ‌ద్ద‌తు ద‌క్కేలా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. అయితే వూకా వైఖ‌రిపై జ‌న‌సేన‌లోని బ‌లిజ నేత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. పీఆర్పీ త‌ర్వాత వూకా టీడీపీలోకి వెళ్లి సొంత ప్ర‌యోజ‌నాలు నెర‌వేర్చుకున్నార‌ని, తాము మాత్రం మెగా కుటుంబం వెంటే ఉన్నామ‌ని ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్‌, మ‌రి కొంద‌రు నేత‌లు అంటున్నారు. 

టీడీపీ, జ‌న‌సేన పొత్తులో భాగంగా త‌మ‌కే టికెట్ ద‌క్కుతుంద‌నే ధీమా ప‌సుపులేటి త‌న స‌న్నిహితుల వ‌ద్ద వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా టీడీపీ, జ‌న‌సేన‌లోని బ‌లిజ నేత‌లు... టికెట్ తమకంటే త‌మ‌క‌ని అంత‌ర్గ‌తంగా పోట్లాడుకుంటున్నారు. చివ‌రికి వీళ్లెవ‌రినీ కాద‌ని ఎన్వీ ప్ర‌సాద్ సొంతం చేసుకుంటార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. మొత్తానికి తిరుప‌తి టికెట్ ద‌క్కించుకునే బ‌లిజ నేత ఎవ‌ర‌నేది అమూల్య‌మైన ప్ర‌శ్న‌గా మిగిలింది.

Show comments