ఎన్నికల సంఘంపై పడి ఏడవడం కరక్టేనా?

చంద్రబాబునాయుడు మాట్లాడే ప్రతిమాట, వేసే ప్రతి అడుగు.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిని ముందుగానే ఒప్పుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అడుగడుగునా ఆయన అలాంటి సంకేతాలే ఇస్తున్నారు. ఏకగ్రీవాలను తూర్పారపట్టినా.. పోటీచేసే అభ్యర్థులే ఉండడం లేదని, పల్లెల్లో పోటీచేయడానికి భయపడుతున్నారని భయం వ్యక్తం చేసినా.. అంతా ఓటమి గురించిన చింతే అని వేరే చెప్పక్కర్లేదు. ఇలా అధికార పక్షం మీద పడి ఏడవడం మామూలే. కానీ.. ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా.. చంద్రబాబునాయుడు ఎన్నికల సంఘం మీద కూడా పడి ఏడుస్తున్నారు.

ఎన్నికల సంఘం అంటే.. నోటిఫికేషన్ విడుదల చేసేసి.. ఇంట్లో కూర్చోవడం కాదని చంద్రబాబునాయుడు దెప్పి పొడుస్తున్నారు. ఇదంతా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను దెప్పి పొడవడమే అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ.. అది మాత్రమే కాకుండా.. ఇంకా పలు రకాలుగా చంద్రబాబునాయుడు బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నోటిఫికేషన్ విడుదల అయిన నాడే చంద్రబాబు.. ఎన్నికల కమిషనర్ మీద నోరు పారేసుకున్నారు. ఏకగ్రీవాలు జరగడానికి ఆయన కుట్ర చేస్తున్నారనేంత రేంజిలో విరుచుకుపడ్డారు. ఇంతా కలిపి.. నిమ్మగడ్డ కేవలం ఏకగ్రీవాలకు పిలుపు ఇచ్చారంతే. ఎన్నికల కక్షలు కార్పణ్యాలు రేగకుండా ఉండడానికి ఇలా ఏకగ్రీవాలను ప్రోత్సహించడం అనేది ఎవ్వరైనా చేసే పనే. కానీ.. చంద్రబాబుకు అది కూడా తప్పుకింద కనిపిస్తోంది.

ఇంతా కలిపి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే.. .గతంలో ఆయన తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆత్మీయులైన ఐఏఎస్ అధికారుల్లో ఒకరిగా పేర్లు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత కొంతకాలం గవర్నర్ వద్ద పనిచేసి, ఇప్పుడు ఎన్నికల కమిషనర్ గా దిగుతారట.

ఓటమి తప్పదని తెలిసినప్పుడు.. బాగా ముందునుంచే.. ఏద ఒక వ్యవహారంపై నెపం నెట్టివేసి.. ఆ ఓటమి తనవల్ల కాదని బుకాయించడం చంద్రబాబునాయుడుకు బాగా అలవాటు. గత సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా ఈవీఎం లమీద నెట్టేసే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. చంద్రబాబు ఈవీఎంలలో కుట్రలు చేస్తున్నారంటూ.. ప్రచారం సాగించారు. ఈవీఎంలను ఒక రేంజిలో ఆడుకున్నారు. ఓటమి తప్పలేదు. ఆ తర్వాత నిందలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈసీ వంతు వచ్చింది. వారిని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సంకేతం కూడా ఆయన ఓటమివైపు నడుస్తున్నదని అనుకోవడానికి కారణంగా నిలుస్తోంది.

Show comments