జగన్‌కు ఓకే అనకుంటే భాజపా మాటతప్పడమే!

హోంమంత్రి అమిత్ షాను కలవడం కోసం.. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను నివేదించడం కోసం శుక్రవారం రెండోసారి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి... శనివారం ఉదయానికి తన తిరుగుప్రయాణం షెడ్యూలును చివరి నిమిషంలో మారిస్తే మార్చుకుని ఉండవచ్చు గాక.. కానీ దానివలన మాత్రం మేలే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నిర్ణయాలను ఆచరణలోకి తీసుకురావడంలో.. కేంద్రం మోకాలడ్డకుండా, తన వంతు పూనిక వహించేలా.. ఆయన కేంద్రానికి ముడిపెట్టి వచ్చారు. వారి ముందరికాళ్లకు బంధం వేశారు.

ఇంతకూ ఏం జరిగిందంటే.. శనివారం షెడ్యూలు ప్రకారం ఆగకుండా సాయంత్రం దాకా జగన్ ఢిల్లీలో ఆగిపోయారు. ఆయనకు ఆరోజున న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ తో అపాయింట్మెంట్ దొరికింది. దానిని జగన్ చాలా సమర్థంగా వినియోగించుకున్నారు. రవిశంకర్ ప్రసాద్ ను కలిసి.. అనేక కీలకాంశాలు చర్చించిన జగన్మోహన రెడ్డి.. హైకోర్ట్ ప్రధాన బెంచ్ ను కర్నూలుకు తరలించే విషయం కూడా మాట్లాడారు.

దీనికి సంబంధించి కేబినెట్ తీర్మానం తర్వాత.. శాసనసభ ఇప్పటికే ఆమోదించింది. శాసనమండలి విషయం ఇంకా తేలకపోయినప్పటికీ.. నేడోరేపో... మండలి రద్దు అనేది కార్యరూపం దాల్చగానే.. ఆ నిర్ణయం ఫైనల్ అయినట్టే! అప్పుడిక కర్నూలుకు హైకోర్టును తరలించే ప్రక్రియ అధికారికంగా మొదలవుతుంది. అదంత తేలికేమీ కాదు. కేంద్ర హోంశాఖ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి, న్యాయశాఖకు పంపాలి. న్యాయశాఖ దానిని ఆమోదించి సుప్రీం కోర్టుకు పంపాలి. సుప్రీం కోర్టు కూడా అంగీకరించాలి.

అయితే ఇక్కడ గమనార్హం ఏంటంటే.. ఎన్నికలకు ముందు.. భాజపా కూడా తమ మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు గురించి ప్రజలకు హామీ ఇచ్చింది. మీ హామీ నిలబెట్టుకోవడానికి .. మీరు మా నిర్ణయానికి సహకరించండి అంటూ జగన్ న్యాయమంత్రికి గుర్తుచేశారు. తద్వారా.. కేంద్రం సాకులు చెప్పే అవకాశం లేకుండా.. చేయకపోతే.. కేంద్రం చిత్తశుద్ధిని ప్రజలు అనుమానించే పరిస్థితి సృష్టించి వచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రతిపాదనకు ఓకే చెప్పకుంటే.. కేంద్రం మాట తప్పినట్లు అవుతుందన్నమాట.

మరో 'సామజవరగమన' వస్తుందా? 

Show comments