ప‌వ‌న్ తీరును బీజేపీ హైక‌మాండ్ ప‌రిశీలించ‌ట్లేదా!

తెలంగాణ‌లో టీచ‌ర్స్ కోటాలో తమ త‌ర‌ఫున నెగ్గిన ఎమ్మెల్సీ విష‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అగ్ర‌నేత‌, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా సంతోషంగా స్పందించారు. శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు! భార‌తీయ జ‌న‌తా పార్టీ రాజ‌కీయాలు ఎంత సీరియ‌స్ గా ఉన్నాయో అర్థం చేసుకోవ‌డానికి ఈ ఉదంతం ఒక ఉదాహ‌ర‌ణ‌. 

ఒక ఎమ్మెల్సీ గెలుపు ప‌ట్ల ఒక జాతీయ పార్టీ నంబ‌ర్ టూ రియాక్ట్ అయ్యారు! అది కూడా ప్ర‌త్య‌ర్థి డైరెక్టుగా బీఆర్ఎస్ ఏమీ కాదు! కేవ‌లం తెలంగాణ అనే కాదు.. ఎక్క‌డ ఇలాంటి విజ‌యం ద‌క్కినా అమిత్ షా నుంచి ఇదే రియాక్ష‌న్ ఉంటుంది.

మోడీ, షాల‌కు వేరే ప‌నేం లేదు! కేవ‌లం రాజ‌కీయ‌మే వారి వృత్తి, ప్ర‌వృత్తి. వారికి ఇంకో ఆస‌క్తి, ధ్యాస ఉంటుంద‌ని కూడా అనుకోవ‌డానికి ఏమీ లేదు! మ‌రి తెలంగాణ‌లో క‌లిసి వ‌చ్చిన ఎమ్మెల్సీ సీటు ప‌ట్ల సంతోషం వ్య‌క్త ప‌రిచిన అమిత్ షా ఏపీలో త‌మ చేజారిన ఎమ్మెల్సీ సీటు వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నించ‌కుండా ఉంటారా అని! అమిత్ షా తీరు అర్థం అవుతున్న త‌ర్వాత‌... ఏపీ ఎమ్మెల్సీ సీటు వ్య‌వ‌హారం కూడా ఢిల్లీ కంట పడ‌కుండా ఉండ‌క‌పోవ‌చ్చు!

ప్ర‌త్యేకించి త‌నే కోరి వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ కు స‌హ‌క‌రించ‌లేద‌ని క‌మ‌లం పార్టీ అభ్య‌ర్థి బాహాటంగానే వ్యాఖ్యానించారు! ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి బీజేపీ అధిష్టానం కూడా ఇలాంటి తీరును ఎక్స్ పెక్ట్ చేయ‌క‌పోవ‌చ్చు. బీజేపీతో పొత్తు పొత్తు అంటూ ప్ర‌క‌టించుకునే ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఆ పార్టీ త‌ను చెప్పిన‌ట్టు వినాల‌ని కోరుకుంటూ ఉండ‌వ‌చ్చు. 

త‌న‌తో పాటు వ‌చ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు త‌లొంచాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ భావిస్తున్నాడ‌నేది నర్మ‌గ‌ర్భ‌మైన అంశ‌మే!. ఇటీవ‌లే బీజేపీ అధినాయ‌కుల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మావేశ‌మూ జ‌రిగింది. ఆ త‌ర్వాతే బీజేపీ ప‌ట్ల ప‌వ‌న్ క‌ల్యాన్ వైఖ‌రి మ‌రింత మారిన‌ట్టుగా ఉంది. 

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ముందు బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాలంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌మాత్ర‌మైనా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డ‌మూ వాస్త‌వ‌మే! మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్ వైఖ‌రి ఏమిటో క‌మ‌లం పార్టీ అధిష్టానానికి కూడా ఈ పాటికే అర్థం అయి ఉండ‌వ‌చ్చు. మ‌రి ప‌వ‌న్ ను బీజేపీ అధిష్టానం పెద్ద‌లు పిలిచి మాట్లాడుకుని దారికి తెచ్చుకుంటారా, లేక ఆయ‌న మానాన ఆయ‌నను పూర్తిగా వ‌దిలేస్తారో!

Show comments