బాబుగారి గగ్గోలు.. పట్టించుకునేదెవరు సారూ.!

చంద్రబాబుకి అస్సలేమాత్రం బోర్‌ కొట్టడంలేదు.. కొట్టదు కూడా.! ఎందుకంటే, ఆయన నిప్పు నారా చంద్రబాబునాయుడు. ఒకటికి వందసార్లు చెబితే అబద్ధం నిజమైపోతుందని గట్టిగా నమ్మే వ్యక్తి ఈయన. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాలుగేళ్ళపాటు ఏం చెప్పారో చూశాం, ఇప్పుడు ఏం చెబుతున్నారో చూస్తున్నాం. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ గురించి ఏం చెప్పారో విన్నాం, ఇప్పుడు ఏం చెబుతున్నారో చూస్తున్నాం. ప్రతి విషయంలోనూ చంద్రబాబు తీరు ఇంతే.!

ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబుగారి 'కథలు' రోజురోజుకీ మరింత శృతిమించిపోతున్నాయి. చంద్రబాబు ప్రసంగాల్లో పస తగ్గి, 'రొద' ఎక్కువైపోతోంది. నరేంద్ర మోడీని ఇంకోసారి ప్రధానిని చేయాలన్నదే వైఎస్సార్సీపీ ఆరాటమంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. ఏపీలో వున్నవి 25 ఎంపీ సీట్లు.. ఆ సీట్లన్నీ వైఎస్సార్సీపీకే వచ్చేస్తాయన్న భయం చంద్రబాబులో సుస్పష్టంగా కన్పిస్తోంది. ఇటీవల ఓ సర్వే, వైఎస్సార్సీపీకి 23 ఎంపీ సీట్లు వస్తాయని స్పష్టం చేసిన విషయం విదితమే.

2014 ఎన్నికల నుంచి ఇప్పటిదాకా వైఎస్‌ జగన్‌ ఏనాడూ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించలేదు. ప్రత్యేకహోదా విషయమై కేంద్రాన్ని ప్రశ్నిస్తే, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే కాదు, తమ ఎంపీలతో రాజీనామా చేయించిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. అంతెందుకు, ప్రత్యేకహోదా కోసం వైఎస్‌ జగన్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, చంద్రబాబు ఎగతాళి చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబులో 'భయాలు' రోజురోజుకీ మరింతగా పెరిగిపోతున్నాయి. ఆ భయాల్ని కవర్‌ చేసుకోవడం కోసం, బీజేపీకి వైసీపీకీ 'లేని సంబంధాన్ని' అంటగట్టేందుకు చ్దంరబాబు పడరాని పాట్లూ పడుతున్నారు. సందర్భం ఏదైనా సరే, చంద్రబాబు ప్రసంగాల్లో వైఎస్‌ జగన్‌ మీద విమర్శలు తప్ప ఇంకేమీ కన్పించడంలేదు. ఆ స్థాయిలో చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ విషయంలో గగ్గోలు పెడుతున్నారు.

పాపం చంద్రబాబు.. ఎంతలా గగ్గోలు పెడితే మాత్రం ఏం లాభం.? ఎంపీలు జారిపోతున్నారు.. ఎమ్మెల్యేలు పార్టీలో ఇమడలేకపోతున్నారు.. చంద్రబాబు బుజ్జగింపులకి కాలం చెల్లింది.. ఎన్నికలు నోటిఫికేషన్‌ వచ్చేలోపు, సిట్టింగ్‌ ప్రజా ప్రతినిథుల్లో ఎంతమంది మిగులుతారో తెలియని దుస్థితి తెలుగుదేశం పార్టీది. అధికారం చేతిలో వుంది గనుక, బలవంతంగా జనాన్ని తరలించి, తన గోడు వెల్లగక్కుకుంటున్న చంద్రబాబు, తనను జనం ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న నిజాన్ని ఎప్పటికి అర్థం చేసుకుంటారో ఏమో.!  

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

Show comments