తెరాస విజయం.. ముమ్మాటికీ ఆయన క్రెడిటే!

తను అడుగు పెట్టని కర్ణాటకలోనే బీజేపీని ఓడించి.. కాంగ్రెస్ ను గెలిపించాను అని ప్రకటించుకున్న చంద్రబాబు నాయుడు.. తనే అంతా తానై తిరిగిన తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ను చిత్తు కింద ఓడించాడు. తెలంగాణలో తెరాస సాధించిన ఈ విజయం ఫుల్ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అంటే.. తెరాస తరఫున ఎవరైనా క్రెడిట్ తమది అంటే చెప్పలేం కానీ, అసలు క్రెడిట్ మాత్రం ఖాయంగా తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ సంచలన విజయాన్ని కట్టబెట్టిన క్రెడిట్ చంద్రబాబుదే అవుతుంది.

అందుకు సింపుల్ లాజిక్ ఏమిటంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు, అంత వేవ్ లో, కేసీఆర్ తెలంగాణను సాధించుకు వచ్చాడు.. అని ఒంటెల మీద ఊరేగినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చింది బోటాబోటీ మెజారిటీ. కేవలం అరవై మూడు సీట్లు వచ్చాయి. ఐదేళ్ల పాలన, బోలెడంత వ్యతిరేకత..అందునా తెలంగాణలో ప్రభుత్వాలపై వ్యతిరేకత చాలా త్వరగా వస్తుంది.

ఇది చరిత్ర చెబుతున్న సత్యం. కేసీఆర్ పాలన మీద అనేక వర్గాలు అసంతృప్తితో ఉండినాయి. సమాజాన్ని ఏ వర్గాలుగా విభజించుకున్నా కేసీఆర్ మీద వ్యతిరేకతతో కనిపించిన వర్గాలే ఎక్కువ. నిరుద్యోగులు, తెలంగాణ మేధావులు, తెలంగాణలోని కొన్ని కులాలు.. ముస్లింలు.. ఇలా అనేక మంది వివిధ కారణాలతో కేసీఆర్ మీద వ్యతిరేకతనే కనబరిచారు.

నియంతృత్వ పోకడలు కేసీఆర్ ను నిండా ముంచేస్తాయని అనేక మంది విశ్లేషించారు కూడా. కట్ చేస్తే.. ఊహకు అందని విజయాన్ని, ఎవ్వరూ ఊహించని విజయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అందుకుంది. తెలంగాణ ఉద్యమ వేడిలో జరిగిన ఎన్నికలకు మించిన విజయాన్ని ఇప్పుడు అందుకుంది.

మరి అంత యాంటీ ఇంకబెన్సీని కలిగి ఉండి కూడా.. కేసీఆర్ ఈ విజయాన్ని సాధించాడంటే.. దానికి పూర్తి క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు ఘన విజయాన్ని అందించాడు. నాలుగున్నరేళ్ల కిందట సాధించిన విజయానికి రెట్టింపు స్థాయి విజయాన్ని ఇప్పుడు అందించాడు చంద్రబాబు నాయుడు.

తను ఆల్రెడీ మునిగిన  తెలంగాణలో తను మాత్రమే మునిగితే అందులో తమాషా ఉండదని.. కాంగ్రెస్ పార్టీని కూడా ముంచేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబుతో చేతులు కలపకపోయుంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేది అనేది ఇప్పుడు కాంగ్రెస్ సానుభూతి పరుల నుంచి వినిపిస్తున్న మాట.

పోలింగ్ కు ముందు కూడా వీళ్లలో చాలా మంది ఇదే మాటే చెప్పానుకోండి. బాబుతో చేతులు కలపకపోయుంటే కాంగ్రెస్ గెలిచేదా లేదా అనేది తర్వాతి సంగతి. మరీ ఇలా చిత్తయిపోయేది కాదని మాత్రం ఖాయంగా చెప్పవచ్చు.

Show comments