ఎమ్బీయస్: ఆత్మనిర్భర్ బనావో

హిందీ హాస్యకవిత, రచన, గానం – సంపత్ సరళ్

రండి, విదేశీయులారా, రండి
మా కాళ్లపై మమ్మల్ని నిలబెట్టండి
నా జాతీయవాది మిత్రుడొకడు తన చైనా మొబైల్ నుంచి
నా కొరియా సెల్‌కు ఇంగ్లండు భాషలో, అమెరికా వాట్సాప్ ద్వారా
పిలుపునిచ్చాడు – మనం స్వయంపోషకత్వం సాధించితీరాలని!
చైనా ఫౌండ్రీలో పోత పోసుకున్న సర్దార్ పటేల్ విగ్రహానికి ఫార్వార్డ్
చేద్దామనుకుని, ఆ ఉక్కుమనిషి గుండె బద్దలవుతుందేమోనని ఆగాను
మనం ఆత్మనిర్భరులం కావడానికి చిట్కాలు బిల్ గేట్స్‌నే అడుగుతారట లెండి

ప్రతిపక్షంలో ఉండగా 51 శాతం విదేశీ పెట్టుబడులపై భూమ్యాకాశాలు ఏకం చేసినవారికి
అధికారంలోకి రాగానే నూటికి నూరు శాతం చేసేదాకా భూమిపై కాలు నిలవలేదు
స్వరాజ్యం కోసం చరఖావాలా తెల్లవారిని తరిమికొడితే
చాయ్‌వాలా వాళ్లని చంకనెక్కించుకున్నాడని అంటున్నారందరూ
ఎన్నికల రేవు దాటించి సింహాసనం గట్టెక్కించిన స్వదేశీవాదం
బోడి మల్లయ్య ఐపోయి, ఫారిన్ సరుకే ప్రియమైపోయింది
సచివాలయం ఎదుట కొలంబస్ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించి రోజూ దణ్ణమెట్టుకోమని
రైతు నాయకుడు శరద్ జోషి ఎప్పుడో చెప్పారు
ఆయన అమెరికాను కనిపెట్టకపోతే మనం అప్పులెక్కడి నుంచి తెచ్చేవాళ్లమన్నాడు
ఇంటింటా చొరబడ్డాయి మల్టీనేషనల్స్
ఇదేమిటని అడిగినవారు యాంటీనేషనల్స్

కీలెరిగి వాత పెట్టమన్న సామెత విననట్టుంది ప్యాకేజీ నిర్మాతలు
గాయమొకచోటుంటే మందు వేరే చోట పూశారు ఆర్థికమంత్రి
బర్నరుమీది గిన్నెలో పాలు పొంగితే గ్యాసు కట్టేసేబదులు
గాలి రాకుండా పక్కనున్న కిటికీ మూసిందట వెనకటికో యిల్లాలు
దేశానికి వెన్నెముక లాటి శ్రామికశక్తి నడిచింది మైళ్లకుమైళ్లు-కాళ్లపై
వెన్నుతట్టి ధైర్యమివ్వలేని, దయలేని సర్కారు నడుస్తోంది-తలకిందులుగా
ప్రధాన సేవకుడి ముప్ఫయిఐదు నిమిషాల ఊకదంపుడులో
పాపం వలసకార్మికుల ఊసే లేదు, వారి గురించి ధ్యాసే కానరాలేదు
ఆకలిదప్పులతో కీళ్లు సడలి బడలిన దేహాల అడుగుల సడి
గద్దె దిగాకనే వినబడుతుంది – గుండెలదిరే అలజడి రేపుతుంది
నిర్విరామంగా నడిచిన యీ పాదాలు రేపు నిన్ను నిరంతరంగా వెంటాడతాయ్
చరిత్ర సాక్ష్యం చెపుతోంది – పట్టం కట్టుకుని రథాలపై ఊరేగినవారే
ప్రజల మనోరథం తిరగబడినప్పుడు ఆ చక్రాల కిందే పడి నలుగుతారని!

స్వేచ్ఛానువాదం – ఎమ్బీయస్ ప్రసాద్

వీడియో లింకు - https://www.youtube.com/watch?v=kWo-sN10bZw

Show comments