ఆనంకు జగన్ గ్రీన్ సిగ్నల్..

మొత్తానికి ఆనం అనుకున్నది సాధించారు, జగన్ ని ఒప్పించారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలను తిరుపతి జిల్లాలోకి పోకుండా ఆపగలిగారు. ఈ మేరకు జగన్ హామీ ఇచ్చారని, తుది నోటిఫికేషన్లో కూడా మార్పులుచేశారని ఆనం చెబుతున్నారు. 

మొత్తమ్మీద తుది నోటిఫికేషన్లో జరిగే ఒకటి రెండు మార్పుల్లో ఆనం చెప్పింది కూడా ఒకటి కావడం విశేషం.

దూకుడు తగ్గించినా మాట నెగ్గింది..

కొత్త జిల్లాల ప్రకటన తర్వాత ఆనం స్వరం బాగా మారింది. జిల్లాల విభజన సహేతుకంగా లేదని, ఇష్టప్రకారం చేశారని ఆయన మండిపడ్డారు. నోటిఫికేషన్ విడుదలైన వారం తర్వాత ఆనం ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు. 

వెంకటగిరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం అన్యాయం అని, కనీసం కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను అయినా నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ఆ మూడు మండలాల ప్రజలతో కలసి నిరాహార దీక్షల్లో కూడా కూర్చున్నారు ఆనం. 

గొడవ ముదిరిపోతుందని, ఆనం బాంబు పేలుస్తారని అనుకున్నారంతా. ఆ తర్వాత ఆయన వెంటనే సైలెంట్ అయ్యారు. నిరసనలు ఆపేసి, కేవలం వినతిపత్రాల పోరాటాన్ని కొనసాగించారు.

ఆ మూడు మండలాలను కొత్త జిల్లాలో కలిపితే జల వివాదాలు వస్తాయని, భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని, సహేతుక కారణాలతో సీఎం జగన్ ని కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సవివరంగా జగన్ కి అన్నీ చెప్పారు. ఆయన మాట విన్న జగన్ అధికారులను కలవాలని చెప్పారు. ఆ తర్వాత అధికారులతో చర్చించారు ఆనం. ఇటీవల గౌతమ్ రెడ్డి సంతాప సభ కోసం నెల్లూరుకి వచ్చిన జగన్ ముందు, మరోసారి ఇదే విన్నపాన్ని ఉంచారు ఆనం.

దీంతో అక్కడ ఆయనకు గట్టి హామీ లభించింది. ఆ మూడు మండలాల కోసం పట్టుబడుతున్న ఆనం అంతర్మథనాన్ని జగన్ గుర్తించారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సహజంగా జిల్లాల పునర్విభజనకు విడుదల చేసిన తొలి నోటిఫికేషనే తుది నోటిఫికేషన్ అనుకున్నారంతా. కానీ దానిలో చివరి నిముషంలో మార్పులు చేర్పులు జరిగాయి. అందులో ఆనం డిమాండ్ కూడా ఒకటి. మొత్తమ్మీద ఆనం పట్టుబట్టి జగన్ వద్ద తన మాట నెగ్గించుకున్నారని వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా ఆ మూడు మండలాల ప్రజలు సంబరపడిపోతున్నారు. 

Show comments