ఉత్తరాంధ్రా ద్రోహి ఆయనే

ఉత్తరాంధ్రాకు ద్రోహం చేసింది ఆయనే అంటూ వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ మండిపడుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రా మీద ఎపుడూ సవతి ప్రేమనే చూపించారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రాకు ముఖద్వారంగా ఉన్న విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామంటే చంద్రబాబు ససేమిరా అనడమే కాదు కుట్రలకు తెర లేపారని గుడివాడ ఆక్షేపించారు.

వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మరీ ఒక ఎమ్మెల్సీని గెలుచుకుని జబ్బలు చరచుకుంటున్నారని బాబు మీద మంత్రి మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఎన్నో కుంభకోణాలు బయటపడ్డాయని ఆయన అన్నారు. అప్పట్లో అమరావతిలోని సెక్రేటేరియట్ నిర్మాణాల్లో భారీగా అవినీతి జరిగిందని ఐటీ సోదాల్లో తేలిదని, చాలా నగదు అప్పట్లో ఐటీ విభాగం సీజ్ చేసిందని గుడివాడ గుర్తు చేస్తున్నారు.

అనాడు ఏకంగా చంద్రబాబు పీఎ శ్రీనివాస్ వద్ద రెండు వేల కోట్ల రూపాయల నగదుని ఐటీ శాఖ సీజ్ చేశారని గుడివాడ పేర్కొన్నారు. ఇక అమరావతిలో టెంపరరీ అంటూ నిర్మిచిన వాటి అన్నిటా భారీగా స్కాం జరిగిందని ఆయన మండిపడ్డారు. ఇలా అడ్డగోలుగా సంపాదించిన డబ్బులతోనే తమ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేస్తోందని ఆయన విమర్శించారు.

సంక్షోభంలో సైతం తన సంక్షేమాన్ని చూసుకునే నైజం బాబుదని గుడివాడ సెటైర్లు వేశారు. చంద్రబాబు వద్ద డబ్బు ఉందని, అందుకే ఆయన తమ ఎమ్మెల్యేలను మ్యానేజ్ చేయగలిగారు అని గుడివాడ ఆరోపించారు. చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనుగోలు అంటూ వైసీపీ మంత్రులు ముక్తకంఠంతో విమర్శలు చేస్తున్నారు.

కాదు అని టీడీపీ ఎటూ అంటుంది. కానీ తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు సంచులతో అనాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి దొరికిపోయిన వైనాన్ని గుర్తు చేస్తూ తమ ఆరోపణలకు మరింత బలాన్ని వారు  తెస్తున్నారు. బాబు బ్రీఫ్డ్ మీ అన్నది ఎవరూ  మరచిపోలేరు అని అంటున్నారు. తెలుగుదేశం ఒక ఎమ్మెల్సీ గెలుపుతో ఏపీలో అధికారం మాదే అని చెబుతూంటే కొనుగోళ్ల ఆరోపణలతో వైసీపీ హీటెక్కిస్తోంది. జనాలు దేనిని నమ్ముతారో ఆలోచించాలి.

Show comments