అద్దె గుర్రాలతో అందలాలు ఎక్కగలరా?

పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించి ఇప్పటికి దాదాపు అయిదేళ్లు పూర్తయినట్టే. కొన్నాళ్లు దానిని సుప్త చేతనావస్థలో ఉంచినప్పటికీ.. ప్రస్తుతం యాక్టివ్‌గా మార్చి కూడా దాదాపు ఏడాది కావస్తోంది. ఇన్నాళ్లుగా పార్టీలో ఎందరో చేరుతున్నారు. అయితే తన పార్టీకి సంస్థాగతమైన నిర్మాణం లేదని ఎవరైనా విమర్శిస్తే మాత్రం.. పవన్‌ కల్యాణ్‌కు ఇంతలావున కోపం పొడుచుకు వచ్చేస్తుంది. బహిరంగవేదికల మీదినుంచి వారిని చెడామడా తిట్టేస్తారు.

లోతుగా అక్కర్లేదు, పైపైనే పరిశీలించినా కూడా.. జనసేన పార్టీలో గట్టిగా చెప్పుకోగలిగిన నాయకుడు మరొకరు ఎవరైనా ఉన్నారా? పవన్‌కల్యాణ్‌ కాకుండా.. అంతో ఇంతో పార్టీకి ఉపయోగపడగల నాయకులు ఒక్కరంటే ఒక్కరైనా ఉన్నారా? అంటే అది అనుమానమే. ఇలాంటి నేపథ్యంలో ఇటీవలి కాలంనుంచి పవన్‌కల్యాణ్‌ తన పార్టీలోకి వలసల మీద కన్నేసినట్లుగా కనిపిస్తోంది. ఒక్కరొక్కరుగా నాయకులు వచ్చి చేరుతున్నారు.

ఇతర పార్టీలలో ఎందుకూ కొరగాకుండా మిగిలిపోయిన నాయకులు కూడా కొందరు వచ్చి పవన్‌తో జట్టు కడుతున్నారు. ఏతావతా జనసేనలో నాయకుల సంఖ్య చాలా నెమ్మదిగానే అయినప్పటికీ పెరుగుతూనే ఉన్నది. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో స్పీకరుగా పనిచేసిన నాదెండ్ల మనోహర్‌ కూడా జనసేనలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా సమీకరించుకుంటున్న ఈ బలాలతో ఎన్నికలను ఎదుర్కోవడం అనేది పవన్‌ కల్యాణ్‌కు సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇవి పోరు గుర్రాలేనా?
పవన్‌కల్యాణ్‌ ఇన్నేళ్లుగా పార్టీని నడుపుతుండగా.. అంతో ఇంతో ప్రజలకు తెలిసిన నాయకుడు ఇప్పటిదాకా ఒకే ఒక్కరు ఉన్నారు. ఆయనే మాదాసు గంగాధరం. కానీ మాదాసు గంగాధరం ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడు ఎంతమాత్రమూ కాదు.

ఏదో తెరవెనుక పార్టీ సేవ చేసుకుంటూ గడిపే బాపతు నాయకుల్లో ఒకడు. తదనుగుణమైన పదవులు మాత్రమే ఆయనకు లభించాయి. అలాంటి నాయకుడిని పవన్‌ కల్యాణ్‌ తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఇందులోనూ కుల సమీకరణలు పనిచేశాయనే పుకారు ఉంది. అది ఎలా ఉన్నా.. మాదాసుకు పార్టీ వ్యూహకమిటీ బాధ్యతలు కట్టబెట్టారు. వారు ఇప్పటిదాకా ఏం లావు వ్యూహాలు రచించారో తెలియదు.

అయినా ఇలాంటి నాయకులు పోరుగుర్రాలు కాగలరా? అనే అనుమానం ప్రజల్లో ఉంది. ఇప్పుడు పార్టీలో చేరబోతున్న నాదెండ్ల మనోహర్‌కు కూడా గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడిగా గుర్తింపులేదు. ఏదో పార్టీ హవా నడుస్తుండగా గెలవాల్సిందే!

పవన్‌ కల్యాణ్‌ ఇన్నాళ్ల కసరత్తు తర్వాత.. ఇలాంటి నాయకులను పార్టీలో చేర్చుకుంటూ ఉండగా.. అసలు వీరు పోరుగుర్రాలేనా? అనే అనుమానం పవన్‌ అభిమానులకు కలుగుతోంది. మట్టిగుర్రాన్ని నమ్ముకుని ఏరు యీదినట్లుగా.. పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి నాయకుల్ని నమ్ముకుని ఎన్నికల సమరాంగణానికి సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ఇంటికెళ్లి పిలిచినా చేరట్లేదే?
పవన్‌కల్యాణ్‌ తన బహిరంగ సభా ప్రసంగాల్లో చాలా తరచుగా అటు అధికార పార్టీనుంచి, ఇటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి పలువురు నాయకులు వలస వచ్చి తమ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లుగా చెప్పుకుంటూ ఉంటారు. అంతగా నాయకులు జనసేనకోసం పోటెత్తిపోతున్న పరిస్థితులు మాత్రం ప్రబలంగా కనిపించడం లేదు. పవన్‌ సభలకు యువత ఉత్సాహంగా హాజరుకావడం జరుగుతున్నదే తప్ప.. నాయకులు ఆయన కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి లేదు. ఆ మాటకొస్తే.. ఆయన ఇంటికెళ్లి పిలిచినా కూడా నాయకులు జనసేనలో చేరడంలేదు.

విశాఖలో దాడి వీరభద్రరావు ఉన్నారు. ఆయనకు స్థానికంగా నాయకుడిగా మంచి పేరే ఉంది. స్వతహాగా తెలుగుదేశానికి చెందిన ఆయన ఆ నడుమ వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. కొన్నాళ్లకు ఆ పార్టీనుంచి కూడా బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ అనుబంధం లేకుండా ఖాళీగా ఉన్నారు.

పవన్‌ కల్యాణ్‌ తన పోరాటయాత్రలో భాగంగా.. విశాఖలో పర్యటిస్తున్న సమయంలో.. దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు. వారి ఇంట్లోనే భోంచేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత బయటకు వచ్చి, దాడితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. వీరభద్రరావు వంటి సీనియర్‌ నాయకులు తమ పార్టీలోకి వచ్చి చేరితో బాగుంటుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.

నిజానికి దాడి వీరభ్రదరావు కూడా ఖాళీగానే ఉన్నారు గనుక.. ఈ ప్రతిపాదనకు ఎగిరిగంతేసి ఒప్పుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, అనుకున్నట్లుగా జరగలేదు. పవన్‌ కల్యాణ్‌ స్వయంగా, బాహాటంగా ఆహ్వానించి నెలలు గడచిపోతున్నప్పటికీ.. దాడి వీరభద్రరావు మాత్రం జనసేనలోకి రాలేదు. ఇలాంటి సంఘటనలు ప్రజల్లోకి ఏం సంకేతాలు తీసుకువెళతాయి. పవన్‌ కల్యాణ్‌ ఆ దిశగా ఆలోచిస్తున్నారో లేదో మరి!

నాదెండ్ల వారితో లాభమేనా?
కొన్ని నేపథ్యాల కారణంగా కొన్ని పేర్లకు శాశ్వతమైన కీర్తి ముద్రపడిపోతుంది. ఫరెగ్జాంపుల్‌.. ఈ రాష్ట్రంలో 'సూర్యకాంతం' లేదా 'జయమాలిని' అనే పేరు కొన్నిదశాబ్దాలుగా ఎవరూ తమ పిల్లలకు పెట్టుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ రకంగా 'నాదెండ్ల' అనే పేరుకు కూడా ఒక శాశ్వతమైన అపకీర్తి (ఎట్‌ లీస్ట్‌ రాజకీయాలకు సంబంధించినంత వరకు) ముద్ర ఉంది. తెలుగుజాతి అన్నగా గుర్తించుకున్న ఎన్‌టి.రామారావును వెన్నుపోటు పొడిచి, అధికారాన్ని లాక్కున్న దుష్టపాత్రగా నాదెండ్ల భాస్కరరావుకు పేరుంది.

అంతకంటె చంద్రబాబునాయుడు పొడిచిన వెన్నుపోటు పెద్దదే కావొచ్చు. కానీ చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా.. ఒకసారి అధికారాన్ని లాక్కోగానే, రామారావు మరణానంతరం.. ఆయన భజనే చేస్తూ తన అపకీర్తిని కాస్త మరుగున పడేశారు. కానీ నాదెండ్ల భాస్కరరావు కుటుంబం సంగతి వేరు. ఆయన కుమారుడే నాదెండ్ల మనోహర్‌! మరి ఈ నాదెండ్ల వారితో పవన్‌ కల్యాణ్‌కు లాభం జరుగుతుందా? అనేది మాత్రం సంశయంగానే ఉంది.

తన నియోజకవర్గం దాటి పక్కనియోజకవర్గం మీద కూడా ఎలాంటి ప్రభావమూ చూపించలేని చాలామంది నాయకుల్లాగానే నాదెండ్ల మనోహర్‌ బలం కూడా పరిమితమైనది. పైగా ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ పార్టీలో ఉంటే నెగ్గే అవకాశం ఎటూ లేదు. ఇటు తెదేపాలోకి ఎంట్రీ అసాధ్యం. వైకాపాలలోకి కూడా ఆయనకు ఎంట్రీ కష్టమైన స్థానిక పరిస్థితులున్నాయి.

భాజపా వైపు వెళ్లడానికి ఆ పార్టీకి ఆల్రెడీ ఏపీలో సమాధి తయారైపోయి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు అంతోఇంతో రాజకీయ మనుగడ కోసం జనసేన తప్ప వేరే గతిలేదు. ఇలాంటి గతిలేని నాయకుల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగినంత మాత్రాన పవన్‌కల్యాణ్‌ తాను అనుకుంటున్న నవతరం రాజకీయాలను సృజించగలరా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

పార్టీకి బలం కాగల వారున్నారా?
స్థూలంగా పరిశీలించినప్పుడు.. ఇప్పటిదాకా జనసేనను అండగా వాడుకుంటూ, ఆసరాగా ఎంచుకుంటూ తాము స్థిరపడడానికి, ఎదగడానికి ప్రయత్నిస్తున్న నాయకులే ఆ పార్టీలోకి వస్తున్నారు. అక్కడ కనిపిస్తున్నారు. అంతేతప్ప.. తమ బలంతో, తమ బలగంతో జనసేన బలాన్ని పెంచగల నాయకులు ఒక్కరైనా ఆ గూటిలో ఉన్నారా? అంటే అనుమానమే. పవన్‌ కల్యాణ్‌ ఎన్నడైనా ఈ కోణంలోంచి తమ పార్టీ బలాబలాలను బేరీజు వేసుకున్నారో లేదో తెలియదు.

మరోరకంగా చెప్పాలంటే.. ఏదో వస్తున్న వారిని చేర్చుకోవడం కంటె మరో ప్రత్యామ్నాయం పవన్‌ కల్యాణ్‌కు కూడా లేదు. కానీ వస్తున్న వారిని గురించి.. తమ పార్టీ బలం పెరిగిపోతున్నదని.. ప్రెస్‌మీట్‌లలో చెప్పుకోడానికి పనికొస్తుందే తప్ప.. వాస్తవంగా పార్టీ కార్యాచరణలో పనికిరాదని పవన్‌ తెలుసుకోవాలి.

ఇలాంటి అద్దె గుర్రాల్ని నమ్ముకుని అందలాలు ఎక్కడం అసాధ్యం అని కూడా పవన్‌ తెలుసుకోవాలి. వాస్తవిక దృష్టితో చూసినప్పుడు ఆయనకు సత్యాలు బోధపడతాయి. అప్రమత్తంగా ఉంటే అధికారం దిశగా అడుగులు సక్రమంగా పడతాయి.

-కిరణ్మయి

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments