ఆ మూడూ జగన్ వద్దనే అంట!

మరి రెండురోజుల్లో జగన్ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారో స్పష్టమైపోతుంది. నిజానికి రేపు (శుక్రవారం) సాయంత్రానికెల్లా ఎల్పీ సమావేశంలో జగన్ మంత్రివర్గానికి ఎంపికచేసిన సహచరుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంటుంది. శనివారం ప్రమాణస్వీకారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ కీలకమైన సమాచారం బయటకు వచ్చింది. మంత్రివర్గ కూర్పు పాక్షికంగా లేదా సంపూర్ణంగా జరిగినా కూడా... ఓ మూడు శాఖల్ని మాత్రం జగన్ తనవద్దనే ఉంచుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

విద్య వైద్యం ఆరోగ్యం నీటిపారుదల శాఖలను జగన్మోహన్ రెడ్డి తన వద్దనే ఉంచుకునే అవకాశం ఉందని అమరావతి వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రజా సంక్షేమం, సమాజ అభివృద్ధి అంటేనే.. వాటికి ప్రాతిపదికలు విద్య వైద్యం ఆరోగ్యం మాత్రమే అని మనం భావించాలి. అలాగే నీటి పారుదల శాఖ కూడా అంతే ముఖ్యమైనది. నిజానికి రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు ఎంతగా భ్రష్టు పట్టిపోయి... ఎంతగా జనజీవితాలతో ఆడుకుంటూ ఉన్నాయో అందరికీ తెలిసిన సంగతే.

జగన్మోహన్ రెడ్డి... తొలినుంచి కూడా విద్యారంగం సమూల ప్రక్షాళనకు కృతనిశ్చయంతోనే ఉన్నారు. పాదయాత్ర సందర్భంగా కూడా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకు వచ్చే దిశగా ఆయన అనేక హామీలు ఇచ్చారు. నిజానికి ప్రభుత్వ పాఠశాలలను పరిపుష్టం చేయాలని, సమాజంలో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకు ఎగబడి వచ్చేలా విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనేది ఆయన స్వప్నం. పాఠశాల విద్యను మెరుగుపరచడంలో ఆయన వద్ద నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆ శాఖను జగన్ తనవద్దే ఉంచుకోవడం మంచిదే అవుతుంది.

అదే స్థాయిలో రాష్ట్రంలో ప్రైవేటు దళారీల ఉచ్చులో చిక్కుకుపోయి... అత్యంత ఘోరంగా వైద్యరంగం కూడా కునారిల్లుతోంది. ప్రెవేటు కార్పొరేట్ ఆస్పత్రులు జనాలను ఏ విధంగా దోచుకుంటున్నాయో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయో అందరికీ తెలిసిన సంగతే. దీనిని కూడా కడిగేసే ఉద్దేశంతో జగన్ తన వద్దనే ఉంచుకోబోతున్నారు.

రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడగల పోలవరం నిర్మాణం, ఇతరత్రా ప్రాజెక్టులు సగంలో ఉన్నాయి గనుక... ప్రస్తుతానికి కీలకమైన నీటిపారుదల శాఖను కూడా ఆయన తన వద్దనే ఉంచుకుంటారని తెలుస్తోంది. ఆ రకంగా.. ఎలాంటి విమర్శలకు తావులేకుండా నిర్వహించేందుకు గాను.. ప్రజలకు నిత్యం అవసరమయ్యే మూడు శాఖలను జగన్ తన వద్ద ఉంచుకోబోతున్నారని తెలుస్తోంది. 

పరిటాల శ్రీరామ్..చలో సింగపూర్ అంటారా?

Show comments