ఎమ్బీయస్‌: అలెప్పో విముక్తి

సిరియాలో అతి పెద్ద నగరం, వాణిజ్యరీత్యా రాజధాని అనదగిన అలెప్పో ఎట్టకేలకు నాలుగున్నరేళ్ల తర్వాత ఐసిస్‌ హస్తాల నుంచి 2016 డిసెంబరు 22 న విముక్తి పొందింది. మామూలుగా ఐసిస్‌తో పోరాటం మాత్రమే అయితే యింతకాలం పట్టకపోను. కానీ సిరియా అధ్యక్షుడు బషర్‌పై పగబట్టిన పాశ్చాత్యదేశాలు, అమెరికా అతని వ్యతిరేకంగా పోరు సలుపుతున్న తిరుగుబాటుదారులకు మద్దతిచ్చే మిషతో ఐసిస్‌కు కూడా బలం చేకూర్చడంతో, మరోవైపు రష్యా సిరియా ప్రభుత్వానికి అండగా నిలవడంతో యిరువైపులా బలం సమానమై పోరాటం సుదీర్ఘంగా సాగింది. మొత్తం 3 లక్షల మంది పోతే దానిలో సైనికులే ఎక్కువ. సిరియా ప్రభుత్వం అలెప్పోను కైవసం చేసుకుంటుందని పాశ్చాత్య మీడియా ఎప్పుడూ అనుకోలేదు. వాళ్లు సిరియాకు వ్యతిరేకంగానే రిపోర్టులు రాస్తూ వచ్చారు. కానీ చివరకు సిరియాయే గెలిచింది.

ప్రస్తుతానికి రాజధాని డమాస్కస్‌, ప్రధాన నగరాలైన హోమ్స్‌, హామా, అలెప్పోలలో ప్రభుత్వం బలంగా వుంది. జనాభా తక్కువగా వుండే ఇద్లిబ్‌ ప్రాంతంలో తిరుగుబాటుదారులు, అల్‌ కైదాకు అనుబంధంగా వున్న నస్రా ఫ్రంట్‌ బలంగా వున్నారు. తిరుగుబాటుదారుల చేతిలో కొన్ని చిన్న నగరాలు వుండిపోవడంతో అలెప్పో విషయంలో ప్రభుత్వం వారి షరతులకు లోబడవలసి వచ్చింది. అలెప్పోలో యిరుక్కుపోయిన తమ తోటి తిరుగుబాటుదారులను భద్రంగా ఇద్లిబ్‌ ప్రాంతానికి వెళ్లిపోనివ్వాలని తిరుగుబాటుదారులు, ఐసిస్‌ పట్టుబట్టారు. ప్రభుత్వం సరేనంది. రష్యా, సిరియా సేనలు నెల్లాళ్ల పాటు మిలటరీ దాడులు ఆపారు. చివరకు ఒప్పందం కుదిరి వారం రోజుల్లో 34 వేల మంది పౌరులను నగరంలోంచి తరలించారు. అలెప్పోలో ఒకప్పుడు రెండున్నర లక్షలుండే క్రైస్తవ జనాభా ఐదోవంతుకి పడిపోయినా, ఐదేళ్ల తర్వాత నగరంలోని సెయింట్‌ ఎలియాస్‌ చర్చిలో  క్రిస్మస్‌ ఘనంగా నిర్వహించారు. డమాస్కస్‌, అలెప్పో శివార్లలో పోరాటాలు సలుపుతున్న తిరుగుబాటుదారులపై యిప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంతేకాదు, దాయిష్‌ (ఐసిస్‌కు అక్కడి పేరు) బలంగా వున్న రక్కాను అన్ని వైపుల నుండి చుట్టుముట్టింది.

అలెప్పో విముక్తి కాకుండా ఒబామా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించిందని డీ-క్లాసిఫై అయిన డాక్యుమెంట్లు తెలుపుతున్నాయి. అలెప్పోలో, యితర ప్రాంతాల్లో జిహాదీలకు తర్ఫీదు యివ్వడానికి సిఐఏ ఏటా 100 కోట్ల డాలర్లను ఖర్చు పెట్టింది. సిరియా సైన్యపు స్థావరాలను ఎంచుకుని వాటిపై బాంబులు వేయడం ద్వారా అల్‌ నస్రా, అహరార్‌ ఎల్‌షామ్‌ సంస్థలకు అమెరికా సాయపడింది. యుద్ధవిరమణ ప్రయత్నాలు సాగుతుండగానే అక్టోబరులో అమెరికా ఎయిర్‌ ఫోర్సు సిరియా సైన్యస్థావరాలపై బాంబులు వేసింది. సిరియా సైన్యం ఐసిస్‌పై పైచేయి సాధించిన సయమంలో అమెరికా వారం రోజుల యుద్ధవిరామం ప్రకటించాలని యునైటెడ్‌ నేషన్స్‌ సెక్యూరికీ కౌన్సిల్‌ ద్వారా తీర్మానం చేయించడానికి ప్రయత్నించింది. తిరుగుబాటుదారులు అలెప్పోలోని పౌరజనాన్ని దునుమాడే రోజుల్లో యిలాటి యుద్ధవిరమణ ప్రతిపాదన చేయాలని దానికి తోచలేదు. ఇప్పుడు కూడా ఎందుకు ప్రతిపాదించిందంటే తిరుగుబాటుదారులకు, ఐసిస్‌కు సాయపడడానికి అదీ, దాని మిత్రదేశాలూ తమ గూఢచారులను పంపాయి. వాళ్లని తప్పించడానికి యీ విరమణ వుండాలని కోరింది. సిరియా ప్రభుత్వం యిప్పటికే అలాటి 12 మంది గూఢచారుల పేర్లు ప్రకటించింది. వారిలో చాలామంది సౌదీ అరేబియా వాళ్లే. తక్కినవాళ్లు కతార్‌, జోర్డాన్‌, అమెరికా, ఇజ్రాయేల్‌, మొరాకో దేశస్తులు. కౌన్సిల్‌లో యీ తీర్మానాన్ని రష్యా, చైనా అడ్డుకుని తిరుగుబాటుదారులందరూ లొంగిపోయాక అప్పుడు పాస్‌ చేయనిచ్చాయి. 

సిరియా సైనలు స్కూళ్లపై, అనాథాశ్రమాలపై, ఆసుపత్రులపై దాడులు చేస్తున్నాయని జిహాదీలు చేసిన ప్రచారాన్ని ఆధారం చేసుకుని పాశ్చాత్య మీడియా హోరెత్తించేసింది. నిజానికి వాళ్లకు సంబంధించిన ఒక్క రిపోర్టరు కూడా అక్కడ అలెప్పోలో లేడు. తిరుగుబాటుదారులు, దాయిష్‌ కలిసి ఆసుపత్రులపై చేసిన దాడుల గురించి పట్టించుకోలేదు. పాశ్చాత్య మీడియా ప్రచారాన్ని అందిపుచ్చుకుని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి సమంతా పవర్‌ రువాండాలో 1994లో జరిగినట్లుగా ప్రస్తుతం అలెప్పోలో జరుగుతోందని ఆరోపించింది. అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ జాన్‌ కెర్రీ సిరియా ప్రభుత్వం తన పౌరులపై దారుణ దమనకాండ నిర్వహిస్తోందని గగ్గోలు పెట్టాడు. ఇప్పుడు అలెప్పో విముక్తి తర్వాత 'సిరియాలో యుద్ధం ముగియలేద'ంటూ ప్రకటన చేశాడు. 

నిజానికి ఇరాక్‌లో పెద్ద నగరమైన మోసుల్‌లో దాయిష్‌పై జరుపుతున్న యుద్ధంలో అక్కడున్న పది లక్షలమంది పౌరులపై అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ బాంబులు కురిపిస్తోంది. దాని మిత్రదేశమైన సౌదీ అరేబియా యెమెన్‌పై ఘోరంగా దాడి చేసి గత 21 నెలల్లో 11 వేల మంది పౌరులను చంపేసింది. ఇవేవీ అమెరికా కంటికి కనబడవు. సిరియా అధ్యక్షుడు నియంతే కావచ్చు. కానీ నియంతను దింపే పని అక్కడి ప్రజలు చూసుకోవాలి తప్ప యితర దేశాల వాళ్లు జోక్యం చేసుకోకూడదు. ఇలాటి వాటిల్లో తలదూర్చడంలో అమెరికా ప్రథమస్థానంలో వుంటూ వచ్చింది. దానివలన అంతర్జాతీయంగా ప్రతిష్ఠ పెరిగిందో లేదో కానీ దాని పౌరులకు మాత్రం అసంతృప్తి పెరిగి ఒబామా విధానాలకు వ్యతిరేకంగా ఓటేశారు. అమెరికాకు కొత్త అధ్యక్షుడుగా ట్రంప్‌ రాబోతున్నాడు కాబట్టి అమెరికా దృక్పథంలో మార్పు వస్తుందేమో చూడాలి. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2017) 

Show comments