వైసీపీకి 2024 ఎన్నికల పరీక్ష!

వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నాలుగేళ్ల‌ పాలనపై సమీక్ష కన్నా తదుపరి ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తి ఉంటుంది. ఇందుకు కారణం ఇప్పటికే ప్రజలు తమ రాజకీయ నిర్ణయాన్ని తీసుకుని ఉండ‌డ‌మే. ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప ఈ ఏడాది పాలనతో ప్రజల రాజకీయ నిర్ణయంలో మార్పులు ఉండవు. పొత్తులు, వ్యూహాలు, పార్టీ యంత్రాంగం సన్నద్ధత మాత్రమే ఇక మిగిలాయి

సార్వజనీన అనుకూల అంశాలు.

రాజకీయాల్లో మంచీచెడులుండవు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఎలా స్వీకరించార‌నే అంశమే గెలుపోట‌ములకు ప్రామాణికం. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పాలనా విధానాల‌ వల్ల పేద, దిగువ, మధ్యతరగతి ప్రజల్లో సార్వజనీన సానుకూల వాతావరణం నెలకొంది. సంక్షేమ పథకాలు, 32లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ ఈ తరగతి ప్రజలలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలత స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన పార్టీలు అమలు చేసిన, అలాగే వైసీపీ అమలు చేస్తున్న పద్ధతులు పూర్తి భిన్నం. తెలుగుదేశం, కొన్ని మీడియా సంస్థలు చేసిన ప్రచారం కూడా వైసీపీ ప్రభుత్వానికి ఈ తరగతులలో నమ్మకాన్ని పెంచేలా చేసింది. వైసీపీ ప్రభుత్వం ఓడిపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారన్న వాతావరణం నెలకొంది.

సార్వజనీన వ్యతిరేకత

అదే సమయంలో పథకాల అమలు మధ్యతరగతి , ఉద్యోగులు, ఉన్నత వర్గాలు, ఆలోచనాపరులలో సార్వజనీన వ్యతిరేకత నెలకొంది. సంక్షేమ పథకాలే ప్రతి సమస్యకు కారణంగా ఈ తరగతి ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలు అంటే సంక్షేమ పథకాల అమలు, ఆదాయ సముపార్జన శాఖలు మినహా మిగిలిన వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఏర్పడే దుష్పరిణామాలు నేరుగా ప్రజలకు కనపడుతోంది. పాల‌న‌పై ఎమ్మెల్యేల పెత్తనం మితిమీరడం వల్ల ప్ర‌భుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల వల్ల కూడా పై తరగతి ప్రజలకు ప్రభుత్వం దూరం అయింది.

వైసీపీ ముందున్న సవాళ్లు...

175 అసెంబ్లీ సీట్లు ఎందుకు గెలవకూడద‌న్న నినాదం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ముందు అన్నట్లు ఇప్పుడు అనడానికి తటపటాయిస్తున్నారు. స్థూలంగా పట్టణ స్వభావ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న నియోజకవర్గాలలో అధికార వైసీపీకి ప్రతికూల వాతావరణం నెలకొంది. గ్రామీణ స్వభావం కలిగి ఉన్న నియోజకవర్గాలలో అధికార వైసీపీకి సానుకూల వాతావరణం నెలకొంది. య‌ధాతథ‌గా ఫలితాలు ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

అధికార పార్టీకి అదనపు సమస్య  

రాజు యుద్ధంలో గెలవాలంటే సైన్యం సంసిద్ధత ముఖ్యం. రాజు ప్రజలకు మంచి పాలన అందించినా తన రాజ్యంపై పరాయి రాజు యుద్ధానికి వస్తే పోరాడేది ప్రజలు కాదు సైన్యం. రాజకీయాలలో అంతే. ప్రాధాన్యత శ్రేణులకు లేకపోయినా విస్మరించలేని పాత్ర ఉంటుంది. అధికార పార్టీ తన శ్రేణులను తానే నిర్వీర్యం చేసుకుంది. శ్రేణులు అవసరం లేదు అన్నట్లుగా పార్టీ వ్యవహార శైలి ఉంది. అధినాయకత్వమే కాదు ఎమ్మెల్యేల‌ వ్యవహారం పరాకాష్టకు చేరింది. సామంత రాజులుగా మారారు.   

ఎమ్మెల్యేలు అలా తయారుకావడానికి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కూడా అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త‌ర‌చూ మాట్లాడ‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన‌ కారణం. గణనీయంగా ఎమ్మెల్యేలను మార్చకపోతే పార్టీ శ్రేణులే వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్సీ ఫ‌లితాల త‌ర్వాత కూడా పెద్దగా నాయకత్వం వ్యవహార శైలిలో మార్పులు రాలేదు అంటే గుర్తించలేదా? లేకపోతే అవసరం లేదని అనుకుంటున్నారా? అన్నది మున్ముందు అర్థం అవుతుంది.

రాజధానిపై తప్పటడుగులు

మూడు రాజధానుల ఆలోచన ఎలా ఉన్నా వేస్తున్నది మాత్రం తప్పటడుగులు అనక తప్పదు. మూడు రాజధానులు ఆలోచనతో 33 నియోజకవర్గాలు ఉన్న కృష్ణా గుంటూరు , సగభాగం ప్రకాశం జిల్లాలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 44 నియోజకవర్గాలు కలిగిన గోదావరి, నెల్లూరు జిల్లాలను ప్రేక్షకులుగా మార్చి వేశారు. రాజధానిపై ప్రత్యేక ఆసక్తి లేని 34 నియోజకవర్గాలు కలిగిన ఉత్తరాంధ్రకు కీలక రాజధానిని ప్రతిపాదించారు. అలాగే రాజధానిపై ఆసక్తి చూపుతున్న 52 నియోజకవర్గాలు కలిగి ఉన్న రాయలసీమకు గౌరవ ప్రదమయిన వాటా ఇవ్వలేదు. మొత్తానికి వికేంద్రీకరణ విషయంలో నిర్మాణాత్మక వైఖరి ని అనుసరించక వేస్తున్న తప్పటడుగులతో పట్టణ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం నెలకొంది.

పట్టణ ప్రభావిత నియోజక వర్గాలలో స్పష్టమైన వ్యతిరేక ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అసంతృప్తి కూడా తోడైతే గెలుపు అంత శుభం కాదు. వైసీపీ తదుపరి అడుగులు ఎలా వేస్తుంది , విపక్షాల ఐక్యత - పొత్తులు కుదిరే పరిణామాలు 2024 ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుంది.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, రాజకీయ విశ్లేషకులు.

Show comments