పేలవంగా మరో వీకెండ్

గడిచిన కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ డల్ గా సాగుతోంది. ఏప్రిల్ నెల మొత్తం బోసిపోయింది. మే నెలలో మొదటి వారం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మే రెండో వారాంతం కూడా అలానే కనిపిస్తోంది.

గత వారాంతం ఆ ఒక్కటి అడక్కు, బాక్, ప్రసన్నవదనం, శబరి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు నిలదొక్కుకునేలా కనిపించినప్పటికీ, అంతలోనే ప్రభావం చూపించలేకపోయింది. ఇక మిగతా సినిమాల సంగతి సరేసరి.

అలా ఎలాంటి ఇంపాక్ట్ చూపించకుండానే రెండో వీకెండ్ లోకి అడుగుపెడుతోంది టాలీవుడ్. ఈసారి కృష్ణమ్మ, ప్రతినిథి-2, సత్య, ఆరంభం లాంటి సినిమాలున్నాయి. ఇవి కూడా ప్రజల్ని పెద్దగా ఆకర్షించడం లేదు.

నిజానికి ఈ వీకెండ్ ప్రతినిధి-2 రూపంలో ఓ పొలిటికల్ మూవీ వస్తోంది. ఎన్నికల వేళ, ఈ పొలిటికల్ మూవీ మరింత వేడి పెంచుతుందని, తద్వారా కలెక్షన్లు కొల్లగొట్టొచ్చని ఆశించాడు నారా రోహిత్. కానీ ప్రేక్షకులు ఈ సినిమాను అస్సలు పట్టించుకోలేదనే విషయం అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థమౌతుంది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.. ఇలా ఏ సిటీలో చూసుకున్నా ప్రతినిధి-2కు అడ్వాన్స్ బుకింగ్స్ లో ఒక్క టికెట్ కూడా తెగలేదు.

అటు సత్యదేవ్, తన కృష్ణమ్మ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. బెజవాడ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను కూడా జనం పట్టించుకోవడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫీవర్ ఊపందుకుంది. పోలింగ్ డేట్ దగ్గరకొచ్చేసింది. అటు ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఐపీఎల్ మ్యాచులు రసకందాయంలో పడ్డాయి. దీంతో యూత్ ఎవ్వరూ థియేటర్లకు వెళ్లడం లేదు. అలా మరో వీకెండ్ ఎలాంటి హంగామా లేకుండానే ముగిసేలా ఉంది.