నేను…చరణ్ మాత్రమే చేయాల్సిన సినిమా ఆచార్య

మరి కొన్ని రోజుల్లో ఆచార్య సినిమా విడుదల..

మరి కొన్ని గంటల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్..

ఎన్ని పనులు, ఎన్ని టెన్షన్లు..ఎంత వత్తిడి…

అలాంటి నేపథ్యంలో మెగాస్టార్ ఆఫీస్ నుంచి కాల్…రెండు రోజుల క్రితం పెట్టిన వాట్సాప్ మెసేజ్ కు సమాధానంగా…ఇంటికి ఇంటర్వూకి రమ్మంటూ..అచ్చంగా రెక్కలు కట్టుకునే వాలిపోవాలిగా…

‘బాస్’ ఆఫీస్ రూమ్. ఆచార్య టీజ‌ర్ లో చిరుతపులిలా ఎంత హుందాగా నడిచారో..అంత హుందాగానూ ప్రవేశించారు. 

‘హాయ్ మూర్తిగారూ....’ అంటూ ఆప్యాయమైన పలకరింపు.

అలా ప్రారంభమైంది ఈ ఇంటర్వూ..టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ తో.

చాన్నాళ్లయింది మూర్తిగారూ మనం కలిసి…ఖైదీ 150 టైమ్ లో కలిసాం. 

అవును సర్…మిమ్మల్ని వేదికల మీద చూస్తూనే వున్నాం. ట్విట్టర్ లో ఫాలో అవుతూనే వున్నాం. మీ మాటలు వింటున్నాం. అయినా స్క్రీన్ మీద చూడ్డానికి మాత్రం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం.

మీకు కాస్త రివల్యూషనరీ భావాలున్న పాత్రలు అంటే కాస్త ఇష్టం వుందని పిస్తుంది. గతంలో కొన్ని పాత్రలు చేసారు. వాటికీ ఈ ఆచార్యకు తేడా ఏమిటి?

ఆచార్య నా క్యారెక్టర్ పరంగా నక్సల్ నేపథ్యం వున్నా, కథా పరంగా ఇది ఓ దైవత్వానికి..దుష్టత్వానికి మధ్య నెలకొన్న సంఘర్షణలోకి ఈ విప్లవ భావాలు వున్న వ్యక్తి ఎలా వచ్చాడు అన్నది కీలకం. అసలు పరస్పర వైరుధ్యమైన రెండు భావాలను కొరటాల చాలా బాగా మిక్స్ చేసి కథ తయారు చేసారు. అక్కడ నేను ఇంప్రెస్ అయ్యాను. ఒక ప్రవిత్రమైన ఆలయానికి సంబంధించిన దాన్ని ఎలా కాపాడాడు అన్నది అంతర్లీనంగా వుంటుంది. కొరటాల తన స్టయిల్ ప్రకారం ఓ మంచి మెసేజ్ ను, అది కూడా సమాకాలీన ఎగ ప్రాబ్లమ్ ను చాలా అందంగా వచ్చేలా చేసారు.

సినిమాలో నక్సలైట్ పాత్ర చేయాల్సి వచ్చినపుడు మీ ఫ్యాన్ బేస్, మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటారు. మీ పాటలు, డ్యాన్స్ లు, ఇువన్నీ ఇక్కడ సెట్ అవుతాయా అన్న ఆలోచన చేసారా?

నా ఇమేజ్ లో వున్న మ్యాజిక్ నే అది. నా ఫ్యాన్స్ క్యారెక్టర్ ను క్యారెక్టర్ గా చూస్తారు. అదే టైమ్ లో పాట, డ్యాన్స్ వస్తే ఎంజాయ్ చేసారు. రుచికరమైన ఉప్మాను తింటూనే, మధ్యలో జీడిపప్పు వస్తే దాని రుచి కూడా ఆస్వాదించినట్లు అన్నమాట, మళ్లీ ఉప్మాను ఉప్మాలా తింటారు. ఇక్కడ మీకో ఉదాహరణ చెబుతాను.

రమణ సినిమాను తెలుగులో టాగోర్ గా తీయాలని అనుకున్నపుడు మురుగదాస్ వచ్చారు. హీరో పాత్ర చాలా గొప్పది..పాటలు వుండవు…చివర్న పాత్ర చనిపోతుంది అన్నారు. హీరో పాత్ర చనిపోతే నిర్మాత చనిపోతాడు అన్నాను. ముందు వెళ్లి ఇంద్ర సినిమా చూసి రమ్మన్నాను. అదేంటీ అంత గొప్ప పాత్రను చూస్తున్నారు. పాటలూ చూస్తున్నారు అన్నాడు ఆయన. కానీ పాత్రను చంపకుండా వుండనన్నాడు. దాంతో వేరే డైరక్రర్ తో చేసాం. ఓ మాంచి మెసేజ్ ఇచ్చే సినిమాలో పాత్ర చనిపోతే అది బాగుండదు అనే ఆలోచనతో ఆ విధంగా మన స్టయిల్ లో చేసుకున్నాం.

అంటే నేను చెప్పేదేంటంటే నా ఫ్యాన్స్ నా సినిమా కథను, పాత్రను యాక్సెప్ట్ చేస్తూనే పాటలు, డ్యాన్స్ లు కూడా ఓకె అంటారు. అయితే ఆచార్య సినిమా దగ్గరకు వచ్చేసరికి ఈ సినిమాలో పాటలకు స్కోప్ వుంటుందా? డ్యాన్స్ లు ఎలా చేర్చాలి. ఇలాంటివేం ఆలోచించలేదు. దీనికి తోడు ఇటీవల పాండమిక్ పుణ్యామా అని మన ప్రేక్షకులు వరల్డ్ సినిమాకు ఎక్స్ పోజ్ అయ్యారు. కథను కథగా చూడ్డం అలవాటు చేసుకుంటున్నారు. అబ్జార్వ్, ఎంజాయ్ చేయడం అలవాటైంది అని అనుకుంటున్నారు. అది మా విషయంలో కూడా. అందువల్ల మరీ అవసరమైన ఒకటి రెండు పాటలు వుంచుకుని, మిగిలిన వాటిని పక్కన పెట్టగలగుతున్నాం. సైరాలో అనవసరమైన పాటలు లేవు. నార్త్ సంగతి వదిలేస్తే ఆ సినిమాను బాగా ఆదరించారనే చెప్పాలి. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చేస్తున్నాను. అందులో పాటలు లేవనే చెప్పాలి. కానీ అది జ‌నాలను ఆకట్టుకుంటుందనే అనుకుంటున్నాను. ఎప్పుడయితే చెప్పే విషయం బలంగా వుంటుందో, సాంగ్స్ లేకపోయినా ఓకె. ఎప్పుడయతే కథ బలంగా వుండదో, అక్కడ సాంగ్స్ పెట్టి మసిపూసి మారేడు కాయ చేయాల్సి వుంటుంది. కథ, ఎమోషన్లు బలంగా వుంటే అవి కూడా ఎంజాయ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను.

అంటే…వరల్డ్ సినిమాకు మెగా ఫ్యాన్స్ బాగా ఎక్స్ పోజ్ అవుతున్నారు. వారు సినిమాను చూసే విధానం మారుతోంది అంటారు.

మారిందని అంటాను. ఆ విధంగా మార్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. వాళ్ల పల్స్ నాకు ఇంకా పూర్తిగా అందలేదు. కానీ వాళ్లకు కావాల్సిన ఎమోషన్, కథ, కథనాలు అందిస్తున్నాం. సరదాగా వుండడానికి ఒకటి రెండు సాంగ్స్ ఇస్తున్నాం. కానీ అవకాశం లేకపోతే బలవంతంగా మాత్రం చొప్పించడం లేదు. నేను నా వైపు నుంచి కొంచెం అలవాటు చేస్తున్నాం.

సరైన పాత్ర పడినపుడల్లా మీలోని నటుడు చాలా బలంగా బయటకు వస్తాడు. ఆచార్య పాత్ర ఏ మేరకు అలాంటి అవకాశం ఇచ్చింది

శివ ఈ కథ నాకు చెప్పినపుడు నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఆచార్య అనే మంచి పాత్ర వుంటూ వుండగానే అందులో ఇంటిగ్రిటీగా కలిసిపోయే విధంగా మరో పాత్రను తయారు చేసారు. అదే చరణ్ పాత్ర. దాన్ని ఆయన ఎంత అద్భుతంగా మలచారు అంటే దానంతట అది కథలోకి వచ్చినట్లు వుంటుంది తప్ప, కోరి చొప్పించినట్లు కాదు. ఏ సినిమా అయినా కావచ్చు. పైన కనిపించే అంశం కాదు. దాని సోల్. అదే ఎప్పుడూ ఆకట్టుకునేది. పర్సనలైజ్డ్ ఎమోషన్ వున్నపుడే అది టచ్ చేస్తుంది. మీరు హాలీవుడ్ యాక్షన్ సినిమాలు చూడండి. అక్కడ కూడా ఈ హ్యూమన్ టచ్ వుంటుంది. అది లేకుండా ఎన్ని ఫైట్లు, పాటలు పెట్టినా నడవదు. ఆచార్య సినిమాలో అలాంటి సోల్ రామ్ చరణ్ క్యారెక్టర్.

అంటే మీరు సినిమా కథ విన్ననాటికే రామ్ చరణ్ పాత్ర వుందా?

యస్.యస్..అప్పటికే వుంది. అయితే తరువాత తరువాత కథ డెవలప్ మెంట్ లో కొంత నిడివి పెరిగింది. ఇప్పుడు దాదాపు ఇద్దరు హీరోల సినిమాగా మారింది. ఇంటర్వెల్ వరకు నా పాత్ర, అక్కడి నుంచి చరణ్ పాత్ర, మళ్లీ ఆ తరువాత ఇద్దరి పాత్రలు ఇలా వుంటుంది స్క్రీన్ ప్లే.

కొరటాల మంచి ఎమోషనల్ డైలాగులు రాస్తారు. పాఠాలు..గుణపాఠాలు డైలాగ్ బాగా పాపులర్ అయింది ఇప్పటికే. ఇవన్నీ మీ నోట ఎలా వుండబోతున్నాయి.

ఇక్కడ ఓ విషయం ఏమిటంటే డైలాగులు బలంగా వుంటాయి. కానీ అలా అని బలంగా చెప్పడం వుండదు. బలంగా హత్తుకునేలా వుంటాయి. అది కొరటాల స్టయిల్. ఆయన మ్యాజిక్ ఏమింటంటే ఇంటెన్సివ్ డైలాగులు డెప్త్ తో చెప్పిస్తారు. గుచ్చుకున్నట్లుగా వుంటాయి. ఇది నాకు కూడ కొత్తనే. అలవాటు పడడానిక ట్రయ్ చేస్తున్నా. కూల్ అనే మనిషికి..నక్సలైట్ కు మ్యాచ్ కాదు. కానీ నిజ‌మైన నాయకుడు చాలా కూల్ గా వుంటాడు. కంపోజ్డ్ గా వుంటాడు. అదే నా క్యారెక్టర్. నడక కూడా అలాగే వుంటుంది.

టీజ‌ర్ లో చూసాం మీ నడకను.

యస్. మీరు అక్కడే గమనించి వుంటే ఓ హుందాతనం వుంటుంది అందులో.

గతంలో చూసుకుంటే మన సినిమాల్లో డ్రామా పాలు ఎక్కువ వుండేది. రాను రాను అది తగ్గుతూ వస్తోంది. ఇప్పడు నాచురల్ యాక్టింగ్ ను ఎక్కువగ ఇష్టపడుతన్నారు. దీని ప్రకారం మీ స్టయిల్ ను కూడా ఏమైనా మార్చుకుంటున్నారా? మిమ్మల్ని మీరు రీ ఇన్వెంట్ చేసుకుంటున్నారా?

సినిమాల్లో హ్యూమన్ డ్రామా అన్నది తప్పనిసరి.

నేను అంటున్నది నటనా పరంగా.

ఓహ్..నటనా పరంగానా? చాలా మంది నాచురల్ గా చేస్తన్నారు చెప్పాలంటే మనకు ఎప్పుడో వున్నారు అలాంటి వాళ్లు. రామారావు గారు, సావిత్రి, కన్నాంబ, యస్వీ రంగారావు గారు వీళ్లంతా మంచి నాచురల్ యాక్టింగ్ అందించేవారు. అయితే డైరక్టర్ల బట్టి అలా చేసేవారేమో? ఇవ్వాళ కొత్తగా నాచురల్ నటన అంటూ చెప్పడం ఏమిటి?

మీరు కామెడీ టచ్ వున్న పాత్రలు చేసినపుడు చాలా నాచురల్ గా వుంటుంది.అందులో సందేహం లేదు. కానీ అదే మిగిలిన పాత్రల్లో కాస్త డ్రామా వుంటుంది. అది అప్పటి రోజుల ప్రకారం కావచ్చు. అప్పట్లో మోర్ డ్రామా..చేయించేవారు.

నిజ‌మే ఈ రోజుల్లో అంత డ్రామా అన్నది హర్షించడం లేదు. వరల్డ్ ఎక్సపోజ‌ర్ వచ్చింది. అది లేని టైమ్ లో మన సినిమాలే మనం చూసేటపుడు అదే సినిమా అనుకున్నాం. ఎప్పుడయితే ఇతర పదార్థాలు రుచి చూస్తున్నామో, మనకు వైవిధ్యం తెలిసి వస్తోంది. ఇంత రుచిగా వుంటాయా అని అనుకున్నపుడు ఒక్కోసారి మన వంట మనకు నచ్చకపోవచ్చు. అయితే ఇప్పుడు రాను రాను డ్రామా తగ్గిపోతోంది. ఆల్ మోస్ట్ లేనట్లే అనుకోవాలి. లాస్ట్ దశాబ్ద కాలంగా మన సినిమాల్లో కూడా డ్రామా పాలు తగ్గిపోయింది.

సినిమాలో సిద్ద..ఆచార్య పాత్రల మధ్య ఏ సంబంధం లేకపోయినా ఓ అనుబంధం వున్నట్లు ట్రయిలర్ లో కనిపిస్తోంది. మీ రియల్ లైఫ్ బాండింగ్ అక్కడ ఏమైనా ఉపయోగపడిందా? ఆ పాత్రల నడుమ బంధం పండడానికి.

దీనికి నేను కొంచెం ఎలాబరేట్ గా చెబుతాను. అసలు ఈ సినిమాలో ఎందుకు రామ్ చరణ్ వుండాలి. అసలు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో బిజీగా వున్నపుడు, అసలు రాజ‌మౌళి తన సినిమాలు అయ్యే వరకు తన హీరోలను బయటకే రానివ్వరు అలాంటిది వేరే సినిమాను చేయనిస్తారా? చరణ్ ను రాబట్టడానికి అంత కష్టపడాలా? అంత వెయిట్ చేయాల్సిన అవసరం వుందా? అని అనుకున్నాం. కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. ముఖ్యంగా డైరక్టర్ గారు. సినిమాలో తండ్రీ కొడుకులు కాదు. గురుశిష్యులు కాదు. ఓ అతీతమైన బంధం వుంటుంది లేకుండా పోదు. నిజ‌జీవితంలో తండ్రీ కొడుకులుగా వున్నవారే అది చేస్తే, ఏ ఫీల్ అయితే రావాలి అనుకున్నారో అది హండ్రెడ్ పర్సంట్ వచ్చేస్తుంది. నిజానికి ఏ హీరో అయినా ఆ పాత్ర అద్భుతంగా చేసేస్తారు. బట్ మేం ఇద్దరూ వుంటేనే వచ్చే కెమిస్ట్రీ అది చరణ్ చేస్తేనే వస్తుంది. అందుకే నేను, డైరక్టర్ పట్టుబట్టి చేసాం. చరణ్ డేట్ ల కోసం వెయిట్ చేసాం.అన్నింటికి మించి మా ఇద్దరినీ ఒకేసారి స్క్రీన్ మీద చూడాలన్నది సురేఖ కోరిక.తండ్రీ కొడుకులు ఇద్దరూ స్టార్స్ గా వుండడం చాలా రేర్. అదే రాఙమౌళికి చెప్పి ఒప్పించాం. ఆయన కూడా చాలా సానుకూలంగా వ్యవహరించారు. రేపు మీరు సినిమా చూస్తే ఎందుకు అంత బలంగా చరణ్ నే వుండాలి అని పట్టుపట్టాం అన్నది అర్థం అవుతుంది. ఆ రెండు పాత్రలు అలా పండాయి.

సమకాలీన హీరోలు అందరికన్నా మీరు పది అడుగులు ముందుకు వేసి చకచకా ప్రాజెక్టులు చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు ఓకె చేస్తున్నారు. అస్సలు ఖాళీ లేకుండా వర్క్ చేస్తున్నారు. ఏమిటిది అంతా?

దీనికి చాలా మూమూలు గా అనిపించినా ఒకటే సమాధానం. ప్రేక్షకుల ఆదరణ. వారి ఆదరణ వల్లే ఇలా చేయడం సాధ్యం అవుతోంది. నేను మళ్లీ మళ్లీ ఇదే చెబుతాను. ఇదే సత్యం. వాళ్ల ఆదరణకు నోచుకోకపోయి వుంటే 150 సినిమాను అంతగా ఆదరించకపోయి వుంటే నాలో ఈ జోష్ వుండేది కాదేమో? అప్పటి వరకు 100 కోట్ల కలెక్షన్ సినిమా లేదు. 150 సినిమా ఆ మైలు రాయి దాటింది. కళ్యాణ్, మహేష్, అర్ఙున్, ప్రభాస్,చరణ్, ఎన్టీఆర్ ఇలా ఎవరు చేసినా అప్పటి వరకు కలెక్షన్లు వంద కోట్లు దాటలేదని ట్రేడ్ వర్గాల బోగట్టా. పైగా ఆ సినిమా చేసే టైమ్ లో రకరకాల ఆలోచనలు. తొమ్మిదేళ్లయింది సినిమా చేసి. జ‌నరేషన్ గ్యాప్ వచ్చింది. ఎంత వరకు పూర్వ ఆదరణ వుంటుంది అనే దాని మీద నాకుండే అనుమానాలు నాకు వున్నాయి. కానీ ఆ ఫిగర్స్ ద్వారా ఆ ఆదరణ బయటపడింది. సైరా సినిమాకు కూడా 126 కోట్లు అనుకుంటా వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా. అంటే వంద కోట్లు దాటిన మూడు సినిమాలు వరుసగా నాకు వున్నాయి అంటే అంతటి అభిమానం, ఆదరణ వున్నాయి అనే ఆనందం నాకు వుంది. బహుశా అదే నా ఎనర్జీ, నా ఫేస్ మీద ఏదైనా గ్లో వుంటే అది ఇదే.

తక్కువ గ్లో లేదు. మీకన్నా చిన్నవాళ్లమైనా మేమే మీకన్నా పెద్ద వాళ్లలా కనిపిస్తున్నాం. మీరు ఫుల్ గ్లామర్ తో వున్నారు.

అదేం కాదు. మీరు కోరి పెద్దరికం ఆపాదించుకున్నారు (నవ్వుతూ)..అయినా మీరు అవకాశం వుందీ అంటే అర్ఙెంట్ గా జీమ్ చేసి మారిపోతారు. నా కన్నా ఎక్కువగా కష్టపడిపోతారేమో?

మీ సంగతి అలా వుంచితే మీ సమకాలికులు లేదా, ఇప్పుడు మీతో పాటు హీరోలుగా చేస్తున్నవారు ఎందుకు మీతో సమానంగా ఫాస్ట్ గా సినిమాలు చేయడం లేదు. లేదా చేయలేకపోతున్నారు?

మిగిలిన వాళ్ల గురించి నేనేం చెప్పను కానీ, ఒకప్పుడు నలభై రోజుల్లో సినిమాలు తీసే పరిస్థితి వుండేది. రాను రాను 80, 100, ఇప్పుడు 160 రోజులు అన్నట్లుగా తయారైంది. దానికి రకరకాల కారణాలు వున్నాయి. కానీ ఇది తగ్గాలి. డేస్ ఎన్ని తక్కువ అయితే అన్ని పాతికలు, అన్ని యాభై లక్షల వంతను బడ్జెట్ తగ్గుతుంది. ఇప్పుడేం అవుతోంది. ఎంత హిట్ అయినా ఇంకా రావాల్సి వుందండీ. అనే పరిస్థితి వుంది. హాలీవుడ్ ప్లానింగ్ బాగుంటుంది. అలాంటి మంచి విషయాలు మనం అడాప్ట్ చేసుకోవాలి. త్రిబుల్ ఆర్ లాంటివి మినహాయింపు అనుకోండి. ఏమైనా ఎక్కువ సినిమాలు చేయాలి అందరూ అని మాత్రం చెబుతాను.

మీరు మిడ్ రేంజ్ డైరక్టర్లకు చాలా ఈజీగా ఓకె చెబుతున్నారు. కానీ మిగిలిన హీరోలు ఓ రేంజ్ డైరక్టర్లు వుంటే తప్ప సినిమా చేయలేకపోతున్నారు. ఎందుకు వాళ్లు ఆ ధైర్యం చేయబోతున్నారు.

వాళ్ల సంగతి నాకు తెలియదు కానీ నా స్టయిల్ ఏమిటో నేను చెబుతాను. నేను ముందుగా కథాంశం ఏమిటో చూస్తాను. ఆ కథకు సరైన ట్రీట్ మెంట్ చేసారా లేదా చూస్తాను. ఆ రెండూ బాగుంటే ఎన్ని షాట్ లు తీసారు, ట్రాలీలు, డ్రోన్ లు, లాంగ్ షాట్ లు, క్లోజ‌ప్ లు, ఇలాంటివి పెద్దగా లెక్కలోకి రావు. నా ఉద్దేశంలో టేకింగ్ అంత ప్రధానం కాదు. కథ, కథనాలతో పోల్చుకుంటే. సినిమా తీయడం కన్నా కథ, కథనం ఇవి చేయడమే అసలైన డైరక్షన్.

కథ, కథనాలు సరైనవి వుంటే డైరక్షన్ సరైన దిశగా వెళ్తోంది అని చూసుకోవచ్చు అనే ధీమా మీకు వుందా?

నిజానికి డైరక్ట‌ర్ కెప్టన్ ఆఫ్ షిప్ అనే దాన్ని నేను నమ్ముతాను. కథ, కథనం వుంటే ఎవరైనా చేసేయచ్చు  అని నేను అనను. కానీ నా వరకు వస్తే నేను వాచ్ డాగ్ లా సినిమా సరిగ్గా వస్తోందా లేదా అన్నది కనిపెడుతూనే వుంటాను. అడిగితే కనుక సూచనలు ఇస్తాను. కానీ యంగ్ స్టర్లు ఎందుకు చేయలేకపోతున్నారు అన్నది నేను చెప్పలేను.

ఎక్కడా లేనంత మంది హీరోలు మన ఇండస్ట్రీలో వున్నారు. కానీ అంత మంది టాప్ డైరక్టర్లు లేదు. అందువల్లే ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాం అంటారా?

ఇది సెన్సిబుల్ క్వశ్చను. నా వరకు నేను చెప్పగలను. మిగతా వారి సంగతి నాకు తెలియదు. కథ, కథనాల మీద నాకు ఓ అయిడియా వుంది. నేను కథను వినను. చూస్తాను. బ్రెయిన్ కు కాదు, మనసుకు తట్టాలి కథ. కథకు ఆ లక్షణాలు వుంటే డైరక్టర్ కు కాస్త సత్తా వుంటే చాలు తీసేస్తారు. ఇక్కడ లాంగ్ షాట్ కాదు క్లోజ‌ప్ వుండాలి లాంటివి వున్నా, జ‌నం అయితే పెద్దగా పట్టించుకోరు అని నేనుకుంటాను. సినిమా టు సినిమా ఆ డైరక్టర్లు కూడా నేర్చుకుంటారు.

కమ్ బ్యాక్ టు ఆచార్య. సినిమా ప్రమోషన్లలో మీ రెండు క్యారెక్టర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా బలమైన క్యారెక్టర్లు వున్నాయా?

రెండు బలమైన ప్రతినాయక పాత్రలు వున్నాయి. సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా మంచివే వున్నాయి.

పూర్తిగా అడవి బ్యాక్ డ్రాప్ నా?

కాదు. పూర్తిగా టెంపుల్ టౌన్ బ్యాక్ డ్రాప్. దేశంలో ఎప్పుడూ వేయనంతగా బిగ్గెస్ట్ సింగిల్ సెట్ ఈ సినిమా కోసం అద్భుతంగా వేసాం. అందులోనే సినిమా ఎక్కువశాతం జ‌రుగుతుంది. అడవి ఓ 25 శాతం వుంటుంది. ఇలాంటి సెట్ ముందు లేదు..తరువాత లేదు.

దేశం మొత్తం మీద నక్సలిజం అన్నది ఫాగ్ ఎండ్ లో వుంది. ఇలాంటి టైమ్ లో ఈ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు.

ఇది ప్రెజెంట్ డేస్ కథ కాదండీ. దానికో స్థల పురాణం, వాయిస్ ఓవర్, ఇవన్నీ వున్నాయి. సెల్ ఫోన్ లు వాడలేదు. అందువల్ల ఈ కాలానికి చెందిన కథగా అనుకోనక్కరలేదు.

ఆర్ఆర్ఆర్..చరణ్..ఓ ప్రౌడ్ ఫాదర్ గా ఫీలవుతున్నారా?

చాలా ఆనందంగా అనిపించింది. చరణ్ తన రెండో సినిమాకే మగధీర లాంటి మాంచి సినిమా చేసాడు. క్రెడిట్ గోస్ టు రాజ‌మౌళి. ఆ సినిమాతో చరణ్ మౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత మధ్య మధ్యలో ఒకటి రెండు ఫ్లాపులు వచ్చి వుండొచ్చు. అది ఎవరికైనా కామన్. ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ ఇలా తనను తాను మెరుగు పర్చుకుంటూ వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చూసిన తరువాత రాజ‌మౌళి ఇద్దరు హీరోలతో జోడు గుర్రాల స్వారీ చేయించి అధ్భుతంగా చేసాడు. రాజ‌మౌళి గురించి ఇక్కడ ఓ విషయం చెప్పాలి. 1988 లో నాకు నేషనల్ ఇంటిగ్రటీ అవార్డు వచ్చినపుడు ఢిల్లీ వెళ్లాను. ఆ రోజు అక్కడ ఓ హై టీ పార్టీ జ‌రిగింది. అక్కడ భారతీయ సినిమా మీద డిస్ ప్లే ఏర్పాటు చేసారు. చూస్తే ఎన్టీఆర్, ఎఎన్నాఆర్, శివాజీ, రాజ్ కుమార్ ఇలా ఎవ్వరి ఫొటోలు, ప్రస్తావన లేదు. చాలా బాధ అనిపించింది. పైగా ఎక్కడికన్నా షూట్ కు వెళ్తే మద్రాసీలుగానే మనకు గుర్తింపు. అలాంటిది విశ్వ‌నాధ్ గారు శంకరాభరణం సినిమాతో కొంత గౌరవం తెచ్చారు. కానీ తరువాత మళ్లీ మామూలే అయింది. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత రాజ‌మౌళి వల్ల మన తెలుగు సినిమా గురించి, మన టెక్నీషియన్ల గురించి అందరూ గర్వంగా చెబుతుంటే చాలా ఆనందంగా వుంది. రాజ‌మౌళి, విశ్వనాధ్ లాంటి వల్ల మన తెలుగు సినిమాకు ఓ గుర్తింపు వచ్చింది. మణిరత్నం, శంకర్, ప్రశాంత్ నీల్ ఇలా అందరూ కలిసి సౌత్ సినిమాతో ఇండియన్ స్క్రీన్ ను ముట్టడిస్తున్నారు. రాజ‌మౌళి పుణ్యమా అంటూ మన సినిమా హద్దులు చెరిగిపోయి, దేశం లో ఎక్కడైనా ఆడేలా మారింది.

ఆచార్య సినిమా మీ ఫ్యాన్స్ గర్వపడేలా, ఆనందించేలా, ఓ విందు భోజ‌నంలా వుంటుందా?

ఎస్. అంటే మా నుంచి ఎక్స్ పెక్ట్ చేసిది ఏమీ మిస్ కాదు. యాక్షన్ సీన్లు కానీ, డైలాగులు కానీ అన్నీ వుంటూనే, ఓ మెసేజ్ కూడా వుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ క్లాస్ టచ్ విత్ మాస్. నేను ఈ సినిమాను గుండెలకు హత్తుకు పోయే సినిమా అంటాను. ఎలాంటి వారైనా సినిమా చూసిన తరువాత కంట తడి పెట్టకుండా థియేటర్ నుంచి బయటకు రారు.

ఇవన్నీ ఇలా వుంచితే ఇరు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచడం వల్ల చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చచ్చిపోతున్నాయని, పెద్ద సినిమాలకే లాభం అనే వాదన కొత్తగా వినిపిస్తోంది. మీరే మంటారు.

ఎక్కడయినా సరే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిన కొద్దీ రెవెన్యూ కూడా పెరగాలి అనుకుంటాం కదాహ? ఈ మధ్య కాలంలో ఉప్పన, ఙాతిరత్నాలు ఇంకా అనేక చిన్న సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి కదా? కంటెంట్ బాగుంటే చిన్న, పెద్ద, ఎక్కువ రేటు తక్కువ రేటు అన్నది వుండదు అని నేను అనుకుంటాను. మంచి కంటెంట్ వుంటే ఎక్కువ రేటు ఇువ్వడానికి ప్రేక్షకుడు రెడీగానే వుంటాడు.  ఆ సంగతి అలా వుంచితే ప్రఙల ఙీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. ఒకప్పుడు డ్రయివర్ కు 2000 ఇచ్చేవాడిని ఇప్పుడు 20 వేలు ఇస్తున్నాను. అందువల్ల ఆ తేడా అన్నింట్లో వుంటుంది కదా? బాగా లేని పెద్ద సినిమా ను మీకు ఫ్రీగా చూపిస్తే చూస్తారా? చెప్పండి. ఫెయిల్ అయిన సినిమాల పేర్లు నేను చెప్పను కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో మీకు తెలుసు కదా? చితికిపోవడం వరకు వస్తే చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమాలు కూడా చితికిపోతున్నాయి. అలాగే రేట్లు తక్కువ వున్న టైమ్ లో వెళ్ల వచ్చు. తక్కువ రేట్లు వున్న థియేటర్ కు వెళ్లవచ్చు. రేట్లకన్నా కంటెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. పైగా సాంకేతికంగా ఖర్చు పెరిగిన తరువాత రేట్లు అన్నది తప్పవు కదా?

ఆంధ్ర సిఎమ్ దగ్గర మీ వేడుకోలు ను కూడా కొందరు తప్పు పట్టారు?

నాది మొదటి నుంచి ఒకటే పాలసీ. ఎవ్వరు నన్ను విమర్శించినా నేను పట్టించుకోను. తిరిగి పరుషంగా మాట్లాడను. పేర్లు చెప్పను కానీ మీరు గతంలో నుంచి ఇప్పటి వరకు చూసుకోవచ్చు. నేను చేతులు జోడించి వేడుకున్నది ఓ ముఖ్యమంత్రిని. ఆ కుర్చీకి వున్న గౌరవం అది. ఇక్కడ మీకు ఓ సంగతి చెబుతాను. నేను కేంద్ర మంత్రిగా వున్నపుడు వివిధ రాష్ట్రాల సీఎమ్ లు నాకన్నా వయసులో పెద్దవారు వచ్చి, నా అపాయింట్ మెంట్ కోసం గంటలు వేచి వుండేవారు. అది నా గొప్పతనం కాదు. నా కుర్చీకి వారు ఇచ్చే గౌరవం. నేను ఆ విధంగా రేట్లు తేకపోయి వుంటే ఆర్ఆర్ఆర్ కు ఈ అంకెలు కనిపించేవా? ఇండస్ట్రీ ఇంతలా కళకళ లాడేదా?

సినిమాల్లో హీరోగా ఓ బాస్ పొజిషన్ ను నిలబెట్టుకోవడం వేరు. టాలీవుడ్ లో బాస్ గా నిలదొక్కుకోవడం వేరు. ఈ రెండు ఫీట్లు మీరు సక్సెస్ ఫుల్ గా చేస్తున్నారు. దీని వెనుక సీక్రెట్.

కష్టపడడం ఒక్కటే అని అనను. అందరూ కష్టపడతారు. ప్రేక్షకుల ఆదరణ, వాళ్లు ఆదరిస్తున్న కొద్దీ జోష్ పెరుగుతోంది. ఇంకా పరుగుపెడుతున్నాను అంతే. ప్రజ‌లు నా మీద అంత అభిమానం పెట్టుకున్నారు. దానికి నేను రుణపడి వుంటాను. ఇక ఇండస్ట్రీ అంటారా? నేను బాస్ గా ఎప్పుడూ వుండను. మనం ప్రేమ చూసిప్తే మన దగ్గరకు వస్తారు. మనం ప్రేమ చూపించకుండా ఎందుకు వస్తారు? అందుకే నేను సదా పది మంది మనుషులను సంపాదించుకోవడానికి చూస్తాను. మనం మనతో తీసుకుపోయేది ఏదీ లేదు. మన సమాధి దగ్గర ఎంత ఎక్కువ మంది కన్నీరు పెడితే మనం అంత సక్సెస్ అయినట్లు. ఇంత మంది ప్రేమను సాధించాను అన్నదే నేను చూసుకుంటాను. మీ జ‌ర్నలిస్ట్ పసుపులేటి రామారావు విషయంలో ఓసారి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ నేను అతని ఇంటికి వెళ్లాను. మాట్లాడి అక్కడే భోజ‌నం చేసి వచ్చాను. అతని కొడుకుకి మా ముగ్గురి అన్నదమ్ముల పేర్లు పెట్టుకున్నాడు. ఇవన్నీ డబ్బులు ఇస్తే వచ్చేవి కాదు. ప్రేమతో గెల్చుకునేవి. నేనేం కొత్తగా మారలేదు. నా నేచర్ అంతే.

రెండు తెలుగు రాష్ట్రాలు వున్నాయి. వీటిలో మీ పుట్టిన గడ్డ..ఆంధ్రలో సినిమా అభివృద్దికి ఏమైనా చేయబోతున్నారా? ముఖ్యంగా విశాఖలో స్టూడియో అన్నది వుంటుందా?

ఆంధ్రలో కూడా సినిమా రంగం అభివృద్ది చెందాలి. ఉపాధి అవకాశాలు పెరగాలి. అయితే నా స్టూడియో అన్నది ఎప్పుడూ ఆలోచనల్లో కూడా లేదు. అసలు నాకు స్టూడియోలు కట్టడం, థియేటర్లు కట్డడం వంటివి సరిపడే వ్యవహారాలు కాదు. ఆ బిజినెస్ మైండ్ నాకు లేదు. ఈ బ్యానర్ కూడా చరణ్ ఆసక్తితో స్టార్ట్ చేసింది.

చివరగా..సదా మీరంటే ప్రేమగా వుండే మీ అభిమానులకు ఏం చెబుతారు?

చెప్పేదేం వుంది? వారు నాకు తోడుగా వున్నారు. నేను ఒక్కసారి ఎప్పుడో రక్తదానం గురించి చెబితే ఇప్పటికీ అవిశ్రాంతంగా అమలు పరుస్తున్నారు. కోవిడ్ టైమ్ లో ఆక్సిజ‌న్ సిలెండర్ల కార్యక్రమాన్ని రోజుల్లో అద్భుతంగా సక్సెస్ చేసారు. ఇవన్నీ వారి వల్లనే సాధ్యం. వారికి ఏం ఇవ్వగలను. వారు కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ ను ఇవ్వడానికి ప్రయత్నించడం తప్ప.నేను చేసిందానికన్నా. వాళ్లు నాకు చేసేదే ఎక్కువ. అందుకే వాళ్లకు సదా రుణపడి వుంటాను. మూడు గంటల పాటు వాళ్లని అలరించగలిగితే చాలు. అల్ససంతోషులు.

సెలబ్రిటీలు బయట తక్కువగా కనిపించాలి. ఎక్కువగా కనిపించకూడదు అంటారు. కానీ మీరు రివర్స్ లో వెళ్తున్నారు.

ఇది నా వరకు కూడా వచ్చింది. నవ్వేసి ఊరుకుంటాను. ఓ చానెల్ లో ఇదే డిస్కస్ చేస్తే నా నిర్మాత ఒకర ఖండించారు. ఆయన గ్లామర్ చెక్కు చెదరదు అని నాకు మద్దతుగా మాట్లాడారు. నేను ఎందుకు ఎక్కువ బయటకు వెళ్తాను అంటే నా అభిమానులకు మరింత దగ్గరగా వుండాలనే.

వి ఎస్ ఎన్ మూర్తి