Prasanna Vadanam Review: మూవీ రివ్యూ: ప్రసన్న వదనం

చిత్రం: ప్రసన్న వదనం
రేటింగ్: 2.75/5
తారాగణం:
సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్
కెమెరా: చంద్రశేఖరన్
ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్
నిర్మాతలు: మణికంఠ, ప్రసాద్ రెడ్డి
దర్శకత్వం: అర్జున్ వై కె
విడుదల: 3 మే 2024

సుహాస్ సినిమాలంటే నిరాశపరచవనే అభిప్రాయం బలంగా ఉంది. కంటెంట్ పరంగా ఎంతో కొంత కొత్తదనం, కథనం పరంగా కాస్తంత పట్టు తప్పనిసరిగా ఉంటాయి ఇతని చిత్రాల్లో. తాజాగా వచ్చిన ఈ "ప్రసన్న వదనం" ఎలా ఉందో చూద్దాం. 

కథలోకి వెళితే, సూర్య (సుహాస్) ఒక రేడియో జాకీ. ఒక యాక్సిడెంట్ కారణంగా అతనికి ప్రొసోపగ్నోషియా అనే పరిస్థితి వస్తుంది. ఇది వ్యాధి కాదు కానీ ఒక లోపం. అదేంటంటే, ఇతనికి మొహాలు గుర్తుండవు. అలాగని గజిని లాగ మతిమరపు సమస్య కాదు. అన్నీ గుర్తుంటాయి. మొహాలు మాత్రం గుర్తుపట్టలేడు. దీనినే ఫేస్ బ్లైండ్నెస్ అని కూడా అంటారు. 

ఈ సమస్యతో ఉన్న కథానాయకుడు ఒక మర్డర్ కేసులో సాక్షి. కానీ నిందుతుడి మొహాన్ని గుర్తుపట్టలేడు. మరెలా? పైగా ఫలానా చోట హత్య జరిగిందని పోలీసులకి ఫోన్ చేసి చెప్పేది కూడా సూర్యనే. 

ఇక్కడ రెండు హుక్ పాయింట్స్.

ఒకటి, అసలా మర్డర్ చేసిందెవరు? వెనుక ఉన్నదెవరు? మోటివ్ ఏమిటి?

రెండోది, ప్రొసోపగ్నోషియా ఉన్న వ్యక్తి దానిని ఎలా చేధించి నిందుతులను గుర్తిస్తాడు? ఆ విషయంలో అతనికి ఎవరు సహకరిస్తారు? ఎలా సహకరిస్తారు?

లైన్ పరంగా చూసుకుంటే ఇది ఆసక్తి కరమైన కథ. దానికి తగ్గట్టుగా కథనాన్ని కూడా బలంగా రాసుకున్నాడు. తెలివిగా రాసుకున్న స్క్రీన్ ప్లే ఇది. అలా అనుకున్న విధంగా మెయిన్ స్ట్రీం ని వదలకుండా నెరేట్ చేసుకుంటూ వెళ్లిపోతే మరొక దృశ్యం స్థాయి సినిమా అయ్యుండేది. 

కానీ ఇక్కడే తెలుగు వాడి అతితెలివి ప్రదర్శించి ఫైట్లు, లవ్ ట్రాకులు పెట్టి ఫార్ములా సినిమాగా మలిచాడు. అవి ఉత్కంఠభరితమైన మూడ్ ని డిస్టర్బ్ చేసే పంటి కింది రాళ్లలా ఉన్నాయి తప్ప పెద్దగా ప్రయోజనం లేదు. 

సుహాస్ కి మాస్ హీరో అనిపించుకోవాలన్న తపన ఎక్కువవుతున్నట్టుగా ఉంది. అలా ఆలోచించిన యువ హీరోల్లో చాలామంది తప్పటడుగులు వేసి కనుమరుగైపోతున్నారు. కేవలం కంటెంట్ ని తప్ప హీరోయిజాన్ని, ఫైట్స్ ని, పాటల్ని ఎక్కువగా ఊహించుకోకుండా ముందుకు వెళ్తే సుహాస్ లాంటి యాక్సెప్టెన్స్ వచ్చిన హీరోకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. 

హీరోకే కాదు, ఈ సూచన దర్శకుడికి కూడా. మాస్ మసలా ఫార్ములా ఎలిమెంట్స్ ఉంటేనే ప్రేక్షకులు హాలుకొచ్చి సినిమా చూసేస్తారనుకోనక్కర్లేదు. మంచి కంటెంట్ ఉంటే ఫార్ములా ఎలిమెంట్స్ లేకపోయినా ప్రేక్షకులు ఆదరిస్తారు, తద్వారా నిర్మాతలు సదరు దర్శకులను ఆదరిస్తారు అని చాల ఉదాహరణల ద్వారా తేలింది. 

ఉదాహరణకి "నెరు" అని మోహన్ లాల్ సినిమా ఒకటొచ్చింది. అందులో ఒక గుడ్డి అమ్మాయి తనని రేప్ చేసిన నిందితుడిని టచ్ ద్వారా ఎలా గుర్తుపడుందనేది కాన్సెప్ట్. వినడానికి సినిమాటిక్ గా ఉన్నా దానిని కన్విన్సింగ్ గా మలచిన తీరు బాగుంది. ఈ "ప్రసన్న వదనం"లో మాత్రం హీరోకున్న ఫేస్ బ్లైండ్నెస్ మీద పెట్టాల్సినంత ఫోకస్ పెట్టకుండా అనవసర ఫార్ములా దినుసుల జోలికి వెళ్లేసరికి అందుకోవాల్సిన స్థాయి అందుకోకుండా అయ్యింది ఈ చిత్రానికి. 

ఇందులొ చెప్పుకోదగ్గ అంశాలు- ఇంటర్వల్ పార్ట్, క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్..అన్నిటికీ మించి కథలో ఉన్న పాయింట్. 

ఇక మైనస్సులేంటంటే ల్యాగ్. చాలా నింపాదిగా జరుగుతున్నట్టుగా ఉంటుంది తెర మీద కథ. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఒకటి డల్ గా ఉంది. అనవసరపు సాగతీతలే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ మైనస్. 

టెక్నికల్ గా మాత్రం విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు మాత్రం వీక్. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉండాల్సింది. 

సుహాస్ తన పాత్రలో ఎప్పటిలాగానే ఒదిగిపోయి నటించాడు. పాయల్ రాధాకృష్ణ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది.

హర్ష చెముడు కొత్తగా చేసిందేమీ లేదు. ఈ చిత్రంలో ప్రధానంగా గుర్తుండేది మాత్రం రాశి సింగ్ పాత్ర. తర్వాత నితిన్ ప్రసన్న మంచి పాత్ర చేసాడు. 

సరికొత్త అంశంతో కథ చెప్పాలన్న తపన స్వాగతించదగ్గదే. అయితే పూర్తిగా దాని మీద దృష్టి పెడితే తెలుగు సినిమాకి కూడా మళయాళం సినిమాకి దక్కే గౌరవం దక్కుతుంది. ప్రతి హీరో సినిమాలోనూ పాటలు, ఫైట్లు కోరుకునే ప్రేక్షకులు తగ్గారు. అవి కొందరికి మాత్రమే పరిమితం చేసి, తక్కిన వాళ్లు కంటెంట్ రిచ్ సినిమాలు చేస్తే చూడాలనుకుంటున్నారు. 

కనుక దర్శక కథానాయకులు ఇద్దరూ ఈ విషయంపై ఆలోచింది రాబోయే చిత్రాల్లో ఎటువంటి అనవసరపు కమెర్షియల్ ఫార్ములా దినుసులు కలపరని ఆశిద్దాం. 

ఇక విషయానికి వస్తే, థ్రిల్లర్ జానర్ ని ఇష్టపడే వారికి ఈ "ప్రసన్న వదనం" నచ్చుతుంది. కనుక నిర్మాతలు కూడా ప్రసన్నవదనంతో దరహాసం చిందించే పరిస్థితి ఉంటుందా అంటే మరో రెండ్రోక్జులు ఆగి చూడాలి. 

బాటం లైన్: ప్రసన్నమే