Aa Okkati Adakku Review: మూవీ రివ్యూ: ఆ ఒక్కటి అడక్కు

చిత్రం: ఆ ఒక్కటి అడక్కు
రేటింగ్: 1.5/5
తారాగణం:
అల్లరి నరేష్, ఫారియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, అరియాన గ్లోరీ, హర్ష చెముడు, హరి తేజ, జమీ లివర్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్ 
ఎడిటింగ్: చోట కె ప్రసాద్
కెమెరా: సూర్య 
నిర్మాత: రాజీవ్ చిలక 
దర్శకత్వం: మల్లి అంకం 
విడుదల: 3 మే 2024 

1992లో ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన "ఆ ఒక్కటి అడక్కు" కామెడీ సినిమాల్లో ఒక కలికితురాయి. ఆ చిత్రం వచ్చినప్పుడు ఎంత ట్రెండీ కామెడీ అనిపించుకుందో ఈ జెనెరేషన్ లో చూస్తున్న వాళ్లని కూడా నాన్ స్టాప్ కామెడీగా అలరిస్తుంది. మరి ఆ టైటిల్ పెట్టుకుని సరిగ్గా 32 ఏళ్ల తర్వాత మరొక చిత్రం వస్తే అంచనాలు ఎలా ఉంటాయి? పాత సినిమాని తలదన్నేలా ఉండకపోయినా కనీసం చెప్పుకోదగ్గ నవ్వులు హాల్లో వినిపిస్తే ఆ టైటిల్ ని గౌరవించినట్టే. పైగా ఆనాటి "ఆ ఒక్కటి అడక్కు" దర్శకుడు ఈవీవీగారి అబ్బాయి అల్లరి నరేష్ ఈనాటి "ఆ ఒక్కటి అడక్కు" హీరో. ఇంతకీ ఎలా ఉందో చూద్దాం. 

గణపతి (అల్లరి నరేష్) ఒక పెళ్ళికాని ప్రసాదు. ఏజ్ బారైనా ఒక్క పెళ్లీ సెట్టవ్వదు. అతని తమ్ముడికి మాత్రం పెళ్లయ్యి సుమారు పదేళ్ల కూతురు కూడా ఉంటుంది. అన్ని ప్రయత్నాలు చేసి ఒక మాట్రిమోనీలో మెంబర్షిప్ తీసుకుంటాడు. అక్కడి నుంచి అమ్మాయిల్ని కలవడం, పని జరక్కపోవడం కొనసాగుతుంటుంది. 

ఇదిలా ఉండగా గణపతికి ఒకరోజు బీచులో సిద్ధి (ఫారియా అబ్దుల్లా) అనే అమ్మాయి హఠాత్తుగా కౌగిలించుకుని ముద్దు పెడుతుంది. ఆమె అలా చేయడానికి గల కారణం ఇంటర్వెల్ ముందు తెలుస్తుంది. ఇంతకీ గణపతి ఈ సిద్ధి ప్రేమలో పడతాడు. ఎవరీ సిద్ధి? ఆమె ఉద్దేశ్యాలు ఏమిటి? పెళ్లికాని గణపతికి ఈ సిద్ధితో ముడిపడుతుందా?..అనేవి ఎటువంటి ఉత్కంఠ, ట్విస్ట్, కామెడీ లేకుండా సీరియస్ గా ముగుస్తుంది. 

"ఆ ఒక్కటి అడక్కు" టైటిల్ పెట్టి అల్లరి నరేష్ ని హీరోగా పెడితే నాన్ స్టాప్ కామెడీ అనే అనుమానాలొస్తాయి. ఆ అనుమానాల్ని పటాపంచలు చేసిన సినిమా ఇది. 

"నేను మారిపోయాను. సీరియస్ అయిపోయాను అనుకుంటున్నారా..నాలో కామెడీ ఇంకా అలానే ఉంది" అంటూ అల్లరి నరేష్ డైలాగ్ ఇందులో ఒకటుంది.

"కౌంటర్ వేస్తే సరిపోదు. కనెక్ట్ ఉండాలి" అనే మరో డైలాగ్ కూడా ఉంది. 

కనెక్ట్ కాని డైలాగ్, స్క్రీన్ ప్లే వల్ల కామెడీ అనుకున్నదల్లా సహనపరీక్ష అయ్యింది. నరేష్ లో కామెడీ టైమింగ్ వగైరాలు అలానే ఉన్నా, పని మాత్రం జరగలేదు. 

ఒక్క డైలాగ్ కూడా ఎందుకు పేలట్లేదు? కామెడీ అనుకుని రాసుకున్న స్క్రిప్ట్ ఇంత ఔట్ డేటెడ్ గా ఉందేంటి? ..అనే ప్రశ్నలకి సమాధానం ఆలోచిస్తే, అసలు సమస్యంతా డైరక్షన్లోనే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అలాగని డైలాగుల్లో సమస్య లేదని కాదు. మాటలు ఔట్ డేటెడ్ అయితే, డైరెక్షన్ అమెచ్యూరిష్. 

నటీనటుల ఎంపిక నుంచి, వాళ్ల నుంచి రాబట్టే ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్, కౌంటర్స్ అన్నీ అతిగానో నాన్ సింక్ గానో అనిపిస్తాయి. ముఖ్యంగా జానీ లీవర్ కూతురు జామీ లివర్ ని తీసుకొచ్చి పెద్ద నిడివిగల పాత్ర ఇచ్చారు. ఆమె ఎవరో తెలియని వారికి ఈమె ఎవరు, ఇంత ఓవర్ చేస్తుంది అనిపిస్తుంది తప్ప ఎక్కడా కామెడీ అనిపించదు. ఆమాటకొస్తే జానీ లివర్ కామెడీ ఒకప్పుడు ట్రెండ్. ఇప్పుడు అతని కామెడీకి కూడా కాలం చెల్లింది. మరి అతనిని అనుకరిస్తూ కూతురు రంగంలోకి దిగితే ఆస్వాదించేసి ఆదరించేయాలంటే కష్టమే. దానికి తోడు స్క్రిప్ట్, డైలాగ్ కనెక్ట్ కాకపోతే మరింత ఇబ్బందిగా ఉంటుంది ఆ ఓవర్ యాక్షన్ తట్టుకోవడం. 

అదలా ఉంచితే తెర మీద వెన్నెల కిషోర్ కనిపిస్తాడు. కానీ ఒక్కటంటే ఒక్క కామెడీ సీన్ కూడా లేదు తన మీద. చివర్లో లాయర్ గా పసలేని అతిథి పాత్రలో మురళి శర్మ. అదే సమయంలో గ్రాండ్ ఎంట్రీలో జడ్జ్ గా గౌతమి..! కామెడీ సినిమా అనుకుని వస్తే చివర్లో నీరసమైన కోర్ట్ రూం డ్రామా. 

ఇదంతా చూసాక ఈవీవీ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. అల్లరి నరేష్ కెరీర్ గాడిలో పడాలంటే మళ్లీ ఈవీవీయే దిగి రావాలేమో. అల్లరి నరేష్ ముందున్న స్క్రిప్ట్ బలాబలాలను అంచనా వేసుకుని దిగాలి. లేకపోతే అతని మీద ఇంకా అంచనాలున్న ప్రేక్షకులు దిగాలు పడడం తప్పదు. 

కథ, కథనం, సంభాషణ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా వేటికవే నీరసంగా అనిపించాయంటే దానికి కారణం దర్శకత్వమే. క్రాఫ్ట్స్ ని జడ్జ్ చేయడంలో విఫలమయ్యాడు దర్శకుడు. 

"ఆ ఒక్కటి అడక్కు"లో 'రాజాధిరాజాను నేనురా..." అనే పాట ఫేమస్. అదే పల్లవితో ఇందులో అల్లరి నరేష్, హరితేజ మీద ఒక పాట పెట్టారు. ఆ పాటొక్కటీ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఇక తక్కిన పాటలు సంగీతపరంగా, సాహిత్యపరంగా ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన ఫ్లాప్ సినిమా పాటల్లాగ ఉన్నాయి. 

కామెడీ సినిమా అంటే నవ్వులు రావాలి. పోనీ క్రైం సినిమానా అంటే టెన్షన్ పెట్టాలి. అలా కాదు సందేశాత్మకం అంటే మనసుకి తాకాలి. కానీ అన్నీ కలిపేసి కంగాళీ చేసేసి..ఇందులో అన్ని జానర్సూ ఉన్నాయి చూసేయండి..అంటేనే కంగారొస్తుంది. 

అది కూడా పెళ్లికాని ప్రసాదు, పెళ్లెప్పుడని అడిగే అపార్ట్మెంట్ వాసులు, ఆ పైన మ్యాట్రిమోనీ బ్యాక్ డ్రాప్ లో సో-కాల్డ్ కామెడీ..ఇదంతా ఎంత బీటెన్ ట్రాక్ సొద!  

అల్లరి నరేష్ లుక్స్ పరంగా ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నాడు కనుక సరైన స్క్రిప్ట్ తొ వస్తే ఫాం లో ఉండడం గ్యారెంటీ. పైగా ఇప్పటికీ తన తరహా కామెడీని పోషించే హీరోలు లేరు. కానీ ఇలాంటి సినిమాలతో వస్తే మాత్రం జనం మొహం తిప్పేస్తారు. 

ఫారియా అబ్దుల్లా చెయ్యడానికి బాగానే చేసినా తన పాత్రని మలచిన తీరు హత్తుకోదు. 

పైన చెప్పుకున్నట్టుగా జానీ లీవర్ కూతురు జామీ లీవర్ చేత చేయించిన ఓవరాక్షన్ భరించడం కష్టం. 

వెన్నెల కిషోర్ వేస్టైపోయాడు. అరియానా గ్లోరీ హీరోయిన్ పక్కన చిన్న పాత్రలో కనిపించింది. హర్ష చెముడు ట్రాక్ కూడా అతి వల్ల అతకనట్టే ఉంది. 

సినిమా మొదలయ్యి పావుగంట గడిచినప్పటి నుంచి ఇంటర్వెల్ ఎప్పుడౌతుందా అని, ఇంటర్వల్ ముగిసాక రోలింగ్ టైటిల్స్ ఎప్పెడెప్పుడొస్తాయా అని నిరీక్షించే పరిస్థితి ఉంది. తెరమీద కామెడీ లేదని తెలుస్తున్నా ఒకటి రెండు చోట్ల వచ్చే చిన్నపాటి నవ్వునే గట్టిగా నవ్వి పెద్ద మనసుతో సంతృప్తి చెందిన ప్రేక్షకుల్ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. 

షార్ట్ ఫిలిం కాన్సెప్టునే లాంగ్ గా తీసినట్టుంది. హాస్యం అనుకుని వెళ్లిన ప్రేక్షకులకి నిరాశ ఎదురవుతుంది. ఈ సమ్మర్ లో ఇప్పట్లో పెద్ద సినిమా లేవీ లేవు కనుక ఏ మాత్రం బాగున్నా ఆదరించేయడానికి సిద్ధంగా ఉన్న ప్రేక్షకలోకాన్ని వాడుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది. ఇంత చెప్పడమెందుకు..అసలీ సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్తే చాలు అంటారా!! అయితే కింద చూడండి. 

బాటం లైన్: బాగుందా అని అడక్కు