ఉత్తరానికి జేడీ కాపు కాస్తారా?

జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ పార్టీ ద్వారా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తారు అనుకుంటే ఎమ్మెల్యేగా దిగడమే ఆశ్చర్యం అని అంటున్నారు. ఆయన విశాఖ ఉత్తరాన్ని ఎంచుకోవడం వెనక సామాజిక సమీకరణలు ఉన్నాయని అంటున్నారు.

విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో కాపులు ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన జేడీ పోటీ చేయడం ద్వారా ఆ ఓట్లకు గేలం వేస్తున్నారు అని అంటున్నారు. ప్రధాన పార్టీలు రెండు క్షత్రియ సామాజిక వర్గానికే సీటు ఇచ్చాయి. వైసీపీ నుంచి కేకే రాజు టీడీపీ కూటమి తరఫున బీజేపీ అభ్యర్ధిగా విష్ణు కుమార్ రాజు పోటీలో ఉన్నారు.

రాజుల పోరులో కాపు కాసేందుకు జేడీ సిద్ధం అంటున్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ సీటు కోసం జనసేన నాయకులు ప్రయత్నం చేశారు. వారికి దక్కలేదు. జేడీ గతంలో జనసేనలో ఉన్నారు. ఆ పాత పరిచయాలు ఏమైనా ఆయనకు ఉపయోగపడాయా అన్న చర్చకు తెర లేచింది.

జేడీ పోటీకి దిగడం వల్ల బీజేపీ అభ్యర్ధి ఓట్లకే చిల్లు పడుతుందని తాను మంచి మెజారిటీతో గెలుస్తాను అని కేకే రాజు చెబుతున్నారు. జేడీ అయితే తాను ఉత్తర విశాఖను ఉత్తమ విశాఖ చేస్తాను అని అంటున్నారు. అయితే ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేస్తాను అని చివరిదాకా చెబుతూ ఎమ్మెల్యేగా పోటీకి రావడం వెనక వ్యూహం ఏమిటి అన్న దాని పైన ప్రధాన రాజకీయ పక్షాల శిబిరంలో చర్చ మొదలైంది. వైసీపీకి టీడీపీ జనసేనలకు ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లే అని జేడీ ప్రచారం చేస్తున్నారు. ఏపీకి బీజేపీ ఏమీ న్యాయం చేయలేదని ఆయన అంటున్నారు.

ఏపీలో జేడీ తన పార్టీ తరఫున వంద అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పదిహేను పార్లమెంట్ సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టినట్లుగా ప్రకటించారు. తాము కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.