చేతులు కట్టుకున్న టాలీవుడ్

టాలీవుడ్‌లో సినిమాల పరిస్థితి చిత్రంగా వుంది. చాలా సినిమాలు అనౌన్స్ అయ్యాయి. నిర్మాణంలో వున్నాయి. కానీ చాలా సంస్థలు మౌనంగా పరిస్థితి గమనిస్తూ వుండిపోతున్నాయి. ముఖ్యంగా డిజిటల్ అమ్మకాలు అన్నది ఈ పరిస్థితికి దారితీస్తున్నాయి.

నెట్ ఫ్లిక్స్ తో మంచి సంబంధాలున్న ఒకటి రెండు బ్యానర్లు మినహా మరే సంస్థ కూడా డిజిటల్ అమ్మకాలు జరిపే పరిస్ధితి కనిపించడం లేదు. మరో వైపు నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. నటులు, దర్శకులతో పాటు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి.

ఓ పాపులర్ క్యారెక్టర్ నటుడు తన డైలీ రెమ్యూనిరేషన్ ను అయిదు లక్షలకు పెంచేశారు. పాపులర్ సంగీత దర్శకులు మూడు నుంచి అయిదు కోట్లకు వెళ్లిపోయారు. పాపులర్ సినిమాటోగ్రఫీ టెక్నీషియన్ల రెమ్యూనిరేషన్, ఖర్చులు అన్నీ కలిపి మూడు కోట్లు దాటేస్తోంది.

నిర్మాణ వ్యయం ఇలా వుంటే సినిమాలు తీసినా, బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి, కోట్లకు కోట్లు నష్టాలు మూటకట్టుకోవాల్సి వస్తోంది. పాతిక కోట్లకు పైగా తీసుకునే సీనియర్ హీరో గత నాలుగైదు సినిమాలు అన్నీ కోట్లకు కోట్లు నష్టాలు మిగిల్చాయి నిర్మాతలకు. చాలా మంది హీరోల వ్యవహారం ఇలాగే వుంది. ప్రస్తుతం వున్న పరిస్థితి హీరోల మార్కెట్ మీద పడే టైమ్ రావడానికి మరో ఏడాది పడుతుంది అని అంచనా. ఆ లోగా అదృష్టం బాగుండి డిజిటల్ మార్కెట్ సెట్ రైట్ అయితే ఓకె. హీరోలు హ్యపీ. లేదంటే అప్పుడు పరిస్థితి మారుతుంది. ఇప్పటికే నలుగురైదుగురు హీరోలు చేతిలో సినిమాలు లేక ఇంట్లో కూర్చున్నారు.

చాలా అంటే చాలా సినిమాల డిజిటల్ అమ్మకాలు జరగలేదు. ప్రభాస్ ప్రాజెక్ట్ కె నుంచి నితిన్ రాబిన్ హుడ్, నాగ్ చైతన్య తండేల్, ఇలా చాలా సినిమాలు బేరసారాల్లో కిందా మీదా అవుతున్నాయి అని టాక్. రామ్ డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి అయోమయంలో చిక్కుకుంది. డిజిటల్ అమ్మకాలు సాగిద్దామంటే డేట్ ప్లానింగ్ దొరికితే తప్ప కొనడానికి సంస్థలు సిద్దంగా లేవు.

ప్రస్తుతానికి జీ సంస్థ బడ్జెట్ పూర్తయిందని వినిపిస్తోంది. హాట్ స్టార్.. జియో ఒప్పదం వల్ల అక్కడ పాజ్ బటన్ పడింది అమెజాన్ కొనుగోళ్లు ఆచి తూచి చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ కొన్ని సంస్థలతోనే డీల్ చేస్తోందని టాక్. ఇలా అన్ని విధాలా పరిస్థితి ఎక్కడిక్కడ నిలిచిపోయింది.

ఈ పరిస్థితికి తోడు పీక్ సమ్మర్ సీజన్ అంతా ఎన్నికల కు సరిపోయింది.

పెద్ద సినిమాలు డేట్ లు వేయడానికే కిందా మీదా అవుతున్నాయి. ప్రాజెక్ట్ కె డేట్ ఇవ్వడం లేదు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డేట్ వేయడం లేదు. డేట్ లు వేసిన వాటిలో పుష్ప 2 ఒక్కటే డేట్ కు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

నిజానిజాలు నిర్మాత దిల్ రాజుకే తెలియాలి కానీ, గేమ్ ఛేంజర్ వల్ల ఆయనకు నష్టమే తప్ప లాభం వుండదనే టాక్ వుంది. దేవర సినిమా హిందీలో ఆడిన దాన్ని బట్టి లాభం రావడం, రాకపోవడం వుంటుదనే టాక్ వుంది.

ఇలా అన్ని విధాలా టాలీవుడ్ జంక్షన్ లో నిలిచిపోయింది. చేతులు కట్టుకుని వుండిపోతోంది.