కొలువు వద్దనుకున్నాక.. ఈ కోలాటం ఏంటి సామీ!

ప్రజలకు నిరుపేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలనే సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీరు వ్యవస్థను తీసుకువచ్చింది. వారు ఈ అయిదేళ్లపాటూ అటు ప్రభుత్వంతోనూ ఇటు పేదలతోనూ మమేకమై పనిచేశారు. తమకు దక్కే వేతనం తక్కువే అయినప్పటికీ.. పేదలకోసం పనిచేస్తున్నామనే తృప్తి వారిలో ఉండేది. అయితే ప్రతిపక్షాలు వారి మీద కక్షకట్టాయి. ఆ వైఖరితో విసిగిపోయి, వారు తమ పదవులకు రాజీనామాలు చేస్తోంటే.. అలా రాజీనామాలు చేయడానికి కూడా వీల్లేదని కోర్టులో కేసులు వేయిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా వాలంటీరు వ్యవస్థ మీద తొలి నుంచి పగబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ అత్యంత హేయమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు వారి గురించి చాలా చులకనగా మాట్లాడుతూ వచ్చారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి చంద్రబాబు వాలంటీర్లను కాకాపట్టడానికి కొత్త ఎత్తుగడలు వేశారు.

తాను గెలిస్తే వారికి పదివేల జీతం చేస్తానని హామీ ఇచ్చారు. మరొకవైపు కుట్రపూరితంగా పేదలకు పింఛన్లు పంపిణీ చేయనివ్వకుండా వారి విధులకు కోతపెట్టించారు. ఇలాంటి రెండు నాలుకల చంద్రబాబు ధోరణితో విసిగిపోయిన వాలంటీర్లు మూకుమ్మడిగా తమ తమ పదవులకు రాజీనామాలు చేసేయడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు చంద్రబాబునాయుడు తైనాతీలు వారి రాజీనామాలకు కూడా అడ్డుపడుతున్నారు.

వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దంటూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకూ సదరు రామచంద్రయాదవ్ మరెవ్వరో కాదు. మొన్నటిదాకా జనసేనలో ఉండి, గతంలో పుంగనూరు అభ్యర్థిగా కూడా పోటీచేసి, పవన్ కల్యాణ్ వైఖరితో విసిగిపోయి సొంతంగా పార్టీ పెట్టుకున్న నాయకుడు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్ కోసం చివరిదాకా ప్రయత్నించి.. విఫలమై.. సొంత పార్టీనేతగానే కొనసాగుతున్నారు.

చంద్రబాబు ప్రయోజనాల కోసం ఆయన బినామీ గానే ఈ కేసు హైకోర్టులో వేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. వాలంటీర్లు రాజీనామాలు ఆమోదిస్తే.. వారు వైసీపీ కార్యకర్తల్లాగా వారితో కలిసి ప్రచారంలోకి వెళ్తారనేది రామచంద్రయాదవ్ ఆరోపణ.

అయితే ఇప్పటికే 900 మంది వాలంటీర్ల మీద చర్యలు తీసుకున్నాం అని, 62వేల మందికి పైగా రాజీనామాలు చేశారని ఎన్నికల సంఘం న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఒకవేళ రామచంద్ర ఆరోపణ నిజమైనా కూడా ఏమవుతుంది. రాజీనామాలు ఆమోదించకున్నా... వారు వైసీపీతో కలిసి నడిస్తే మహా అయితే ఈసీ వేటు వేస్తుంది. వాలంటీరు పదవి పోతుంది అంతే కదా.

అసలు వాలంటీరు ఉద్యోగమే వద్దని అనుకున్నాక.. వారి రాజీనామాలు ఆమోదం పొందనివ్వకుండా ఏం సాధించాలని అనుకున్నారో మాత్రం అర్థం కావడం లేదు.