రేపు రావాల్సిన సినిమా నెల రోజులు వాయిదా!

లెక్క ప్రకారం రేపు రిలీజ్ అవ్వాలి లవ్ మీ (ఇప్ యు డేర్) సినిమా. ఈ డేట్ కు తగ్గట్టే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. టీజర్ రిలీజ్ చేశారు. ఆడియో ఫంక్షన్ కూడా పెట్టారు. ఓవైపు ఇవన్నీ నడుస్తున్నప్పటికీ, మరోవైపు సినిమా వాయిదాపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడదే నిజమైంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన లవ్ మీ సినిమా వాయిదా పడింది. అది కూడా సరిగ్గా నెల రోజులు. మే 25న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా లవ్ మీ. అరుణ్ ఈ సినిమాకు దర్శకుడు. ఇదొక డిఫరెంట్ స్టోరీ. దెయ్యంతో హీరో ప్రేమలో పడడం అనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది. అయితే ఇక్కడ మేటర్ ఇదొక్కటి మాత్రమే కాదు.

ఆశిష్ ను హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలి. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రతిష్ట నిలబడాలి. అందుకే లవ్ మీ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు దిల్ రాజు. ఈ క్రమంలోనే సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

టాప్ టెక్నీషియన్స్ పనిచేయడం ఈ సినిమా చేసుకున్న అదృష్టం. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ఆస్కార్ అవార్డ్ విజేత కీరవాణి, టాప్ ఆర్ట్ డైరక్టర్ అవినాష్ కొల్ల ఈ సినిమాకు వర్క్ చేశారు. ఇంతమంది కలిసి మే 25న ఆశిష్ కు ఎలాంటి ఫలితం అందిస్తారో చూడాలి.