విరాటపర్వం..చరిత్రలో దాగిన ప్రేమకథ

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విరాటపర్వం'. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. జూన్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న విరాటపర్వం విశేషాలివి.

మీ రెండో సినిమాగా ఇంత బరువైన కథ చేయడానికి కారణం?

నేను పుట్టి పెరిగిన వాతావరణం. చూసిన జీవితం. చదివిన పుస్తకాలు,.. నేను ఎలాంటి సినిమా తీయాలో అనే ఒక విజన్ ని ఇచ్చాయి. నాకు తెలిసిన జీవితాన్ని చెప్పాలని, చరిత్రలో దాగిన కథలు చెప్పాలనే ప్రయత్నంలో బాగంగా తీసిన సినిమానే విరాటపర్వం. బరువైన కథ చెప్పాలని గానీ క్లిష్టమైన కథ చెప్పాలని గానీ అనుకోను. నా టెంపర్మెంటే నా సినిమా. ఈ కథ చెప్పాలని అనుకున్నాను చెప్పాను తప్పితే ఇది బరువైనదా క్లిష్టమైనదా? అనే ఆలోచన లేదు.

లెఫ్టిస్ట్ నేపధ్యం ఏమైనా ఉందా?

ఒక రాజకీయ, సంక్లిష్టమైన వాతారవణంలో పెరిగా. తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాల. ఇక్కడ జరిగిన పరిణామాలు దేశ రాజకీయాలని ప్రభావితం చేసిన వాతావరణం. ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరగడం వలన సహజంగానే కొంత ప్రోగ్రసీవ్ ఐడియాలజీ వుంటుంది. అంతేకానీ లెఫ్ట్ , రైట్ అని కాదు.

'విరాటపర్వం, వెన్నెల పాత్రలకు ప్రేరణ ఉందా?

వుంది. యదార్ధ సంఘటనలు ఆధారంగానే ఈ చిత్రాన్ని తీశాం. సరళ అనే ఒక అమ్మాయి జీవితం.

ఈ కథని అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎలా చెప్పగలని అనుకున్నారు?

లెఫ్ట్, రైటు అనేది అప్రస్తుతం. నేపధ్యాన్ని పక్కన పెడితే.. కథలో వున్న ప్రధాన భావోద్వేగం ఏమిటనేది ముఖ్యం. ఒక దొంగల కుటుంబం వుంది. ఆ కుటుంబంలో ఒక ప్రేమకథ చెబితే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నేపధ్యానికి సంబంధం లేదు. విరాటపర్వంలో ఒక అందమైన ప్రేమకథ చెబుతున్నాం. 1990లోని రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా చూపిస్తున్నాం. ఇది అందరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను. మానవ సంబంధాల నేపధ్యంలో చెప్పే కథలని ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. విరాటపర్వం ఒక అమ్మాయి ప్రేమకథ. నక్సల్ నేపధ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది. చాలా కొత్తగా ఉండబోతుంది.

ప్రేమకి నక్సలిజంకి ఎలా ముడిపెట్టారు?

విప్లవం అనేది ప్రేమైక చర్య. ఈ మాటని విసృతతంగా అర్ధం చేసుకోవాలి. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వుండేదే కాదు.. ఒక సమూహానికి వ్యక్తి మధ్య వుండే ప్రేమ. ఎంత ప్రేమ వుంటే ఒక సమూహంలోకి వెళ్లాలని అనుకుంటారు ?జనం కోసం పని చేయాలంటే ఎంతో ప్రేమ వుంటే తప్ప త్యాగం చేయలేం.

ఇది వెన్నెల కథ అని చెబుతున్నారు కదా.. మరి రానాను ఎలా ఒప్పించారు?

రానా ఈ కథ ఒప్పుకోవడం నా గొప్పదనం కాదు ఆయన గొప్పదనం. ఇలాంటి సినిమా మనం చేయకపోతే ఎవరు చేస్తారనే గొప్ప మనసుతో రానా ఈ సినిమాని చేశారు.

90లో చిత్రీకరించారు కదా.. షూటింగ్ లో ఎదురైన సవాళ్లు ఏంటి?

విరాటపర్వం షూటింగ్ ఒక సవాలే. సినిమాని సహజంగా తీయాలని రిమోట్ ఏరియాల్లో షాట్ ప్లాన్ చేశాం. కానీ ఎక్కడికి వెళ్ళిన సెల్ టవర్స్, సెల్ ఫోన్ కామన్ గా కనిపించేది. గ్రాఫిక్స్ లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టాం. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఒక రెండు సినిమాలు పడాల్సిన కష్టం ఈ సినిమా కోసం పడ్డారు. ఈ క్రెడిట్ అంతా మా నిర్మాతలకే దక్కుతుంది.

విరాటపర్వంలో అన్ని వాస్తవాలు వుంటాయా?

1992లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వెనుక రాజకీయ కారణాలు వుండటం వలన ఈ కథని జనాలకి చెప్పాలని ప్రేరణ పొందా. ఐతే సినిమా అన్నప్పుడు కొంత ఫిక్షన్ వుంటుంది. కథని సినిమాగా మార్చుకున్నపుడు కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమానే తప్ప ఇది బయోపిక్ కాదు.

ఈ సినిమా ముగింపు ఎలా వుంటుంది?

ఈ సినిమా ముగింపు ఏమిటనేది ఇప్పుడే చెప్పను. అయితే ఆ ముగింపు ప్రేక్షకుడిపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

మైదానం ప్రాజెక్ట్ ఎక్కడి వరకూ వచ్చింది?

అది 'ఆహా' కి చేస్తున్నాం. ఇది చలం రాసిన నవలకి మనదైన వ్యాఖ్యానంతో వుంటుంది. దీనికి షో రన్నర్ గా చేస్తున్నా. కవిత్వం అప్పుడప్పుడు రాస్తుంటా. అయితే నా మెయిన్ ఎమోషన్ సినిమానే.