బీజేపీ వద్ద పలుకుబడిని చాటుకున్న సీఎం

అనకాపల్లి ఎంపీ సీటుకు కూటమి అభ్యర్ధిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయన కడప నుంచి అనకాపల్లికి వచ్చి మరీ సీటు సాధించారంటేనే ఆయన రేంజి ఏంటో అర్ధం చేసుకోవాలి. సీఎం రమేష్ టికెట్ సాధించడమే కాదు ఇప్పుడు కేంద్ర బీజేపీ పెద్దల వద్ద తన పలుకుబడి ఎంత ఉందో కూడా చాటారు.

సీఎం రమేష్ తన రాజకీయ జీవితంలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ హాజరవుతున్నారు. ఏపీ నుంచి ఆరుగురికి బీజేపీ తరఫున ఎంపీ సీట్లు పొత్తులో కేటాయించారు అయితే ఎవరికి వారు స్థానిక టీడీపీ నేతలతో కలసి నామినేషన్లు సమర్పించారు. కానీ సీఎం రమేష్ స్పెషాలిటీ ఏంటో కానీ బీజేపీ దిగ్గజ నేత ఆయన కోసం ఏపీకి రావడం విశేషంగానే చూస్తున్నారు.

సీఎం రమేష్ బీజేపీలో చేరి నాలుగేళ్లు మాత్రమే అయింది. ఆయన అంతకు ముందు నుంచి టీడీపీ నాయకుడే. రెండు సార్లు రాజ్యసభ మెంబర్ గా అయింది టీడీపీ నుంచే. అయినా కానీ ఆయనకు బీజేపీ పెద్దల వద్ద ఉన్న పలుకుబడి సాన్నిహిత్యం చూస్తూంటే ఏపీ కమలనాధులే విస్తుబోయే పరిస్థితి ఉంది.

సీఎం రమేష్ కి అందుకే  కోరుకున్న సీటు ఎక్కడైనా బీజేపీలో దక్కుతోంది అని అంటున్నారు. రాజ్ నాధ్ సింగ్ ని వెంటబెట్టుకుని నామినేషన్ దాఖలు చేస్తున్న సీఎం రమేష్ కి అనకాపల్లి బెల్లం ముక్క అందుతుందా అన్నదే పొలిటికల్ గా హట్ టాపిక్ గా ఉంది.