జాగ్రత్త బాబూ.. నోరు జారితే ప్రమాదం!

ఇల్లలకగానే పండగ కాదు.. చంద్రబాబు నాయుడు బాగా గుర్తుంచుకోవాల్సిన సామెత ఇది. జగన్మోహన్ రెడ్డి మీద అడ్డగోలుగా విమర్శలు చేయడం మాత్రమే సరిపోదు. చంద్రబాబు ఖర్మకాలి తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే.. ఇప్పుడు ఏ విమర్శలైతే జగన్ గురించి చేస్తున్నాడో అలాంటి విమర్శలు తన మీదకు రాకుండా పరిపాలన సాగించగల తెగువ చూసుకోవాలి.

మూడు సార్లు ముఖ్యమంత్రి, నలభై నాలుగేళ్ల సీనియారిటీ ఉన్న చంద్రబాబుకు అవి తెలియని సంగతులు కావు. కానీ.. జగన్ మీద బురద చల్లే యావలో ఆయన ఇంగితజ్ఞానం మరచిపోతున్నారు.

‘అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదు’ అని చంద్రబాబునాయుడు జగన్ ను విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కనీ వినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ.. పేదల ప్రజలను సంపన్నులుగా మారుస్తూ, పేదకుటుంబాలను స్వావలంబన దిశగా నడిపిస్తూ ఉంటే.. ఓర్వలేకపోతున్న చంద్రబాబునాయుడు.. అప్పులు తెచ్చి పథకాలు అమలు చేయడం గొప్ప కాదు అని అంటున్నారు.

నిజమే కావొచ్చు. కానీ.. అనాథలా ఏర్పడిన రాష్ట్రాన్ని తొలి అయిదేళ్ల  పరిపాలనలో చంద్రబాబు నాయుడు మరింతగా నాశనం చేస్తే.. ఆర్థికంగా కుదేలైపోయి ఉన్న సమయంలో అసలు సంక్షేమ పథకాలను అమలు చేయడమే సాధ్యం కాదు అనే సంగతి కూడా.. సీనియరు అయిన చంద్రబాబుకు తెలిసే ఉండాలి. కానీ.. కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అప్పులు చేసి అయినా పథకాల్ని అమలు చేస్తున్న మంచి మనసు తనది అని జగన్ నిరూపించుకుంటున్నారు.

అయినా చంద్రబాబు చేస్తున్న విమర్శ నిజం అనే అనుకుందాం. ఒకవేళ చంద్రబాబునాయుడు ఖర్మ కాలి.. ఆయన కూటమి గెలిచి, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితే.. ఒక్క రూపాయి అప్పు చేయకుండా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తానని, ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అన్నింటినీ పెంచి.. తాను కొత్తగా హామీ ఇచ్చినట్టుగా మరింత ఘనంగా అమలు చేస్తానని చెప్పగల దమ్ము ఆయనకు ఉందా అనేది ప్రజలకు ఎదురవుతున్న సమస్య.

తాను సంపద సృష్టితో సంక్షోభాన్ని అధిగమిస్తానని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు.. తొలి ప్రభుత్వం ఆయనదే కదా.. ఇలాంటి మాటలు ఎందుకు చెప్పలేకపోయారు. అప్పుడు ప్రజల సంక్షేమం గురించి ఆయనకు పట్టింపు లేదనే అనుకుందాం. కనీసం ఆయన చెబుతున్న సంపద సృష్టించి, కనీసం రాజధాని మీద పెట్టి ఉండొచ్చు కద అనేది ప్రజల సందేహం.

కావల్సి వ‌స్తే చంద్రబాబు నాయుడు తాను గెలిస్తే ఏడాది రోజులు గడువు తీసుకోవచ్చునని, ఏడాది తర్వాత ఒక్కరూపాయి కూడా అప్పు చేయకుండా అన్ని పథకాలను అమలు చేస్తానని, అలా అప్పు చేయాల్సి వస్తే రాజీనామా చేస్తానని ఆయన ఇప్పుడే చెప్పగలరా అని ప్రజలు నిలదీస్తున్నారు. మరి బాబు వద్ద ఆన్సర్ ఉందా?