వెస్ట్ లో విజ‌యంపై వైఎస్ఆర్సీపీ విశ్వాసం!

గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం ఊరిస్తోంది. గ‌త రెండు ప‌ర్యాయాలుగా తృటిలో చేజారిన విజ‌యాన్ని ఈ సారి సాధించ‌డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ‌త‌థా ప్ర‌య‌త్నిస్తూ ఉంది. 2014, 2019 ఎన్నికల్లో స్వ‌ల్ప ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని కోల్పోయింది. అయితే ఈ సారి మాత్రం ఆ పార్టీ ధీమాగా క‌నిపిస్తూ ఉంది, వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌దుందుభి మోగించ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాలు ఆస‌క్తిదాయ‌కంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా విడ‌ద‌ల ర‌జనీ ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగుతున్న నేప‌థ్యంలో వెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తిని రేపుతున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టిగా ఉంది. చిల‌క‌లూరిపేట నుంచి అతి పిన్న వ‌య‌సులోనే ఎమ్మెల్యేగా నెగ్గి సంచ‌ల‌నం రేపిన విడ‌ద‌ల ర‌జ‌నీ, 31 యేళ్ల వ‌య‌సులోనే మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే చిల‌క‌లూరి పేట నుంచి కాకుండా, సీఎం జ‌గ‌న్ ఆమెకు గుంటూరు వెస్ట్ నుంచి పోటీకి అవ‌కాశం ఇవ్వ‌డంతో రాజ‌కీయం మ‌రింత ఆస‌క్తిదాయ‌కంగా మారింది. నామినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున నిర్వ‌హించి ర‌జ‌నీ త‌న స‌త్తాను చూపించారు. వెస్ట్ ఏమీ టీడీపీకి బ‌ద్ధ‌లు కొట్ట‌లేని కంచుకోట కాద‌నే క్లారిటీ ఆమె ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన మ‌ద్దాలి గిరిధ‌ర్ ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. అది కూడా టీడీపీని ఇబ్బంది పెట్టే అంశాల్లో ఒకటిగా ఉంది. బీసీల‌కు పెద్ద ఎత్తున ప్రాధాన్య‌త‌ను ఇస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని బీసీల‌కే కేటాయించారు.

వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం ర‌క‌ర‌కాల కులస‌మీక‌ర‌ణాల‌తో కూడి ఉంటుంది. ఇక్క‌డ కాపుల ఓట్లు ముప్పై వేల వ‌ర‌కూ ఉన్నాయి, ఆ త‌ర్వాత ఎస్సీల ఓట్లు 29 వేల వ‌రకూ ఉంటాయి, 24 వేల ఓట్లు ముస్లింలు, దాదాపు అదే స్థాయిలో బ్ర‌హ్మ‌ణుల ఓట్లు, రెడ్ల ఓట్లు 17 వేల వ‌ర‌కూ, వైశ్యుల ఓట్లు 12 వేల వ‌ర‌కూ ఉంటాయి వెస్ట్ ప‌రిధిలో. బీజేపీతో పొత్తు వ‌ల్ల తెలుగుదేశం పార్టీకి ముస్లింల ఓట్లు దాదాపు దూరం అయ్యాయి. ఇది ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీకి శ‌ర‌ఘాతం అనే చెప్పాలి. మైనారిటీ, ఎస్సీ ఓటర్లు ఈ సారి ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండ‌గా నిల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తూ ఉంది. స్థానికంగా రెడ్ల ఓట్లు గ‌ట్టిగా ఉండ‌టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద‌న‌పు బలం అవుతోంది.

ఇక స్థానిక స‌మ‌స్య‌లే అభ్య‌ర్థుల విజ‌యాల‌ను నిర్దేశించే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టిగా గుంటూరు వెస్ట్ కు పేరు. అభ్య‌ర్థుల‌ను బ‌ట్టే ఓట‌ర్ల నిర్ణ‌యం సాగుతుందంటారు ఇక్క‌డ‌. టీడీపీ ఇక్క‌డ వ‌ర‌స‌గా రెండు సార్లు గెలిచినా అభ్య‌ర్థుల‌ను మార్చుకుంటూ వ‌చ్చింది. గ‌త రెండు ఎన్నిక‌ల్లో చేసిన పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ ఇప్పుడు ధీమాగా క‌నిపిస్తోంది. వేరే నియోజ‌క‌వ‌ర్గాల నుంచి గెలిచి మంత్రైలే ఆ త‌ర్వాత వెస్ట్ కు వ‌ల‌స వ‌చ్చిన వారు కూడా గెలిచిన ఆస‌క్తిదాయ‌క‌మైన చ‌రిత్ర ఉంది ఇక్క‌డ‌.

గ‌తంలో క‌న్నా లక్ష్మినారాయ‌ణ మంత్రి హోదాలో వెస్ట్ కు వ‌చ్చి గెలిచి మ‌ళ్లీ మంత్ర‌య్యారు, విడ‌ద‌ల ర‌జ‌నీ కూడా ఇప్పుడు మంత్రి హోదాలో ఇక్క‌డ నుంచి పోటీకి దిగుతూ ఆస‌క్తిని రేపుతున్నారు!