హైదరాబాద్ లో పవన్ తో ఆ ఇద్దరూ!

పిఠాపురం ప్రజలు పవన్ ఎన్నుకుంటే స్ధానికంగా వుండరు. హైదరాబాద్ లోనే వుంటారు అని విమర్శించారు వైకాపా అధినేత జగన్. అది ఎంత వరకు నిజమో కానీ ప్రస్తుతానికి అయితే పవన్ పిఠాపురం లోకల్ గా వుండడం లేదు. అదే నియోజకవర్గంలో జాతీయ రహదారికి సమీపంలో ఓ ఇల్లు అయితే అద్దెకు తీసుకున్నారు. కానీ వీలయినపుడల్లా అటు మంగళగిరి లేదా ఆటు హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు.

మంగళగిరి అంటే తప్పదు. ఎందుకంటే పార్టీ కార్యాలయం అక్కడ వుంది. పనులు వుంటాయి. ఇన్నాళ్లూ వాటిని చక్కబెట్టిన జనసేన రాష్ట్ర‌ స్ధాయి నాయకుడు మనోహర్ తన ఎన్నిక మీదే దృష్టి పెట్టి వున్నారు. అదీ రాష్ట్ర స్ధాయి నాయకుడి పరిస్థితి. అందువల్ల పవన్ తరచు కాకపోయినా అప్పడప్పుడు మంగళగిరికి రావాల్సి వుంటుంది. నిజానికి టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఆఫీసుకు రాకుండానే పనులు చక్కబెట్టవచ్చు. అది వేరే సంగతి.

ఇవన్నీ ఇలా వుంచితే పవన్ తరచు హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ లో లేరు. అందువల్ల హైదరాబాద్ రావాల్సిన అవసరం అయితే లేదు. కానీ పవన్ హైదరాబాద్ వస్తున్నది ఇద్దరిని కలవడానికి అని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

ఒకరు టాలీవుడ్ లోని ఓ ప్రముఖ దర్శకుడు. రెండవది పవన్ ఆధ్యాత్మిక గురువు. ఈ ఇద్దరితో పవన్ తరచు హైదరాబాద్ లో సమావేశం అవుతున్నారని తెలుస్తోంది. పవన్ తరపున పూజలు, హోమాలు ఆ గురువు ఏటా చేయిస్తుంటారు. ఇక ఆ ప్రముఖ దర్శకుడు పవన్ ప్రసంగాలకు కీలక పాయింట్లు అందిస్తుంటారనే వార్తలు వున్నాయి.

మొత్తం రాజకీయ పరిస్థితిని, ఎన్నికల సరళిని పవన్ పరిశీలించేంత తీరుబాటు లేదు. అందువల్ల ఈ ఇద్దరు సన్నిహితులు నిత్యం మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, ప్రచారం తీరు, ప్రసంగాల తీరు అన్నీ పరిశీలించి, తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ప్రసంగాల్లో మాస్ పాయింట్లు అన్నీ ఈ సినీ ప్రముఖుడి సూచనలే అని తెలుస్తోంది. అలాగే పవన్ ఆఫీసు ప్రారంభానికి, నామినేషన్ ముహుర్తం,  ఇలాంటివి అన్నీ ఆ ఆధ్యాత్మిక సలహాదారు తన పనిగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన ఈ ముగ్గురి భేటీ మాత్రం పక్కాగా, మిస్ కాకుండా వుంటోందని తెలుస్తోంది.