టార్గెట్ జగన్ - ప్రతినిధి 2 ట్రైలర్

లాభం లేకుండా ఎవ్వరు వరద జోలికి పోరు అన్నది పాత సామెత. ఎన్నికల ముందు తెలుగుదేశం బంధాలున్న జనాలు ఏం చేసినా దాని అర్థం పరమార్థం ఒక్కటే బాబుగారికి మేలు చేకూర్చాలి. జగన్ ను టార్గెట్ చేయాలి.

జగన్ పదే పదే ప్రస్తావించే టీవీ 5 చానెల్ లో జర్నలిస్ట్ గా పని చేస్తున్న మూర్తి దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ప్రతినిధి 2. చంద్రబాబు కొడుకు వరుస అయిన నారా రోహిత్ హీరో. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోంది. కేవలం ఎన్నికల నేపథ్యంలో యాంటీ జగన్ ప్రచారానికి తాము కూడా ఓ అస్త్రాన్ని అందించాలనే ఆలోచన తప్ప మరోటి లేదని.

కూరగాయలు అమ్మిన మీరు కోటీశ్వరులు అయితే మీతో అమ్మిన వారంతా అలాగే వుండిపోయారన్న డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ చేసారు. అసలు అదే పెద్ద తప్పు. తెలుగుదేశం అధినేత స్టార్ట్ చేసింది రెండు ఎకరాలతోనే కదా? మరి ఆయనతో స్టార్ట్ చేసిన వాళ్లంతా కోట్లకు పడగలెత్తలేదు కదా. అలాగే తెలుగుదేశం స్ట్రాంగ్ మద్దతుదారు పచ్చళ్లు అమ్మి పదివేల.. వేల కోట్లకు పడగలెత్తారు. మిగిలిన పచ్చళ్ల వ్యాపారులు అలా కాలేదు కదా?

జగన్ కు ఒక చాన్స్ ఇవ్వడం, వైఎస్సార్ కోసం అభిమానులు చనిపోవడం, పథకాలు, ఇలా ఒకటి కాదు, ట్రైలర్ లో వేసిన కట్ లు…షాట్ లు అన్నీ జగన్ మీద ప్రయోగించిన అస్ట్రాలే. ఒక జర్నలిస్ట్ సినిమా తీస్తే కాస్తయినా న్యూట్రల్ గా వుంటుందని, లేదా రెండు వైపులా విమర్శలు ఎక్కు పెడతారని కొద్ది మంది అయినా ఆశిస్తారు. కానీ ట్రైలర్ చూస్తే ఓ జర్నలిస్ట్ తీసినట్లు కాకుండా, ఓ పార్టీ సింపతైజర్ తీసినట్లు కనిపిస్తోంది.