ఒం'గోల్'.. కొట్ట‌నున్న చెవిరెడ్డి

ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి రాజ‌కీయ చాణ‌క్యం.. ఆ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోడానికి ప‌నికొస్తోంది. ఒం"గోల్" కొట్టేందుకు త‌న‌దైన రాజ‌కీయ క్రీడ‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు ఏ మాత్రం అవ‌కాశం లేకుండా చెవిరెడ్డి చేస్తున్నారు. ఒంగోలు పార్ల‌మెంట్ ప‌రిధిలో చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి రాక‌ముందు, వ‌చ్చిన త‌ర్వాత అని మాట్లాడుకోవాల్సి వుంటుంది. ఒంగోలు పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిని సీఎం వైఎస్ జ‌గ‌న్ ఎంపిక చేశారు. అప్ప‌టి నుంచి ఒంగోలుపై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టిని సారించారు.

తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి కొంత కాలంగా వైసీపీ కోర్ టీంలో ఉన్నారు. త‌న కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని చంద్ర‌గిరి బ‌రిలో నిలిపారు. అనంత‌రం ఒంగోలు పార్ల‌మెంట్ అభ్య‌ర్థి ఎంపిక ప్ర‌క్రియ‌లో అనేక రాజ‌కీయ మ‌లుపులు. వైసీపీ సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డిని సీఎం జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు. దీంతో ఒంగోలులో దీటైన అభ్య‌ర్థిని బ‌రిలో దింపే ఆలోచ‌న‌లో ఉన్న జ‌గ‌న్‌కు త‌న ప‌క్క‌నే ఉన్న చెవిరెడ్డిని ఎంపిక చేశారు.

ఒంగోలు పార్ల‌మెంట్ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించిన వెంట‌నే చెవిరెడ్డి టీమ్ అక్క‌డ దిగింది. దీనికి పుత్తా ఎర్రంరెడ్డి నేతృత్వం వ‌హిస్తున్నారు. ఒంగోలు పార్ల‌మెంట్ ప‌రిధిలో ఎక్క‌డేం జ‌రుగుతున్న‌దో ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు తెప్పించుకుంటూ, లోపాల్ని స‌రిదిద్దుకుంటూ చెవిరెడ్డి ముందుకెళుతున్నారు.

ఈ క్ర‌మంలో చెవిరెడ్డి మార్క్ రాజ‌కీయానికి తెర‌లేపారు. మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు పార్టీ వీడేందుకు దాదాపు సిద్ధ‌మైన ప‌రిస్థితిలో చెవిరెడ్డి చాణ‌క్యం ఆయ‌న్ను క‌ట్ట‌డి చేసింది. టీడీపీలో చేరాల‌నుకున్న శిద్ధా... చెవిరెడ్డి చొర‌వ‌తో ఆ నిర్ణ‌యాన్ని విర‌మించుకున్నారు. శిద్ధాను సీఎం వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌రికి తీసుకెళ్లి, బ‌ల‌మైన హామీ ఇప్పించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. శిద్ధా రాఘ‌వ‌రావుకు ఆర్య‌వైశ్య సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన ప‌ట్టు వుంది.

శిద్ధా రాఘ‌వ‌రావును కాపాడుకోవ‌డం వ‌ల్ల గిద్ద‌లూరు, మార్కాపురం, ఒంగోలు, చీరాల‌, క‌నిగిరిలో ఆర్య‌వైశ్యులను వైసీపీకి అండ‌గా నిలిచేలా చేయ‌గ‌లిగారు. అలాగే క‌నిగిరిలో మాజీ ఎమ్మెల్యే క‌దిరి బాబూరావు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మైన స‌మ‌యంలో చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి తెలుసుకుని ఆయ‌న వ‌ద్ద‌కెళ్లారు. బాబూరావును సీఎం ద‌గ్గ‌రికి తీసుకెళ్లి మ‌ళ్లీ యాక్టీవ్ చేయించారు. ప్ర‌స్తుతం బాబూరావు చురుగ్గా ప‌ని చేస్తుండ‌డంతో క‌నిగిరిలో వైసీపీ గెలిచే అవ‌కాశం వుంద‌ని అంటున్నారు.  

అలాగే ఒంగోలు పార్ల‌మెంట్ ప‌రిధిలో పెద్ద ఎత్తున చెవిరెడ్డి నేతృత్వంలో ఆత్మీయ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. వైసీపీలో వ‌ర్గ విభేదాల‌ను స‌మ‌సిపోయేలా నాయ‌కుల‌తో మాట్లాడుతున్నారు. వైసీపీని వీడి వెళ్లిన ఎంపీపీ, జెడ్పీటీసీల‌ను తిరిగి తీసుకురావ‌డంలో చెవిరెడ్డి కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు.

మ‌రీ ముఖ్యంగా గిద్ద‌లూరు, మార్కాపురంలో వైసీపీలో నెల‌కున్న స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌డంలో చెవిరెడ్డి చొర‌వ ఎంతో ప‌నికొచ్చింది. మార్కాపురం, గిద్ద‌లూరులో ఎమ్మెల్యే అభ్య‌ర్థులు అటూఇటూ మారిన సంగ‌తి తెలిసిందే. గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం పంపారు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ నాయ‌కులు స్థానికేత‌రుడంటూ స‌హాయ నిరాక‌ర‌ణ చేశారు. అలాగే మార్కాపురం ఎమ్మెల్యే కె.నాగార్జున‌రెడ్డిని గిద్ద‌లూరు పంపిన సంగ‌తి తెలిసిందే. స్థానికేత‌రుడ‌నే ఉద్దేశంతో గిద్ద‌లూరులోని రెడ్ల‌తో పాటు ఇత‌ర సామాజిక వ‌ర్గ నేత‌లు కూడా మొద‌ట్లో స‌హ‌క‌రించ‌లేదు.

దీంతో వైసీపీకి కంచుకోట లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంద‌న్న అభిప్రాయం క‌లిగింది. స‌రిగ్గా ఈ స‌మ‌యంలో చెవిరెడ్డి జోక్యం చేసుకున్నారు. గిద్ద‌లూరులో అన్నా రాంబాబు, నాగార్జున‌రెడ్డి, అలాగే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి కుమారుడు ప్ర‌ణీత్‌రెడ్డిని తీసుకెళ్లి అంద‌ర్నీ ఏకం చేశారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బాలినేని వ‌ర్గం కూడా ఉంది. దీంతో అంద‌రూ వైసీపీ విజ‌యం కోసం ప‌నిచేసేలా చెవిరెడ్డి చ‌క్రం తిప్ప‌గ‌లిగారు.

అలాగే మార్కాపురంలో కూడా ఇదే ఫార్ములాను చెవిరెడ్డి అనుస‌రించారు. చిన్న‌చిన్న అసంతృప్తులు, విభేదాల‌తో వైసీపీని వీడిన నాయ‌కుల్ని తిరిగి తీసుకొచ్చారు. ఇవ‌న్నీ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి చొర‌వ వ‌ల్లే సాధ్య‌మ‌య్యాయి. స‌మ‌స్య అనేది చిన్న‌దా, పెద్ద‌దా అని చూడ‌కుండా, దాని మూలాన్ని తెలుసుకుని ప‌రిష్కారానికి చెవిరెడ్డి వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. అందుకే ఇప్పుడు ఒంగోలు పార్ల‌మెంట్ సీటు గెలుపు జాబితాలో చేరింది. అలాగే ఆ పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఒక సీటు త‌ప్ప‌, మిగిలిన ఆరింటిలో విజ‌య‌కేత‌నం ఎగురుతుంద‌నే మాట వినిపిస్తున్న‌దంటే, దానికి చెవిరెడ్డి శ్ర‌మే కార‌ణంగా చెబుతున్నారు. చంద్ర‌గిరి నుంచి వెళ్లి...ఒంగోలులో గెలుపే ఏకైక ల‌క్ష్యంగా రాజ‌కీయ చాణ‌క్యం ప్ర‌ద‌ర్శిస్తున్న చెవిరెడ్డి వ్యూహాలు వైసీపీ నేత‌లంతా అనుస‌రించ‌ద‌గ్గ‌వి.