నిరుద్యోగ భృతి..100 నుంచి 3000

చాలా దుకాణాల దగ్గర ఓ బోర్డు వుంటుంది… అరువు రేపు… అని. ఎప్పటికీ రేపే అది. చంద్రబాబు నిరుద్యోగభృతి అలాంటిదే. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామంటూ చంద్రబాబు చెప్పడం కొత్త కాదు. ఏళ్లు పూళ్లుగా చెబుతూనే వస్తున్నారు. 1995లో అంటే ఇప్పటికి దాదాపు మూడు దశాబ్దాల కిందటే చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తా అని ప్రకటించారు. అప్పట్లో ఆయన ఇచ్చిన హామీ జస్ట్ నెలకు 100 రూపాయలు. తరువాత రెండు సార్లు కూడా నిరుద్యోగ భృతి ప్రకటించారు. కానీ ఇచ్చింది లేదు.

ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో లో కూడా చిత్రంగా ప్రకటించారు. రెండు లక్షల ఉద్యోగాలు లేదా మూడు వేల నిరుద్యోగ భృతి అన్నది పాయింట్. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు కల్పించిన ఉద్యోగాలు ఎన్ని విధాల లెక్క పెట్టినా 40 వేలు దాటవు. మరి అలాంటిది రాబోయే అయిదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే జనం నమ్మితే వారి అమాయకత్వం అనుకోవాలి.

ఇప్పుడు ప్రకటించిన నిరుద్యోగభృతి ఇవ్వాలంటే ఏడాదికి ఆరు వందల కోట్ల మేరకు అవసరం పడతాయి. అందువల్ల ఇవ్వాల్సి వచ్చినా కంటి తుడుపుగా, తెల్ల కార్డు వగైరా లింక్ లు పెట్టి తగ్గించుకుంటూ రావాలి. ఏ ప్రభుత్వమైనా చేసేది అదే. ఎటొచ్చీ జగన్ చేస్తే, దండోరా వేసి బదనామ్ చేయడానికి ఎల్లో మీడియా వుంటుంది. చంద్రబాబు చేస్తే అదే ఎల్లో మీడియా అక్షరాల వెనుక దాచేస్తుంది. లేదూ కొంత మందికి ఇచ్చినా ఆ ఇచ్చేవారు కూడా తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఉభయకుశలోపరి మాదిరిగా వుంటుంది.

లేదా రెండు లక్షల ఉద్యోగాలు కల్పించేసాం అని లెక్కలు చూపించేసి, భృతి ఎగ్గొట్టడం అన్నది మరో ఆప్షన్ గా వుండనే వుంటుంది. చంద్రబాబు మాటల గారిడీ తెలిసిన వాళ్లకు మేనిఫెస్టో ఆశ్చర్యం అనిపించదు.