బాబు తీన్ నంబర్ కా.. దీదీ దస్ నెంబర్ కా..

జనాన్ని బుట్టలో పడేయడం మాత్రమే లక్ష్యం.. అందుకోసం ఎన్నెన్ని అలవిమాలిన వరాలు కురిపించడానికి అయినా పార్టీలు సిద్ధం. పేదలు అనే పదాన్ని ప్రయోగించి.. ఎడాపెడా వరాలు కురిపించడంలో ఎవ్వరూ తగ్గడం లేదు. ఓట్ల కక్కుర్తితో ఔచిత్యం లేని హామీలను ఇస్తున్నారు. ఇలాంటి వాటిలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీన్ నంబర్ కా.. అనుకుంటే.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను దస్ నంబర్ కా.. అని నిరూపించుకుంటున్నారు.

విషయం ఏంటంటే.. చంద్రబాబు తాను ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ తాను ఏకంగా ఏడాదికి పది సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ప్రజలకు తాయిలం ప్రకటించారు.

మమతా తాజాగా దీదీ ప్రతిజ్ఞ పేరుతో తమ తృణమూల్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఈ సంగతి పేర్కొన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని ఆమె అంటున్నారు. ఈ హామీని చూసిన వారు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళ ఆయిన దీదీకి అసలు ఒక కుటుంబానికి ఎంత గాస్ ఖర్చు అవుతుందో అవగాహన ఉన్నదా అని జనం జోకులు వేసుకుంటూ ఉన్నారు.

ఒక సగటు మధ్య తరగతి కుటుంబానికి ఒక గాస్ సిలిండర్ ఒకటిన్నర నెలకు పైగా వస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదల పరిమిత అవసరాలకు రెండు నెలల కంటే ఎక్కువే రావొచ్చు. అలాంటిది ఏడాదికి పది సిలిండర్లు ఉచితం అనడం మరీ అతిశయంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానని అన్నట్టుగా, షర్మిల ప్రతి మహిళకు నెలకు 8500 ఇస్తానని అన్నట్టుగా ఈ ప్రకటన ఉన్నదని విమర్శిస్తున్నారు.

రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ఇలాంటి అతిశయం ప్రదర్శించారు.  200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నారు. మధ్యతరగతి వినియోగం కూడా ఇంత ఉండదు. ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, గీజర్ అన్నీ ఉన్నా కూడా అన్ని యూనిట్లు కాలవు. పేదల పేరుతో ఇవి ఔచిత్యం ఎరగని హామీలు అని, నాయకులు ఓట్ల కక్కుర్తితో వ్యవస్థను దెబ్బ తీస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.