నామినేషన్ల పర్వం.. సినిమాలకు మరింత కష్టం

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. అంటే, ఎన్నికల వేడి పీక్ స్టేజ్ కు చేరుకుందని అర్థం. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి, అభ్యర్థుల్ని ప్రకటించాయి. వాళ్లంతా ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగబోతున్నారు. ప్రజలందరి దృష్టి ఎన్నికలపైనే ఉంది. దీంతో సినిమాలపై జనం ఫోకస్ తగ్గింది.

ఈ నేపథ్యంలో రేపు చాలా చిన్న సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మార్కెట్ మహాలక్ష్మి, శరపంజరం, తెప్ప సముద్రం, పారిజాతపర్వం, టెనెంట్ రేపు రిలీజ్ అవుతున్నాయి. వీటిని చూసేందుకు ఏ మేరకు జనాలు క్యూ కడతారనేది అనుమానాస్పదంగా మారింది.

అటు కొంతమంది మేకర్స్ మాత్రం తమ సినిమా కంటెంట్ పై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బాగుంటే ఎన్నికల వేడితో సంబంధం లేకుండా, తప్పకుండా జనం వస్తారని, టిల్లూ స్క్రేర్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు. కానీ ఆ తర్వాతొచ్చిన ఫ్యామిలీ స్టార్ సంగతి ఏంటి?

ఆ తర్వాత వారం ప్రతినిధి-2, లవ్ మీ, బాక్, రత్నం లాంటి సినిమాలున్నాయి. వీటికి కూడా పరిస్థితులు ఏమంత అనుకూలంగా కనిపించడం లేదు. ఎలక్షన్ ఫీవర్ కు తోడు మండే ఎండలు ఈ సినిమాల్ని ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రత్నం రిలీజ్ టైమ్ కి తమిళనాట ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి, కోలీవుడ్ లో విశాల్ సేఫ్.

ఇక మే నెలలో ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం, కృష్ణమ్మ, శబరి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలున్నాయి. కల్కి సినిమాను వాయిదా వేశారు, కొత్త విడుదల తేదీ మాత్రం ప్రకటించలేదు. ఎన్నికల వేళ రాబోతున్న ఈ సినిమాలన్నీ ఎలా నడుస్తాయో చూడాలి.