వలసలు ఇంకా కావాలి..!

జంటనగరాల పరిధిలో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేక పోయింది. అలాగని లైట్ తీసుకుంటే ఇప్పుడు పార్టీ పరువు మొత్తంగా గంగలో కలుస్తుందని భయం. డబుల్ డిజిట్ విజయాలు సాధిస్తామని తాము చెబుతున్న మాటలు నిజం కావాలంటే వారికి జంట నగరాల్లో కూడా విజయాలు తప్పనిసరి. అందుకని మరింతగా ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ఆలోచిస్తోంది.

రేవంత్ రెడ్డి సిఎం ఆయిన తర్వాత చాలామంది భారాస ఎమ్మెల్యేలు రేవంత్ తో టచ్ లోకి వచ్చినప్పటికీ, అందరికంటే ముందుగా దానం నాగేందర్ ను చేర్చుకోవడంలో మర్మం కూడా అదే. ప్రత్యేకంగా కెకె ఇంటికి రేవంత్ వెళ్లి మరీ.. నగర మేయర్ అయిన ఆయన కూతురు సహా పార్టీలో చేర్చుకోవడం కూడా అందుకే. ఇవి మాత్రం చాలవు అని.. జనతా నగరాల్లో ఇంకా ఇతర పార్టీల నుంచి బోలెడు వలసలు కావాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.

ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొన్నటి దాకా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి కూడా సిటీ పరిధిలోనే ఉంది. బీజేపీ తరఫున ఇక్కడ బలమైన అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఓడితే గనుక రేవంత్ పరువు పోతుంది. నాలుగు నెలల్లోనే రేవంత్ పని అయిపోయిందని, ఆయనపై వ్యతిరేకత ప్రబలిందని తాము చెబుతున్న మాటలు నిజమే అని భారాస విమర్శల దాడి గేర్ మారుస్తుంది. అందుకే.. ఈ నియోజకవర్గ పరిధిలో కూడా ఇంకా వలసలు కావాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.

అలాగే సికింద్రాబాద్ ప్రస్తుతం బిజెపి చేతిలో ఉంది. అక్కడ కిషన్ రెడ్డిని ఓడించడానికి కాంగ్రెస్ ఆశ్రయిస్తున్నది కూడా వలసల వ్యూహమే. ఎక్కువ విజయాలు నమోదు చేయాలనే కోరికతో హైదరాబాద్ కూడా గెలవాలని అనుకుంటున్నారు. అందుకే ఇంకా కసరత్తు సాగుతోంది. మొత్తానికి భారాస కు ముక్త కంఠంతో పట్టం కట్టిన రాజధానిలో నెగ్గాలంటే ఆ పార్టీ నుంచి వలసలు రాబట్టడం మార్గం అని వారు భావిస్తున్నారు.