కాంగ్రెస్ చ‌రిత్ర‌లోనే అతి త‌క్కువ స్థానాల‌కు!

దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం గురించి వేరే వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. దేశాన్ని సుదీర్ఘ‌కాలం పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్. అయితే ప్ర‌స్తుత కాంగ్రెస్ పార్టీ ప‌త‌నావ‌స్థ గురించి కూడా వివ‌రించ‌న‌క్క‌ర్లేదు! కాంగ్రెస్ పార్టీ అత్యంత ధీన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ప‌దేళ్లుగా లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష వాసం చేస్తోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల విష‌యంలో కూడా కాంగ్రెస్ కు మ‌రీ అంత ధీమా కూడా ఏమీ లేదు! గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే త‌మ పార్టీ ప‌రిస్థితి ఎంతో కొంత‌మెరుగైతే అదే ప‌దివేల‌న్న‌ట్టుగా కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్నారు.

అదేమో కానీ, ఈ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య ఆ పార్టీ చ‌రిత్ర‌లోనే అతి త‌క్కువ‌గా నిలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ హ‌స్తం గుర్తును ఈ సారి సుమారు 330 లోక్ స‌భ స్థానాల్లో పోటీలో పెట్ట‌గలుగుతోంది అంచ‌నా! ఇదీ ఆ పార్టీ ప్ర‌స్తుత ప‌రిస్థితి. 545 స్థానాల‌కు గానూ కేవ‌లం 330 స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ గుర్తు ఈవీఎంల‌పై ఉండ‌బోతోంది. 1951 నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల పోటీలో ఉంది. అయితే ఎప్పుడూ ఇంత ప‌రిమిత స్థాయిలో ఆ పార్టీ పోటీ చేయ‌లేదు!

గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 421 సీట్ల‌లో నామినేష‌న్ల‌ను వేయించ‌గ‌లిగింది. అయితే కేవ‌లం 52 సీట్ల‌లో మాత్ర‌మే కాంగ్రెస్ విజ‌యం సాధించింది. 2014 ఎన్నిక‌ల్లో ఈ పార్టీ 464 లోక్ స‌భ స్థానాల్లో పోటీ చేసి 44 సీట్ల‌లో విజ‌యం సాధించింది. మ‌రి ఇప్పుడు కాంగ్రెస్ త‌న పాత్ర‌ను త‌నే చాలా వ‌ర‌కూ త‌గ్గించేసుకుంది. పొత్తుల మీద ఆశ‌లు పెట్టుకుంది. కూట‌మిగా బ‌రిలోకి దిగి అనేక స్థానాల్లో మిత్ర‌ప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చింది. దీంతో ఆ పార్టీ కేవ‌లం 330 సీట్ల‌లో పోటీకే ప‌రిమితం అవుతోంది.

అయితే ఇది సీట్లన్నింటిలో కూడా కాంగ్రెస్ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌నేదేమీ లేదు! ఏపీలో ఆ పార్టీ 25 లోక్ స‌భ సీట్ల‌లో పోటీ చేస్తోంది. అయితే కాంగ్రెస్ పోటీలో ఉన్నా, లేక‌పోయినా పెద్ద తేడా లేదు ఆ రాష్ట్రంలో! ఇలా నామ‌మాత్ర‌పు పోటీ సీట్ల‌తో క‌లుపుకుని కాంగ్రెస్ పార్టీ 330 సీట్ల‌లో త‌న అభ్య‌ర్థుల‌ను పెట్ట‌గ‌లుగుతున్న‌ట్టుగా ఉంది!