‘దేవర’ మీద సితార మోజు!

ఎన్టీఆర్ సినిమా పోస్టర్ మీద సితార బ్యానర్ పడాలి. త్రివిక్రమ్ కు తప్ప మరెవరికీ హారిక బ్యానర్ వాడరు. ఎన్టీఆర్ తో సినిమా చేసే రేంజ్ దర్శకులను సితార సంస్థ తీసుకువచ్చినా, హరిక బ్యానర్ వాడరు. అప్పుడు సితార సంస్థ బ్యానర్ మీద ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనే నాగవంశీ కోరిక తీరేదెలా? పోనీ ఎన్టీఆర్ ను ఏదో విధంగా ఒప్పించవచ్చు అనుకున్నా, ఇప్పట్లో డేట్ లు దొరకవు.

దేవర రెండు భాగాలు, వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా. అంటే 2027 వరకు కూడా డైరీ ఖాళీ లేనట్లే. అందుకే ఎన్టీఆర్ సినిమా మీద తన పోస్టర్ పడాలి అనే కోరిక ను మరో విధంగా తీర్చుకుంటున్నారు నిర్మాత నాగవంశీ.

దేవర సినిమా రెండు రాష్టాల థియేటర్ హక్కులు తీసుకోవడం ద్వారా దేవర పోస్టర్ మీద తన సితార బ్యానర్ వేసుకోవచ్చు. ఈ సినిమా కొనడం ద్వారా తన కోరిక తీర్చుకోవచ్చు. ఎన్టీఆర్ కు మరింతగా చేరువ కావచ్చు, అవకాశం వుంటే భవిష్యత్ లో ఎన్టీఆర్ పాన్ ఇండియా హిందీ సినిమాల తెలుగు హక్కులు సంపాదించుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలతో ముందుకు దూకుతున్నారు నాగవంశీ.

రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను 130 కోట్ల మేరకు కోట్ చేస్తున్నారు దేవర మేకర్లు. పెద్ద బయ్యర్లు అయిన ఆసియన్ సినిమాస్, దిల్ రాజు ఈ రేట్ కు అంతగా మొగ్గు చూపలేదు. ఆసియన్ సంస్థ రిస్క్ కు అంగీకరించదు. దిల్ రాజు కోట్ చేసిన రేటుకు దేవర మేకర్లు ఓకె అనలేదు. ఇలాంటి టైమ్ లో నాగవంశీ సూత్ర ప్రాయంగా ఓకె చేసారు. రేటు ఈ రోజు ఫైనల్ కావచ్చు. 115 కోట్ల మేరకు వుంటుందని తెలుస్తోంది.

నైజాం 45 కోట్ల మేరకు, ఆంధ్ర 50 కోట్ల మేరకు లెక్క వేసుకుంటే సీడెడ్ 20 నుంచి 25 కోట్లకు ఇవ్వాల్సి వుంటుంది. ఈ లెక్కన కేవలం బ్యానర్ ప్రెస్టీజ్ కోసం నాగవంశీ ఈ డీల్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.