ఆ టికెట్ వెనుక‌... వేల‌కోట్ల వ్య‌వ‌హారం!

ఏలూరు లోక్‌స‌భ సీటును మాజీ మంంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి అల్లుడు పుట్టా మ‌హేశ్ యాద‌వ్‌కు ఇవ్వ‌డం వెనుక వేల కోట్ల వ్య‌వ‌హారం దాగి వుంద‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని టీడీపీ వ‌ర్గాలే చెప్ప‌డం విశేషం. టీడీపీలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడంటే గిట్ట‌ని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేయ‌డంలో స్పీక‌ర్‌గా య‌న‌మ‌ల కీల‌క పాత్ర పోషించారు.

దాన్ని అడ్డం పెట్టుకుని చంద్ర‌బాబు ద‌గ్గ‌ర త‌న‌కిష్టం వ‌చ్చిన ప‌నుల్ని చేయించుకుంటున్నార‌నే ఆరోప‌ణ టీడీపీ నేత‌ల నుంచే వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఏలూరు లోక్‌స‌భ టికెట్‌ను త‌న అల్లుడు, వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జ్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కుమారుడు మ‌హేశ్ యాద‌వ్‌కు ఇప్పించుకున్న సంగ‌తి తెలిసిందే. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్‌. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఇంత వ‌ర‌కూ సీమ నేత‌ల‌కు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చిన దాఖ‌లాలు ఇంత వ‌ర‌కూ లేవు.

అలాంటిది వైఎస్సార్ జిల్లాకు చెందిన పుట్టా మ‌హేశ్ యాద‌వ్ వైపు చంద్ర‌బాబు మొగ్గు చూప‌డం వెనుక భారీ ఆర్థిక లావాదేవీలున్నాయ‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికే దిక్కులేద‌ని, ఎక్క‌డి నుంచో తీసుకొచ్చి అల్లుడిని నిల‌బెడితే ఎలా ఆద‌రిస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఏలూరుకు య‌న‌మ‌ల త‌న అల్లుడిని తీసుకురావ‌డం వెనుక ఆర్థిక వ్య‌వ‌హారాలు ముడిప‌డి ఉన్నాయ‌ని ఆధారాల‌తో స‌హా టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

ఏలూరు లోక్‌స‌భ టీడీపీ ఇన్‌చార్జ్‌గా గొర్రుముచ్చు గోపాల్ యాద‌వ్ చ‌క్క‌గా ప‌ని చేసుకునేవారు. ఆయ‌న్ను కాద‌నుకోడానికి ఎలాంటి కార‌ణాలు కూడా లేవు. యాద‌వ్‌ను కాద‌ని, మ‌రో సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని నిల‌బెట్టాల‌ని అనుకుంటే, అది వేరే విష‌యం. కానీ మ‌హేశ్‌యాద‌వ్‌ను తీసుకురావ‌డం వెనుక కార‌ణం ఏంట‌బ్బా అని ఇంత కాలం ఎవ‌రికీ అంతుచిక్క‌లేదు. అస‌లు విష‌యాన్ని య‌న‌మ‌ల వ్య‌తిరేకులు లీక్‌లు ఇవ్వ‌డం విశేషం.

ఏలూరు పార్ల‌మెంట్ ప‌రిధిలో పోల‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం వుంటుంది. పోల‌వ‌రం జాతీయ నీటి ప్రాజెక్టులో వేల కోట్ల ప‌నుల్ని కేవ‌లం పుట్టా సుధాక‌ర్‌యాద‌వ్ కంపెనీకి చంద్ర‌బాబు క‌ట్ట‌బెట్టార‌ని గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ జ‌గ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, చంద్ర‌బాబునాయుడు దూర‌దృష్టితో ఆ ప్రాజెక్ట్ ప‌రిధిలోని పార్ల‌మెంట్ స్థానానికి మ‌హేశ్ యాద‌వ్‌ను పోటీ చేయిస్తున్నార‌నేది టీడీపీ నేత‌ల వాద‌న‌. మ‌రోసారి తామే అధికారంలోకి వ‌స్తామ‌ని, అప్పుడు పోల‌వ‌రం ప్రాజెక్ట్ వ‌ర్క్స్ త‌మ గుప్పిట పెట్టుకోవ‌చ్చనేది వారి ఎత్తుగ‌డ‌గా చెబుతున్నారు.

ఏలూరు పార్ల‌మెంట్ స్థానానికి తామే ప్రాతినిథ్యం వ‌హిస్తే బాగుంటుంద‌నే వ్యూహంతో గోపాల్ యాద‌వ్‌ను ప‌క్క‌న పెట్టార‌నేది తాజా సమాచారం. అయితే గోపాల్‌యాద‌వ్‌ను త‌ప్పించ‌డం వెనుక ఆర్థిక వ్య‌వ‌హారాల గురించి తెలియ‌క‌, టీడీపీలోనే ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. య‌న‌మ‌ల‌, చంద్ర‌బాబు క‌లిసి వేల‌కోట్ల పోల‌వ‌రం ప‌నుల‌ను హ‌స్త‌గ‌తం చేసుకునే కుట్ర‌లో భాగంగానే మ‌హేశ్‌యాద‌వ్‌ను ఏలూరు తెర‌పైకి తెచ్చార‌నే ర‌హ‌స్య స‌మాచారాన్ని టీడీపీ నేత‌లు లీక్‌లు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.