ఎంపీ సీటు వద్దు అంటున్న సీఎం?

ఆయన పేరులో సీఎం ఉన్నాడు. కానీ ఎంపీగానే పరోక్ష ఎన్నికల్లో రెండు సార్లు గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగుతున్నారు. ప్రజల చేత ఎన్నిక అయి లోక్ సభ మెట్లు ఎక్కాలని ఉబలాటపడుతున్నారు. రాజ్యసభ మాజీ ఎంపీ సీఎం రమేష్ ఇపుడు అనకాపల్లి వద్దు అని అంటున్నారా అన్నది హాట్ డిస్కషన్ గా ఉంది.

ఆయన అనకాపల్లిలో ఒక విడత పర్యటించారు. అక్కడ కూటమిలో లుకలుకలు ఉన్నాయి. సీనియర్ నేతల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. వారితో భేటీ అవుతూ అందరినీ కలుపుకుని పోవాలని చూస్తున్నారు. అది అలా ఉంటే పూర్తిగా గ్రామీణ నేపధ్యం కలిగిన అనకాపల్లిలో స్థానికులకే చోటు అన్న వైసీపీ నినాదం సీఎం రమేష్ ని కలవరపెడుతోంది అంటున్నారు.

లక్ష మెజారిటీకి తగ్గకుండా గెలుస్తాను అని వైసీపీ అభ్యర్ధి బూడి ముత్యాలనాయుడు ఇచ్చిన ప్రకటన కూటమిలో ప్రకంపనలు పుట్టిస్తోంది. లోకల్ ఫీలింగ్ కనుక సక్సెస్ అయితే షాక్ భారీగా తగులుతుందన్న ఆలోచనలు కూటమిలో సాగుతున్నాయని అంటున్నారు.

సీఎం రమేష్ ఈ విషయంలో పునరాలోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఆయన విశాఖ ఎంపీ సీటు కోరుకున్నారు. విశాఖ అయితే మెట్రో సిటీ. బీజేపీకి పట్టు ఉంది. నాన్ లోకల్ పట్టింపు లేనిది. అక్కడ జెండా ఎగరేయవచ్చు అని ఆయన భావించారు. కానీ అనకాపల్లి ఇచ్చి సర్దుకోమన్నారు.

ఇపుడు అనకాపల్లిలో లోతుగా చూస్తే అసలు విషయం అర్ధం అవుతోంది అంటున్నారు. దీని మీద ఎలమంచిలి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ అధిష్టానం వద్ద తన సీటు మార్చమని సీఎం రమేష్ గోడు వినిపించుకుంటున్నారు అని సంచలన కామెంట్స్ చేశారు.

కూటమి అయోమయంలో ఉందని ఆయన అంటున్నారు. ఎలమంచిలిలో తన మీద పోటీకి ఇంకా కూటమి సర్వేల మీద సర్వేలు చేయిస్తోందని ఆయన అంటున్నారు. వైసీపీ అనకాపల్లి ఎంపీ సీటు తో పాటు మొత్తం అసెంబ్లీ సీట్లలో విజయకేతనం ఎగరేస్తుందని ఆయన ధీమాగా చెబుతున్నారు.

కన్నబాబు రాజు నోటి వెంట సీఎం రమేష్ తన సీటు మార్చమని కోరుతున్నారని వార్త రావడంతో  అసలు కూటమిలో ఏమి జరుగుతోంది అన్నది అంతా తర్కించుకుంటున్నారు. సీఎం రమేష్ అనకాపల్లి వద్దు అంటే ఆ సీటు ఎవరికి వెళ్తుంది, అసలు ఆయన ఎందుకు వద్దు అంటున్నారు, ఆయన వద్దు అంటున్నది నిజమేనా అన్న చర్చకు తెర లేస్తోంది. వీటిని చూస్తూంటే కూటమిలో ఏదో తెర వెనక జరుగుతోందని అంటున్నారు.