బ‌రిలో వ‌ర‌దాపురం సూరి?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రంలో ఆసక్తిక‌ర రాజ‌కీయాలు సాగుతున్నాయి. ధ‌ర్మ‌వ‌రం సీటును బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ నుంచి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వై.స‌త్య‌కుమార్ పోటీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు అధికారికంగా టికెట్ కేటాయించిన సంగ‌తి తెలిసిందే.

ధ‌ర్మ‌వ‌రం సీటును ఆశించిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి షాక్‌కు గుర‌య్యారు. సూరికి టికెట్ లేకుండా చేసేందుకే ప‌రిటాల కుటుంబం వ్యూహాత్మ‌కంగా స‌త్య‌కుమార్‌ను తెర‌పైకి తెచ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ధ‌ర్మ‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన సూరి వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న బీజేపీలో చేరారు. దీంతో ధ‌ర్మ‌వ‌రం టీడీపీ ఇన్‌చార్జ్‌గా ప‌రిటాల శ్రీ‌రామ్‌ను చంద్ర‌బాబునాయుడు నియ‌మించారు.

రాప్తాడు, ధ‌ర్మ‌వ‌రం సీట్ల‌ను ప‌రిటాల కుటుంబం కోరింది. కానీ రెండు సీట్లు ఇచ్చేందుకు చంద్ర‌బాబు అంగీక‌రించ‌లేదు. కేవ‌లం రాప్తాడుకే ప‌రిటాల కుటుంబాన్ని ప‌రిమితం చేశారు. ధ‌ర్మ‌వరాన్ని బీజేపీకి కేటాయించి, సూరిని నిల‌బెడ‌తార‌నే ప్రచారం పెద్ద ఎత్తున జ‌రిగింది. సూరికి టికెట్ ఇస్తే, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హ‌క‌రించేది లేద‌ని ప‌రిటాల శ్రీ‌రామ్ హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో సూరికి కాకుండా స్థానికేత‌రుడైన స‌త్య‌కుమార్‌ను ధ‌ర్మ‌వ‌రం తెర‌పైకి తేవ‌డం స‌రికొత్త చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ క్ర‌మంలో ఈ నెల 31న సూరి ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. సూరి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో వుంటార‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. త‌న‌కంటూ బ‌ల‌మైన వ‌ర్గం క‌లిగిన సూరి, మ‌రెవ‌రి రాజ‌కీయం కోస‌మో త‌నను తాను బ‌లిపెట్టుకుంటార‌ని అనుకోలేం. త‌ప్ప‌నిస‌రిగా ఆయ‌న పోటీలో వుంటార‌ని, మ‌రీ ముఖ్యంగా ప‌రిటాల కుటుంబానికి త‌న స‌త్తా ఏంటో చూపుతార‌ని ఆయ‌న అనుచ‌రులు వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. సూరి పోటీలో వుంటే, స‌త్య‌కుమార్ ప‌రిస్థితి ఎలా వుంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.